kisan rally
-
ఢిల్లీలో 50వేల మందితో ‘కిసాన్ గర్జన’.. మరో రైతు ఉద్యమానికి సన్నాహమా?
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెలలతరబడి వేలాది మంది రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసింది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. కానీ, కేంద్రం వైఖరిపై ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో సోమవారం సుమారు 50వేల మంది రైతులు సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ పిలుపు ఇచ్చిన ‘కిసాన్ గర్జన’ ర్యాలీ కోసం ఢిల్లీ రామ్‌లీలా మైదానానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రైతులు. రైతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రైతు రుణాల మాఫీ, పంటలకు సరైన ధర, పాడైన పంటలకు పరిహారం వంటి డిమాండ్లతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ సమావేశం రైతలు బలాన్ని సూచిస్తుందని పలువురు తెలిపారు. మరోవైపు.. సాగు చట్టాల రద్దు సమయంలో రైతుల డిమాండ్లు తీరుస్తామని కేంద్ర ప్రభుత్వ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల అమలును గుర్తు చేసినట్లవుతోందన్నారు. బీకేఎస్ డిమాండ్లలో ప్రధానమైనవి.. ► అన్ని పంట ఉత్పత్తులపై లాభదాయకమైన ధరలు ► పంట ఉత్పత్తులపై ఎలాంటి జీఎస్టీ ఉండకూడదు ► కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్న సాయాన్ని పెంచడం ► జన్యుపరంగా మార్పు చేసిన ఆవాల విత్తనాలకు అనుమతులు ఇవ్వకూడదు ► రైతు అనుకూల ఎగుమతి, దిగుమతులు విధానాన్ని రూపొందించటం ► 15 ఏళ్ల వాహనాల తక్కు పాలసీ నుంచి రైతుల ట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వడం కాంగ్రెస్ హెచ్చరిక.. దేశ రాజధానిలో మరోసారి భారీ స్థాయిలో రైతులు సమావేశం కావడంపై హెచ్చరికలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. గతంలో జరిగిన విషయాల నుంచి నేర్చుకుని భవిష్యత్తులో మళ్లీ ఎదురవకుండా చూసుకోవాలన్నారు. రైతుల సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాల్సిన సమయం ఇదేనని, లేదంటే వారు మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు.. గతంలో రైతుల ఆందోళనలతో ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కిసాన్ గర్ణన వేళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రామ్‌లీలా మైదనానికి వెళ్లే దారులను మళ్లించారు. మహరాజ్ రంజీత్ సింగ్ మార్గ్, మిర్దార్ద్ చౌక్, మింటో రోడ్, అజ్మేరి గేట్, ఛమన్‌లాల్ మార్గ్, ఢిల్లీ గేట్ వంటి మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చారు. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్ అమలు -
‘దీక్షా’దక్షతకు సలాం
ఒకే డిమాండ్, ఒకే ఒక్క డిమాండ్ మూడు ‘నల్ల’ సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలనే ఆ ఒక్క డిమాండ్ సాధన కోసం రైతన్నలు ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం చేశారు లాఠీలు విరిగినా, కేసులు పెట్టినా, హింస చెలరేగినా వాహనాలే యమపాశాలై ప్రాణాలు తీసినా అదరలేదు, బెదరలేదు, వెనకడుగు వెయ్యలేదు ఎండనక వాననక, గడ్డకట్టించే చలిని లెక్కచేయక కరోనా మహమ్మారికి బెదిరిపోక ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లోనే ఏడాదిగా మకాం వేసి చివరికి ఎలాగైతేనేం కేంద్రం మెడలు వంచారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన పోరాటం పంజాబ్‌లో మొదలై హరియాణాకి వ్యాపించి, ఉత్తరప్రదేశ్‌లో హింసకు దారి తీసి దేశవ్యాప్తంగా అన్నదాతల్ని ఏకం చెయ్యడంతో కేంద్రం దిగొచ్చింది. కరోనాని లెక్కచేయకుండా, చలి ఎండ వాన వంటి వాతావరణ పరస్థితుల్ని తట్టుకొని, భార్యాపిల్లల్ని విడిచిపెట్టి, రోడ్లపైనే నిద్రించి మొక్కవోని దీక్షతో ఏడాది పాటు సుదీర్ఘంగా సాగిన ఉద్యమంలో రైతన్నలు చివరికి విజయం సాధించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020 జూన్‌లో వ్యవసాయ చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడంతో ఈ చట్టాలను దొడ్డదారిలో తెచ్చింది తమ పుట్టి ముంచడానికేనని రైతన్నలు బలంగా నమ్మారు. కిసాన్ సంఘర్‡్ష సమన్వయ కమిటీ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది. సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను ఆమోదించడంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్3 న వివిధ రైతు సంఘాలు చేసిన రైతు నిరసనలు మొదట్లో పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితమయ్యాయి. నవంబర్ 25న రైతు సంఘాలు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి దానిపై పడింది. కేంద్ర ప్రభుత్వం పదకొండు రౌండ్లు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఏడాదిన్నర పాటు చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న కేంద్రం ప్రతిపాదనలకు కూడా రైతులు అంగీకరించలేదు. చట్టాల రద్దు తప్ప మరి దేనికీ తలవంచమంటూ పోరుబాట పట్టారు. ప్రతీ దశలోనూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతలా అణిచివేయాలని చూస్తే అంతలా పైపైకి లేచింది. ఒక్కో ఎదురుదెబ్బ తగిలినప్పుడలా మరింత బలం పుంజుకుంటూ వచ్చింది. దేశవ్యాప్తంగా 40 సంఘాలకు చెందిన రైతులు ‘సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)’ పేరిట ఒకే గొడుకు కిందకు వచ్చి ఢిల్లీ, హరియాణా, యూపీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ వద్ద శిబిరాలు వేసుకొని అక్కడే మకాం వేశారు. కుటుంబాలను విడిచిపెట్టి వచ్చిన రైతులు సామూహిక వంటశాలలు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసుకొని ఏడాదిగా అక్కడే ఉంటున్నారు. ‘కిసాన్ ఏక్తా జిందాబాద్’ అన్న నినాదం ఢిల్లీలో మారుమోగడమే కాదు, అదే ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎర్రకోట సాక్షిగా మలుపు తిరిగిన ఉద్యమం ఒకానొక దశలో సాగు చట్టాలపై రైతుల ఉద్యమం నీరుగారిపోతుందని అందరూ భావించారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్రదినోత్సవం నాడు రైతు సంఘాల నాయకులు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింస, ఘర్షణలు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పాయి. కొంతమంది నిరసనకారులు ఎర్రకోట గోడలు మీదుగా ఎక్కి సిక్కు మతం చిహ్నమైన నిషాన్ సాహిబ్ జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలతో రాజధాని రణరంగంగా మారింది. రైతు ఉద్యమం ఖలిస్తాన్ వేర్పాటువాద చేతుల్లోకి వెళ్లిపోయిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో రైతులు సరిహద్దులు ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పెట్టుకున్న కన్నీళ్లు మళ్లీ ఉద్యమ నిప్పుకణికని రాజేసాయి. ఇంటి బాట పట్టిన నిరసనకారులందరూ తిరిగి ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేశారు. ఏడాదిగా జరుగుతున్న ఈ పోరాటంలో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతో 700 మందికి పైగా రైతులు మరణించారు. మరెందరో రైతులపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. యూపీకి వ్యాపించి, రణరంగంగా మారి: ఆ తర్వాత నుంచి రైతు సంఘం నాయకులు పక్కా ప్రణాళికతో రహదారులు దిగ్బంధించడం, రైలు రోకోలు, నిరసన ర్యాలీలు, బ్లాక్ డే వంటివి చేస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాకేశ్ తికాయత్ ర్యాలీలు చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రైతు ఉద్యమం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ పాప్ స్టార్ రిహన్నా దీనిపై మనం ఎందుకు మాట్లాడడం లేదు అంటూ లేవనెత్తిన ప్రశ్నతో అంతర్జాతీయంగా అన్నదాతలకు మద్దతు లభించింది. టీనేజీ పర్యావరణవేత్త గ్రేటా థెన్‌బర్గ్ , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు లాయర్ అయిన మీనా హ్యారిస్ వంటివారు రైతుల గళానికి బలంగా నిలిచారు.మే 27న రైతు ఉద్యమానికి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బ్లాక్ డే పాటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో 200 మందికిపైగా రైతులు జంతర్మందర్ దగ్గర కిసాన్ సంసాద్ నిర్వహించారు. సెప్టెంబర్5న యూపీలోని ముజఫర్‌నగర్‌లో రైతు సంఘం నాయకులు బలప్రదర్శన చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదీ తమ బలం అంటూ చూపించారు. ఇక యూపీలోని లఖీమ్‌పూర్‌ఖేరిలో అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకి వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతన్నలపై ఎస్యూవీ దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు బలి కావడం , ఆ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారన్న ఆరోపణలు మోదీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో రైతులపై ప్రజల్లో సానుభూతి పెల్లుబుకింది. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతు ఉద్యమం అంతకంతకూ బలం పుంజుకుంటూ ఉండడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఏడాది పాటు జరిగిన జరిగిన ఉద్యమం విజయతీరాలకు చేరుకుంది. సుప్రీం నిలిపివేసినా... ఉద్యమం ఆగలేదు! వ్యవసాయ చట్టాలపై ఒకవైపు రైతులు వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు డిసెంబర్ 11న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి విచారించడానికి ఈ ఏడాది జనవరి 7న సుప్రీం కోర్టు అంగీకరించింది. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక కమిటీ వేయడానికి జనవరి 11న అంగీకరించింది. ఆ మర్నాడు జనవరి 12న వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ నిపుణులు అనిల్ ఘన్వత్, అశోక్ గులాటీ, ప్రమోద్ జోషిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికని మార్చి 19న సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దాని ప్రక్రియను పూర్తి చేస్తే ఇక న్యాయస్థానంలో కేసే ఉండదు. ఆ పిటిషన్లన్నీ ప్రయోజనం లేకుండా మిగిలిపోతాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
రైతుల ఉద్యమంలో నిరసనకారులు పెరగడానికి కారణమేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలుగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఢిల్లీ–హరియాణా సింఘు సరిహద్దులో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఉద్యమం నెమ్మదిగా చల్లబడుతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, సింఘు సరిహద్దులో ఢిల్లీ వైపు నిరసనకారుల సంఖ్య ఈమధ్య కాలంలో నెమ్మదిగా పెరుగుతోంది. సింఘు బోర్డర్–నరేలా రహదారిపై పంజాబ్ నుంచి వస్తున్న నిరసనకారుల ట్రాక్టర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో జరుగుతున్న పరిణామాల వెనుక కొత్త కారణాలు బయటికి వస్తున్నాయని ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి ఇక్కడ కొందరు నిరసనకారులు ఆందోళన తమ హక్కుగా భావించి పాల్గొంటుంటే, మరికొంత మంది ఆందోళనలో పాల్గొనడాన్ని ఒక పనిగా భావిస్తూ పాల్గొంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు వస్తున్న పంజాబ్‌లోని కొంతమంది రైతులు స్థానికంగా విధించే జరిమానాలకు భయపడి ఉద్యమంలో పాల్గొంటున్నారు. దీంతో సింఘు సరిహద్దులో నిరసనకారుల సంఖ్య పెరిగింది. పంజాబ్‌లోని సుమారు 75శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన బాధ్యత వారిపై చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇటీవల పంజాబ్‌లోని గ్రామాధిపతులు అనధికారికంగా ఒక ఆదేశాన్ని జారీ చేశారు. దీని ప్రకారం పంజాబ్‌లోని ప్రతీ కుటుంబానికి చెందిన కనీసం ఒక సభ్యుడు నెలకు ఒకసారి అయినా ఉద్యమం జరుగుతున్న సింఘు సరిహద్దుకు వచ్చి కనీసం పది రోజుల పాటు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలా చేయడంలో ఏ కుటుంబం అయినా విఫలమైతే వారికి జరిమానా విధిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇక్కడకు రావడానికి ఇష్టపడని వారిని కుటుంబ సభ్యులు జరిమానాలకు భయపడి బలవంతంగా పంపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సింఘు సరిహద్దులో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు విదేశాల నుంచి భారీగా నిధులు సమకూరుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ నిరసనలో పాల్గొంటున్న వారికి అవసరమైన ఖర్చు విషయంలో ఎవరూ వెనకడుగు వేయట్లేదు. దీంతో ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చినవారు 10 నుంచి 15 రోజుల పాటు అక్కడే నిరసన కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు. సింఘు సరిహద్దుల్లో జరుగుతున్న నిరసనల్లో కేవలం పంజాబ్‌కు చెందిన వారే పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాలైన హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిరసనకారులు ఎవరూలేరు. గతంలో సింఘు సరిహద్దులో యువత ఎక్కువగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా వృద్ధులే నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వారిలో అనేకమందిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. దీంతో భవిష్యత్తులో ఈ కేసులు ప్రతిబంధకంగా మారుతాయనే భయంతో ఆందోళనలో పాల్గొనే యువత సంఖ్య తగ్గిందని భావిస్తున్నారు. 50వేల మందితో జింద్‌లో మహా పంచాయత్ ఈనెల 4న హరియాణాలోని జింద్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన కిసాన్ మహాపంచాయత్ ర్యాలీని బహిష్కరిస్తున్నట్లు హరియాణా సంయుక్త మోర్చా ఇంఛార్జ్ ప్రదీప్ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్ణయించింది. హరియాణాలో బీజేపీ–జేజేపీ ప్రభుత్వంపై రైతుల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తమవైపు తిప్పుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే 4న ఆప్ రాజ్యసభ సభ్యుడు సుశీల్ గుప్త సొంత ప్రాంతమైన జింద్‌లో 50వేల మందితో కిసాన్ మహా పంచాయత్ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సభలో ఎలాంటి జెండాలు కానీ, పార్టీ గుర్తులు వాడబోమని ఆప్ తెలిపింది. ఇక్కడ చదవండి: సుప్రీంకోర్టుకు ‘సాగు చట్టాల’పై నివేదిక హోలీ మంటల్లో సాగు చట్టాల ప్రతులు -
‘బతుకులు అధ్వానంగా ఉన్నాయి.. దయచేసి క్షమించండి’
సాక్షి, న్యూఢిల్లీ : ‘మమ్మల్ని క్షమించండి. మా వల్ల మీకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. మేము అన్నదాతలం. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన మాకు లేదు. కానీ మా జీవితాల్లో కల్లోలం చెలరేగింది. మా బతుకులు అధ్వానంగా ఉన్నాయి. గత 20 ఏళ్లలో 3 లక్షల మంది రైతు సోదరులు మరణించారు. అందుకే మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి, ‘మీ’ దృష్టికి తీసుకువచ్చేందుకే ఇదుగో ఇలా ర్యాలీ నిర్వహించాం’ అని రైతన్నలు రామ్‌లీలా మైదానం ప్రాంగణం ఆవరణలో అంటించిన కరపత్రాలు ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. బడా మాల్స్‌లో వందలాది రూపాయలు ఖర్చు పెట్టి సరుకులు కొనే మనం ఆరుగాలం శ్రమించి రైతు పండించిన కూరగాయల దగ్గర నుంచి ప్రతీ వస్తువును బేరమాడి కొంటామనే విషయాన్ని గుర్తు చేయడంతో పాటు... దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు ఈ దుస్థితి ఏర్పడటంలో మన వంతు పాత్ర కూడా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర కల్పించాలని, శాశ్వతంగా రుణ విముక్తి కల్పించాలన్న డిమాండ్లతో అన్నదాతలు దేశ రాజధానిలో ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీలో రెండు రోజుల కవాతు జరిగింది. రామ్‌లీలా మైదానం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని పార్లమెంటుకు ర్యాలీగా బయల్దేరారు. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు వీరిని జంతర్‌మంతర్ వద్దే అడ్డుకోవడంతో అక్కడే రైతు పార్లమెంట్ నిర్వహించి తమ డిమాండ్లపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో ఢిల్లీ ప్రజలకు కలిగిన అంతరాయానికి చింతిస్తూ రైతన్నలు కరపత్రాలు అంటించారు. వారి సమస్యలను వివరించడంతో పాటుగా తాము పంటను అమ్ముకునేటపుడు దళారీలు చెల్లించే ధరకు, అవి వినియోగదారులను చేరే నాటికి ఉంటున్న ధరకు వ్యత్యాసాన్ని చూపిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. ‘పండించినపుడు కిలో పప్పు ధర రూ. 46. కానీ మార్కెట్లో 120 రూపాయలు. కిలో టమాట ధర రూ.5. అదే వినియోగదారుడిని చేరే వరకు రూ.30, రైతుల వద్ద కిలో ఆపిల్ ధర. 10, అదే అమ్మకం నాటికి 110 రూపాయలు అంటూ వివిధ సరుకులకు సంబంధించిన ధరల వ్యత్యాసాన్ని పొందుపరిచిన అన్నదాతలు... ‘రైతులుగా తక్కువ ధరకు అమ్ముకుంటాం. వినియోగదారులుగా ఎక్కువ ధర వెచ్చించి కొనుక్కుంటాం’ అంటూ దళారీ వ్యవస్థ రైతులకు చేస్తున్న అన్యాయం గురించి తెలియజేశారు. కాగా ఢిల్లీలో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ర్యాలీగా చెబుతున్న ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ నాయకులు మేథాపాట్కర్, యోగేంద్ర యాదవ్, అతుల్ కుమార్, హన్నన్ మొల్లా, కవితా కురగంటి, వీఎంకే సింగ్ తదితరులు ముందు నడవగా రైతులు వారిని అనుసరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని సంఘీభావం తెలిపారు. -
గర్జించిన అన్నదాత
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అన్నదాత గర్జనతో రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతులు శుక్రవారం నిర్వహించిన మహా ర్యాలీ విజయవంతమైంది. సప్త వర్ణాలను తలపించేలా పతాకాలు చేతబట్టిన రైతన్నలు రామ్‌లీలా మైదానం నుంచి పార్లమెంటు స్ట్రీట్‌కు సమీపంలోని జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. అడుగడుగునా పోలీసు బందోబస్తు, దారిపొడవునా బారికేడ్లు, వాటర్ క్యానన్లు, పోలీసు కెమెరాలు, సాయుధ బలగాలకు తొణకకుండా ముందుకు సాగారు. పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర కల్పించాలని, శాశ్వతంగా రుణ విముక్తి కల్పించాలన్న డిమాండ్‌తో అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) ఇచ్చిన పిలుపు మేరకు ఈ రెండు రోజుల కవాతు జరిగింది. రామ్‌లీలా మైదానం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని పార్లమెంటుకు ర్యాలీగా బయల్దేరారు. కానీ జంతర్‌మంతర్ వద్దే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రైతు పార్లమెంట్ నిర్వహించి తమ డిమాండ్లపై పలు తీర్మానాలు చేశారు. ఢిల్లీలో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ర్యాలీగా చెబుతున్న ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ నాయకులు మేథాపాట్కర్, యోగేంద్ర యాదవ్, అతుల్ కుమార్, హన్నన్ మొల్లా, కవితా కురగంటి, వీఎంకే సింగ్ తదితరులు ముందు నడవగా రైతులు వారిని అనుసరించారు. అయోధ్య కాదు..రుణ మాఫీ కావాలి: డప్పు నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, కోలాటాలు, విచిత్ర వేషాలు, గిరిజన నత్యాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలు, ఉరితాళ్లు, అప్పుల కోసం రాసిన ప్రామిసరీ నోట్లు వంటివి ప్రదర్శిస్తూ రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ‘అయోధ్య–రామజన్మభూమి కాదు.. రుణాలు మాఫీ కావాలి’, ‘రైతుల్ని రుణభారం నుంచి విముక్తం చేయాలి’, ‘చౌకీదార్ బడాచోర్’, ‘మోదీ కిసాన్ విరోధి’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘కిసాన్ ఏక్తా– జిందాబాద్’ లాంటి నినాదాలు ఢిల్లీ వీధుల్లో మార్మోగాయి. పోలీసులు అడ్డగించిన చోటల్లా రైతు ఉద్యమకారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, పంజాబ్సహా దేశంలోని 24 రాష్ట్రాల రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన మహిళలు అనేక మంది అప్పుల భారంతో మరణించిన తమ కుటుంబ పెద్దల ఫొటోలను చేతబూని ర్యాలీలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు.. ‘రుణమాఫీ పెద్ద దగా’ అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. రైతు సమస్యలే అజెండా కావాలి... జంతర్‌మంతర్ వద్ద రైతు పార్లమెంట్(సభ)లో పలువురు వక్తలు ప్రసంగిస్తూ.. రైతులు బిచ్చగాళ్లు కాదని, అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపై నిలిచి ఒకే వాణి వినిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదీ బతికి బట్ట కట్టలేదని, అయోధ్య, రామజన్మభూమి..రైతు ఆత్మహత్యల కన్నా ఎక్కువ కాదని అన్నారు. మరోవైపు, రుణ విముక్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులకు అన్ని రాజకీయ పార్టీల మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తూ రైతు సదస్సు తీర్మానం చేసింది. రైతు మేనిఫెస్టోను ఆమోదిస్తూ మరో తీర్మానం చేసింది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏకేఎస్సీసీ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జంతర్‌మంతర్ వద్ద రైతుల్ని ఉద్దేశించి ప్రసంగించిన వారిలో రాహుల్, కేజ్రీవాల్‌తో పాటు సీతారాం ఏచూరీ (సీపీఎం), సురవరం సుధాకరరెడ్డి (సీపీఐ), శరద్ పవార్ (ఎన్సీపీ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), శరద్ యాదవ్ (ఎల్జేడీ) తదితర జాతీయ నాయకులున్నారు. సంపన్నులకేనా రుణమాఫీ: రాహుల్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానికి సన్నిహితులైన 15 మంది బడా పారిశ్రామికవేత్తలు బకాయిలు పడిన రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేసిన ప్రభుత్వం రైతు రుణాలను ఎందుకు విస్మరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. రైతులు ప్రభుత్వం నుంచి ఉచిత కానుకలు కోరడం లేదని వారు అడుగుతున్న రుణమాఫీ, మద్దతు ధర వారి హక్కని రైతు సభలో పేర్కొన్నారు. రైతులు, యువత గొంతుకల్ని ప్రభుత్వం అణగదొక్కలేదని, ఒకవేళ వారిని అవమానిస్తే ఆ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. ఫసల్ బీమా యోజన ద్వారా అనిల్ అంబానీ సంస్థలకు ప్రధాని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. బీమా పథకాన్ని రెండుగా విభజించి అంబానీ, అదానీ సంస్థలకు పంచిపెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ..స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా రైతులను ప్రధాని నరేంద్ర మోదీ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్డీయే హయాంలో వ్యవసాయ రంగం తిరోగమన బాట పట్టిందని, అందువల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ విభజనవాద రాజకీయాలపై గళమెత్తాలని, రైతు సమస్యలపై అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. మోదీ–అమిత్ షా ద్వయాన్ని ఆయన దుర్యోదన–దుశ్శాసనలుగా అభివర్ణించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రైతులు ఢిల్లీలో జరిగిన మహా ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రైతులు -
కిసాన్ మార్చ్‌లో రాహుల్, కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం శూన్య హామీలు మినహా రైతులకు ఎలాంటి మేలూ చేయలేదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగిన కిసాన్ మార్చ్‌లో రాహుల్ పాల్గొన్నారు. మద్దతు ధర పెంపు, బోనస్‌లపై రైతులకు వాగ్ధానం చేసిన మోదీ ఇప్పుడు హామీలు నెరవేర్చకుండా కబుర్లు చెబుతున్నారని ఆక్షేపించారు. పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తే రైతు రుణాలను కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తాము రైతుల పక్షాన ఉండి వారి తరపున పోరాటం చేస్తామని రాహుల్ అన్నదాతలకు భరోసా ఇచ్చారు. మీ శక్తితోనే ఈ దేశం బలోపేతమైందని అన్నారు. దేశం నలుమూలల నుంచీ రాజధానికి చేరుకున్న వేలాది రైతులు పార్లమెంట్ స్ర్టీట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సంఘీభావ సభలో పలువురు నేతలు రైతులకు బాసటగా నిలిచారు. మోదీ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో రైతులు మోదీ సర్కార్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని రైతుల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త మేథా పాట్కర్ ఆరోపించారు. రైతులు, గిరిజనుల భూములను బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. -
దేశ రాజధానికి పోటెత్తిన రైతులు
సాక్షి,న్యూఢిల్లీ : రుణ మాఫీ, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు సహా తమ డిమాండ్ల సాధనకు రెండు రోజుల పాటు నిరసన తెలిపేందుకు దేశవ్యాప్తంగా రైతులు గురువారం వేలాదిగా రాజధానికి తరలివచ్చారు. రాంలీలా మైదాన్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకూ శుక్రవారం జరిగే ర్యాలీకి ఏపీ, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, యూపీ సహా పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దేశ రాజధాని చేరుకున్నారు. రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికుల సంఘాలతో కూడిన అఖిల భారత రైతు సంఘర్ష్ సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలో పాల్గొనేందుకు రైతులు బస్సులు, రైళ్లు సహా పలు మార్గాల్లో రాజధానికి పోటెత్తారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలు, పంజాబ్, హర్యానా, యూపీ నుంచి రైతులు గురువారం ఉదయం నుంచే ఢిల్లీకి చేరుకున్నారని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. నగరం నలుమూల నుంచి రాంలీలా మైదాన్‌కు రైతులు తరలివస్తుండటంతో ఢిల్లీలో పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. లక్షకు పైగా రైతులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు రైతు ర్యాలీ సందర్భంగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను సిద్ధం చేశారు. ట్రాక్టర్లు, ట్రక్కులను నగరంలోకి అనుమతించమని ఘజియాబాద్ ఎస్పీ ఉపేంద్ర అగర్వాల్ స్పస్టం చేశారు. అడ్డుకుంటే అంతే.. తమ ర్యాలీని అడ్డుకుంటే పార్లమెంట్ వరకూ నగ్న ప్రదర్శన చేపడతామని తమిళనాడుకు చెందిన రైతులు హెచ్చరించారు. ఢిల్లీకి చేరుకున్న 1200 మంది సభ్యులతో కూడిన రైతుల బృందం శుక్రవారం నాటి ర్యాలీకి సన్నద్ధమైంది. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు తమ సహచరుల పుర్రెలతో వీరు దేశ రాజధానికి చేరుకోవడం అలజడి రేపుతోంది. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న ఎనిమిది మంది రైతుల పుర్రెలతో గత ఏడాది జంతర్ మంతర్ వద్ద వీరు నిరసనలకు దిగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమ సంఘానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకుంటున్నారని రైతు సంఘం నేత అయ్యకన్ను చెప్పారు. గత ఐదేళ్లుగా తాము కరువును ఎదుర్కొంటున్నామని ప్రభుత్వాలు రైతుల కోసం చేస్తున్నదేమీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
వైరల్ ఫోటో : క్షమాపణలు చెప్పిన నేత
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఏదైనా అంశం వైరల్‌గా మారితే చాలు.. అది వాస్తవమో.. కాదో తెలుసుకోకుండానే దాన్ని మరో నలుగురికి షేర్ చేయడం.. దాని గురించి తోచిన కామెంట్ పెట్టడం.. ఆనక అది కాస్తా వాస్తవం కాదని తెలిశాక క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురయ్యింది సీపీఐ(ఎమ్ఎల్) నేత కవితా కృష్ణన్‌కి. మంగళవారం ‘గాంధీ జయంతి’ సందర్భంగా తమ సమస్యల పరిష్కారానికి రైతులు ‘కిసాన్ క్రాంతి యాత్ర’ చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ యాత్రను అడ్డుకోవాడానికి పోలీసులు రైతుల మీద లాఠీచార్జీ చేశారు. ఈ దాడికి సంబంధించినదిగా భావిస్తున్న ఒక ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో భద్రతా అధికారి, ఓ రైతును అడ్డగించాడానికి తుపాకీతో బెదిరిస్తుండగా.. సదరు ముసలి రైతు ఏమాత్రం బెదరక ఓ చేతిలో ఇటుక, మరో చేతిలో లాఠీ పట్టుకుని అధికారి మీదే దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది ఫోటోలో. ఈ ఫోటోను కవితా కృష్ణన్ తన ట్విటర్లో షేర్ చేయడమే కాకుండా ‘ఈ ఫోటోలో ఆగ్రహంతో ఊగిపోతూ భద్రతాధికారి మీదకు రాయి ఎత్తిన ఈ రైతును ఉగ్రవాది అనలేమో అదే విధంగా ఉగ్రవాదుల మీద రాళ్లతో దాడి చేసే కశ్మీరి బాలలను కూడా ఉగ్రవాదులగా పరిగణించరాదు’ అంటూ ట్వీట్ చేశారు. కవిత చేసిన ట్వీట్‌ను దాదాపు 2500 మంది రిట్వీట్ కూడా చేశారు. అయితే కవిత ఈ ఫోటోను తన ట్విటర్లో షేర్ చేసిన తరువాత దీనికి సంబంధించి అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. Look at the farmer with a brick in his hand, facing a cop with a gun. If you don't think the farmer is a terrorist - and I hope you don't - if you empathise with his anger, I hope you'll think again before you call a Kashmiri kid with a stone in his hand a terrorist. pic.twitter.com/7Omxax3sWj — Kavita Krishnan (@kavita_krishnan) October 2, 2018 అది ఏంటంటే ఈ ఫోటో ‘కిసాన్ క్రాంతి యాత్ర’కు సంబంధించనది కాదని, అసలు ఈ మధ్య కాలంలో తీసినది కాదని తెలిసింది. ఈ ఫోటో దాదాపు ఐదేళ్ల క్రితం 2013 మీరట్, ఖేరా గ్రామంలో మహాపంచయత్ గొడవల సందర్భంగా తీసిందిగా నిర్ధారించబడింది. దాంతో ట్విటర్ జనాలు కవితను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇలా ట్రోల్ చేసిన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ రెబల్ కపిల్ మిశ్రా కూడా ఉన్నారు. ఆయన ఈ ఫోటోతో పాటు దీనికి సంబంధించిన కథనాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి తన ట్విటర్లో షేర్ చేశారు. pic.twitter.com/3WsVs1p3VI — Kapil Mishra (@KapilMishra_IND) October 3, 2018 అసలు విషయం తెలుసుకున్న కవితా కృష్ణన్ తన పొరపాటును గుర్తించి క్షమాపణలు చెప్పారు. కానీ తాను వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని మాత్రం సమర్ధించుకున్నారు. -
‘జై కిసాన్‌పై’ దండెత్తుతారా?
సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశంలో వ్యవసాయ రంగం ఎంతటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటుందో మంగళవారం నాడు ఢిల్లీకి కదం తొక్కిన వేలాది మంది రైతుల ఆగ్రహావేశాలను చూస్తే అర్థం అవుతుంది. ఎక్కడో హరిద్వార్ నుంచి ప్రారంభమైన రైతుల భారీ ర్యాలీ ఉత్తరప్రదేశ్ మీదుగా ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకోగానే ఇటు ఢిల్లీ, అటు ఉత్తర ప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా భారీ బారీకేడ్లు అమర్చి రైతులను కర్కశంగా అడ్డుకున్నారు. భాష్ప వాయువు గోళాలతో, నీటి శతఘ్నులతో నిప్పులు కుమ్మరించి నీరు గార్చేందుకు విఫలయత్నం చేశారు. చేసేదేమీలేక చివరకు బుధవారం తెల్లవారు జామున రైతులను నగరంలోకి అనుమతించారు. దేశంలోని రైతులు గత రెండేళ్ల నుంచి ఏదో రూపంలో ఆందోళన చేయడానికి నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభ పరిస్థితులు కారణమన్నది తెల్సిందే. 1970–1971 సంవత్సరం నుంచి దేశంలో సాగుభూమి శాతం దారుణంగా పడిపోతూ వస్తోంది. 2015 సంవత్సరంలో నిర్వహించిన వ్యవసాయం సెన్సెక్స్ ప్రకారం దేశంలో రైతులు సరాసరి సాగుభూమి కలిగి ఉన్నది 1.15 హెక్టార్లు మాత్రమే. పైగా భారత్ ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడంలో బాగా వెనకబడిపోయి ఉంది. దేశంలో ఆధునిక వ్యవసాయానికి పనికొచ్చే సాగు భూమి కూడా 46 శాతమే ఉండడం గమనార్హం. భారత్‌లో అతిపెద్ద వ్యవసాయ పంట వరి అన్న విషయం తెల్సిందే. అధిగ జనాభాలో చైనాతో పోటీ పడుతూ దూసుకుపోతున్న భారత్, ఇప్పుడు వరి దిగుబడిలో మాత్రం ఆ దేశంతో బాగా వెనకబడి పోయింది. భారత్‌కన్నా మూడు రెట్లు ఎక్కువ వరిని నేడు చైనా పండిస్తోంది. ఇక ఈ విషయంలో వియత్నాం, ఇండోనేసియా, బంగ్లాదేశ్‌లో వరి దిగుబడుల లెక్క చూస్తే నిజంగా కళ్లు తిరిగి కిందపడి పోవాల్సిందే. భారత్ కన్నా వియత్నాం 233 శాతం, ఇండోనేసియా 216 శాతం, బంగ్లాదేశ్ 183 శాతం అధిక దిగుబడిని సాధిస్తోంది. ఒకప్పుడు దేశంలో బతకలేని వాడు బడి పంతులైతే ఇప్పుడు దేశంలో అన్నమో రామచంద్రా! అంటూ అలమటిస్తున్నది అన్నదాతలే. ఇక ఈ దేశంలో వ్యవసాయం ఏ మాత్రం లాభదాయకం కాదని తెల్సినా దాన్నే ఎక్కువ మంది ఆశ్రయించడానికి కారణం ప్రత్నామ్నాయ ఉపాధి అవకాశాలు లేకపోవడమే. మనం ఉదహరించిన వియత్నాం, ఇండోనేసియా, బంగ్లాదేశ్ లాంటి దేశాలే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడి హాపీగానే బతుకుతున్నాయి. అయితే అవి అత్యాధునకి పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాయి. ఈ విషయంలో భారత్ బాగా వెనకబడి ఉంది. అందుకు కారణం వ్యవసాయ రంగం పట్ల భారత ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం. దేశంలోని రైతులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంలో, వారికి వ్యవసాయ విద్యలో శిక్షణ ఇప్పించడంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఆ దిశగా పెట్టుబడులు పెట్టడం లేదు. ప్రత్నామ్నాయ ఉపాధి లేదా ఉద్యోగావకాశాలను చూపించడంలో కూడా భారత ప్రభుత్వం దారుణంగా విఫలమవుతూ వస్తోంది. కనీసం వినియోగదారుల పట్ల చూపిస్తున్న శ్రద్ధను వ్యవసాయదారులపై చూపడం లేదు. వ్యవసాయోత్పత్తుల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం దిగుమతి–ఎగుమతి నిబంధనలను, సుంకాలను ఎప్పటికప్పుడు సవరిస్తోంది. ఫలితంగా కూడా భారతీయ వ్యవసాయదారులు దెబ్బతింటున్నారు. అన్ని రకాల వ్యవసాయ పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని, పంటల భీమా సౌకర్యాన్ని పునరుద్ధరిస్తామంటూ ఇచ్చిన హామీలను కేంద్రంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ నిలుపుకోలేక పోయాయి. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు మరీ ఘోరంగా విఫలమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కడుపు మండిన రైతులు సమ్మె బాట పట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామిక దేశంలో ప్రజలందరి హక్కు. అలా శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న రైతులపైకి ప్రభుత్వం పిడికిలి బిగించింది. అదీ మన శాంతిదూత గాంధీ తాత 150వ పుట్టిన రోజున. అదీ ‘జై కిసాన్’ అంటూ మన రైతులకు సగౌరవంగా నమస్కరించిన లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజున కూడా. జై కిసాన్ అనే నినాదం శాస్త్రీతోనే ప్రాచుర్యంలోకి వచ్చిందన్న విషయం తెల్సిందే. -
రైతు ర్యాలీ.. అర్ధరాత్రి అనుమతి
న్యూఢిల్లీ: రుణ మాఫీ తదితర డిమాండ్లతో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తలపెట్టిన కిసాన్ క్రాంతి యాత్ర ఎట్టకేలకు ముగిసింది. మంగళవారం ఈ యాత్రను పోలీసులు ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో అడ్డుకున్న విషయం తెలిసిందే. బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా వస్తున్న రైతులను దేశరాజధాని ఢిల్లీ నగరంలోకి అనుమతించకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని ధ్వంసం చేసి ప్రవేశించే యత్నం చేసిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. అయినా కూడా రైతులు వెనకడుగు వేయలేదు. అర్థరాత్రి అయినా వెనక్కి వెళ్లకుండా అక్కడే బస చేశారు. మరోవైపు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో అర్ధరాత్రి బారికేడ్లు తొలిగించి అనుమతించారు. దీంతో రైతులు చేపట్టిన పాదయాత్ర కిసాన్ ఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజామున ముగిసింది. ఈ సందర్భంగా నరేశ్ తికాయత్ మాట్లాడుతూ.. ‘ఇది రైతుల విజయం. బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా విఫలమైంది. మేం గత 12 రోజులుగా ర్యాలీ చేస్తున్నాం. రైతులంతా అలసిపోయారు. మేం మా డిమాండ్స్, హక్కుల కోసం మా పోరాటం కొనసాగిస్తాం. కానీ ప్రస్తుతం ఈ ర్యాలీని ముగిస్తున్నాం’ అని తెలిపారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న రైతుల ప్రధాన డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించినట్లు చెప్పారు. తమ డిమాండ్లను అమలు చేయాలని బీకేయూ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు గత నెల 23న హరిద్వార్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన సుమారు 70 వేల మంది రైతులు పాల్గొన్నారు. చదవండి: రైతు ర్యాలీ భగ్నం -
ఛలో కిసాన్ ఘాట్
-
రైతు ర్యాలీ భగ్నం
న్యూఢిల్లీ/సేవాగ్రామ్: రుణ మాఫీ తదితర డిమాండ్లతో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తలపెట్టిన కిసాన్ క్రాంతి యాత్రను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. రైతుల దాడిలో ఏసీపీ సహా ఏడుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీకేయూ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు గత నెల 23న ర్యాలీగా బయలుదేరారు. బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా వస్తున్న రైతులు ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లో యూపీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే వాటర్ క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించి రైతులను చెదరగొట్టినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తమను లాఠీలతో కొట్టారని కొందరు రైతులు ఆరోపించగా పోలీసులు ఖండించారు. బీకేయూ ర్యాలీ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. రోడ్డు పక్కనే రైతుల బస: పోలీసు చర్య అనంతరం రైతులు ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోనే కిలోమీటర్ మేర మకాం వేశారు. వెంట తెచ్చుకున్న దుస్తులు, దుప్పట్లు వేసుకుని ట్రాక్టర్లు, ట్రాలీల పక్కనే నిద్రకు ఉపక్రమించారు. కొందరు తమ వెంట జనరేటర్లు కూడా తెచ్చుకున్నారు. స్వామి నాథన్ కమిటీ సిఫార్సుల అమలు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వం ఆమోదం తెలిపే వరకు వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం పోలీసుల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ అహింసా దినం రోజున దేశ రాజధానిలో రైతులపై కేంద్రం దాడి చేయించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల డిమాండ్లు ఇవీ.. ♦ చెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి. దాదాపు రూ.10 వేల కోట్ల మేర ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ♦ ప్రధానమంత్రి మంత్రి ఫసల్ బీమా యోజన పునరుద్ధరించాలి. ♦ పదేళ్లు పాతబడిన డీజిల్ ట్రాక్టర్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధాన్ని ఎత్తివేయాలి. ♦ డీజిల్ ధరలను తగ్గించాలి. ♦ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు ♦ 60ఏళ్ల పైబడిన రైతులకు వృద్ధాప్య పింఛను ♦ యూపీ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలి. యాత్రలో పాల్గొన్న రైతులు: సుమారు 70వేలు ఏయే రాష్ట్రాల రైతులు: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి. ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది: సెప్టెంబర్ 23న హరిద్వార్‌లో -
రైతులపై దండయాత్ర!
పదకొండేళ్లక్రితం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటిస్తూ ఆయన ఇచ్చి వెళ్లిన స్ఫూర్తితో సకల మానవాళికి మానవ హక్కులు దక్కేందుకు కంకణధారులమవుదామని పిలుపునిచ్చింది. పైగా ఈసారి మహాత్ముడి జన్మదినం రోజున దేశవ్యాప్తంగా ఆయన 150వ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కానీ తమ కడగండ్లను పాలకుల దృష్టికి తీసుకొచ్చి, తక్షణ పరిష్కారం కోరేందుకు మంగళవారం భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి 70,000మందితో బయల్దేరిన ‘కిసాన్ క్రాంతి యాత్ర’ ఇంకా ఢిల్లీ చేరుకోకముందే, ఘజియాబాద్ వద్దే దానికి లాఠీలు ఎదురొచ్చాయి. వారిపై బాష్పవాయు గోళాలు, వాటర్కేనన్లు ప్రయోగించారు. ఎందరో గాయాలపాలయ్యారు. ఢిల్లీ సరిహద్దు రణరంగాన్ని తలపించింది. ఇది నిన్ననో, మొన్ననో ప్రారంభమైన క్రాంతియాత్ర కాదు. గత నెల 23న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి కొన్ని వందలమందితో ప్రారంభమైన యాత్ర ముందుకు సాగినకొద్దీ పెరుగుతూ వచ్చింది. రైతులంతా ఇందులో ఎంతో క్రమశిక్షణతో పాల్గొన్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఢిల్లీలో ప్రవేశించినంత మాత్రాన వారి వల్ల శాంతిభద్రతలకు ముప్పు కలిగేదేమీ ఉండదు. ఒకవేళ దానిపై అనుమానాలుంటే ఆ క్రాంతియాత్ర నిర్వాహకులతో ముందుగానే మాట్లాడి, వారి డిమాండ్ల గురించి అవగాహన ఏర్పర్చుకుని, సాదరంగా చర్చలకు ఆహ్వానించి, తగిన నిర్ణయాలు ప్రకటించాల్సింది. కానీ అందుకు బదులుగా ఆ రైతులను ఢిల్లీ వెలుపలే నిలువరించడానికి పాలకులు నిశ్చయించుకున్నారు. నిషేధాజ్ఞలు విధించారు. రాజధాని నగరంలో అడుగుపెట్టడానికే వీల్లేదన్నారు. ఎండనకా, వాననకా పగలంతా నడుస్తూ...రాత్రుళ్లు పచ్చికబయళ్లలో నిద్రిస్తూ ఎన్నో కష్టాలకోర్చి వచ్చిన రైతులతో ఇలా వ్యవహరించడం సబబేనా? ఇంత జరిగాక రైతులు అడిగిన తొమ్మిది డిమాండ్లలో ఏడింటికి ఒప్పుకున్నామని, రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని కేంద్రం ప్రకటించగా, అన్నీ అంగీకరిస్తేనే ఆందోళన విరమిస్తామని ఉద్యమకారులు చెబుతున్నారు. రైతుల డిమాండ్లు కొత్తవేమీ కాదు. వాటిల్లో అధిక భాగం గత సార్వత్రిక ఎన్నికల్లోనూ, అటుపై జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ హామీ ఇచ్చినవే. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని, ముఖ్యంగా సాగు దిగుబడులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రుణమాఫీ చేస్తామని, చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసింది. దానికితోడు పదేళ్లువాడిన ట్రాక్టర్లపై జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో ఉన్ననిషేధాన్ని రద్దు చేయాలని, డీజిల్ ధరలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యవసాయానికి వాడే విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ సంస్థలకే తప్ప తమకు ప్రయోజనకరంగా ఉండటం లేదని చెబుతున్నారు. దాన్ని తగిన విధంగా సవరించి అన్ని పంటలకూ వర్తింపజేయాలని విన్నవించుకుంటున్నారు. చెరకు సీజన్ ముగిసినా తమకు రావాల్సిన రూ. 19,000 కోట్ల రూపాయల బకాయిల సంగతి ఎత్తరేమని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 14 రోజుల్లో వీటిని చెల్లిస్తామన్న హామీ ఏమైందని అడుగుతున్నారు. దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరే రుణమాఫీ అమలు చేశామని యోగి ప్రభుత్వం కూడా చెబుతోంది. కానీ పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు లభ్యంకాక అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మేం అధికారంలోకి రాకముందు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరణనివ్వడం తప్ప ఇంతవరకూ ప్రభుత్వం చేసిందేమీ లేదు. యోగి ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు 40 శాతం పెరిగాయన్న సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్ ప్రకటనలో అతిశయోక్తి ఉండొచ్చు. కానీ అంతక్రితంకన్నా పెరిగాయన్నది వాస్తవం. మన వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సాగు వ్యయం అపరిమితంగా పెరిగింది. డీజిల్ ధర అయితే భరించలేని స్థాయికి చేరుకుంది. వీటన్నిటి కోసం భారీ మొత్తంలో పెట్టుబడి అవసరమవుతోంది. పాత రుణాలు మాఫీ అయ్యాయని ప్రభుత్వాలు చెబుతుండగా, ఆ బకాయిలు తీరకపోవడం వల్ల కొత్త రుణాలివ్వలేమని బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. పర్యవసానంగా వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించక తప్పడం లేదు. కరువు, అకాలవర్షాలతో వచ్చే కష్టాలు సరేసరి. వీటన్నిటినీ ఓర్చుకుని పంటలు పండిస్తుంటే ఆ దిగుబడులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులు చావు తప్ప పరిష్కారం లేదనుకోవడంలో వింతేముంది? క్వింటాల్ ధాన్యానికి ఇప్పుడిస్తున్న గిట్టుబాటు ధర రూ. 1,550ను రూ. 1,750కి పెంచుతామని గత నెలలో యూపీ సర్కారు ప్రకటించింది. నిజానికి అది కూడా రైతులకు ఏమూలకూ సరిపోదు. సాధారణ బియ్యం క్వింటాల్ కొనాలంటే వినియోగదారులు రూ. 5,000కు పైగా వెచ్చించవలసి వస్తుండగా ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు దక్కుతున్నదెంత? ఒక్క ధాన్యానికి మాత్రమే కాదు, ఇతర పంటలకు కూడా ఇలా అరకొర ధరలే దక్కుతున్నాయి. బీకేయూ నిర్వహించిన క్రాంతియాత్ర అనేకవిధాల చెప్పుకో దగినది. ఇందులో మహిళలు సైతం చిన్న పిల్లలతో సహా వచ్చి పాల్గొన్నారు. మూడేళ్లక్రితం ముజఫర్‌నగర్‌లో హిందూ–ముస్లిం ఘర్షణలు జరిగాక పశ్చిమ యూపీలో రైతు ఉద్యమం దెబ్బతింది. కానీ గత నాలుగేళ్లుగా బీజేపీకి వెన్నుదన్నుగా నిలబడిన జాట్ రైతులు మళ్లీ ముస్లిం రైతులతో చేయి కలిపారు. ఒక్క యూపీలో మాత్రమే కాదు...అన్ని రాష్ట్రాల్లోని రైతులు ఏకమవుతున్నారు. ఉద్యమించడానికి సిద్ధపడుతున్నారు. వారి సమస్యలను ఉపేక్షించడం ఇక సాధ్యం కాదని, ఉత్తుత్తి వాగ్దానాలతో కాలక్షేపం చేయడం కుదరదని పాలకులు గుర్తించాలి. -
కిసాన్ ర్యాలీ : ఏడుగురు పోలీసులకు గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ : డిమాండ్ల సాధనకు దేశ రాజధాని బాట పట్టిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించే క్రమంలో ఢిల్లీ-యూపీ బోర్డర్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులను ఢిల్లీలోకి చొచ్చుకురానీయకుండా నిరోధించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో తొలగించడంతో పోలీసులు అన్నదాతలను అడ్డుకున్నారు. లాఠీచార్జి, భాష్పవాయుగోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. రైతులు, పోలీసుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఓ ఏసీపీ సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బారికేడ్లను తొలగించవద్దని రైతులను కోరినా వారు వినిపించుకోలేదని ట్రాక్టర్లతో బారికేడ్లను ధ్వంసం చేయడంతో పాటు రాళ్లదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. పోలీసులే ఆందోళనకారులను రెచ్చగొట్టారని రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. హింసకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలను, వాటర్ కెనాన్లను ప్రయోగించామని పోలీసులు తెలిపారు. రైతులను ఢిల్లీ చేరుకోకుండా నిలువరించేందుకు 3000 మంది పోలీసులను ఢిల్లీ-యూపీ బోర్డర్లో నియమించారు. స్వామినాధన్ కమిషన్ నివేదికను అమటు చేయాలని, రుణమాఫీ ప్రకటించాలని, ఇంధన ధరలు తగ్గించాలనే పలు డిమాండ్లతో రైతులు హరిద్వార్ నుంచి రాజ్‌ఘాట్ వరకూ కిసాన్ క్రాంతి యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. -
రుణమాఫీపై ఎటూ తేల్చని కేంద్ర ప్రభుత్వం!
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధానిలో రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. అయితే రుణ మాఫీ సహా మరికొన్ని డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతులు ప్రభుత్వం ముందుంచిన 11 డిమాండ్లలో ఏడు డిమాండ్లను కేంద్రం అంగీకరించిందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి యుధ్వీర్ సింగ్ మంగళవారం పేర్కొన్నారు. నాలుగు ప్రధాన డిమాండ్లను నెరవేర్చడంపై కేంద్రం తీరు పట్ల రైతులు అసంతృప్తిగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం యుధ్వీర్ చెప్పారు. నాలుగు డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడినందున వీటిపై తదుపరి సమావేశంలో వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు. రుణ మాఫీపై విస్తృతంగా చర్చించిన మీదట నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించిందన్నారు. కాగా బీకేయూ సారథ్యంలో రైతు సంఘాల పిలుపు మేరకు యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాల నుంచి దాదాపు 70,000 మందికి పైగా రైతులు దేశ రాజధానికి ప్రదర్శనగా తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కిసాన్ క్రాంతి యాత్ర పేరుతో రాజ్‌ఘాట్ వరకూ రైతులు బారీ ర్యాలీ నిర్వహించారు. -
కిసాన్ క్రాంతి యాత్ర : రైతులపై ఖాకీ జులుం
సాక్షి, న్యూఢిల్లీ : డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన రైతులపై పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించి లాఠీచార్జి జరపడాన్ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఖండించారు. గాంధీ జయంతి రోజున బీజేపీ ప్రభుత్వం న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తిన రైతులను నెట్టివేసిందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేపట్టి ఢిల్లీకి వస్తున్న క్రమంలో వారిని బలవంతంగా పోలీసులు తోసివేయడం దారుణమని రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు. రైతులను ఢిల్లీ రాకుండా ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ తీరుతో ప్రస్తుతం రైతులు తమ ఇబ్బందులు తెలిపేందుకు దేశ రాజధానికి సైతం వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రైతుల ఆందోళన తీవ్రతరం కావడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష నేతలు మోదీ సర్కార్‌ను తప్పుపట్టారు. రైతులను ఢిల్లీకి వచ్చేందుకు అనుమతించాలని, వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని..తాము రైతులకు బాసటగా నిలుస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. రైతులకు చేసిన వాగ్ధానాలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో వారు ఆందోళనకు పూనుకోవడం సరైనదేనని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. మోదీ సర్కార్ రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, స్వాతంత్ర్యానంతరం రైతులను సంక్షోభంలోకి నెట్టిన తొలి సర్కార్ ఇదేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఢిల్లీలో 144 సెక్షన్ రుణమాఫీ, ఇంధన ధరల తగ్గింపు, చెరకు బకాయిల చెల్లింపు, పంటలకు గిట్టుబాటు ధరల కల్పన వంటి పలు డిమాండ్లతో రైతులు ఢిల్లీకి చేరుకుంటుండగా, వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తూర్పు, ఈశాన్య ఢిల్లీలో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. రైతుల ఆందోళనతో ఢిల్లీకి వచ్చే రహదారులపై ట్రాఫిక్ పలుచోట్ల నిలిచిపోయింది. యూపీ బోర్డర్లో పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజలు గుమికూడరాదని, లౌడ్స్పీకర్లు వాడరాదని నిషేదాజ్ఞలు విధించారు. సెప్టెంబర్ 23న హరిద్వార్‌లో ప్రారంభమైన కిసాన్ క్రాంతి యాత్రలో యూపీలోని పలు ప్రాంతాల నుంచి రైతులు జత కలిశారు. రైతులు పెద్దసంఖ్యలో కాలినడకన, ట్రాక్టర్లలో, వాహనాల్లో తమ తమ గమ్యస్ధానాల నుంచి ఆందోళన బాటపట్టారు. డిమాండ్లపై సర్కార్ సానుకూలం ఢిల్లీ-యూపీ బోర్డర్లో నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. రైతు ప్రతినిధులతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చర్చలు జరిపారు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీపై కేంద్రం సానుకూలంగా లేకున్నా ఇతర డిమాండ్లపై మెతకవైఖరి ప్రదర్శించింది. మరోవైపు రైతుల నిరసనలతో యూపీ సర్కార్ దిగివచ్చింది. రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ చేపట్టిన విధానానికి అనుగుణంగా తాము పలు చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హామీ ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం తాము తొలిసారిగా సన్న, మధ్యతరహా రైతులకు రుణమాఫీ ప్రకటించామని చెప్పుకొచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. -
కిసాన్ క్రాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
-
మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వం: సీతారాం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం.. వారి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందన్నారు. రైతులు రుణ భారంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుటి నుంచి దేశంలో ఇంతటి వ్యవసాయ సంక్షోభాన్ని ఇప్పటి వరకు చూడలేదన్నారు. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన కిసాన్ క్రాంతి ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ర్యాలీలో దాదాపు 20వేల మంది రైతులు హరిద్వార్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలుపడానికి సిద్ధం కాగా.. పోలీసులు అడ్డుకున్నారు. వారిపైకి వాటర్ కెనాన్లను, బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. చదవండి: రైతులపై పోలీసుల ఉక్కుపాదం -
రైతులపై పోలీసుల ఉక్కుపాదం
-
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై పోలీసుల ఉక్కుపాదం
న్యూఢిల్లీ: తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన పాదయాత్ర ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పలు డిమాండ్ల సాధనకై కిసాన్ క్రాంతి ర్యాలీ పేరిట దాదాపు 20వేల మంది రైతులు హరిద్వార్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలుపడానికి సిద్ధమయ్యారు. కాగా మంగళవారం ఉదయం రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా అడ్డుకున్న పోలీసులు.. వారిపైకి వాటర్ కెనాన్లను, బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. గాంధీ జయంతి రోజున రైతులపై పోలీసులు ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుణమాఫీ, ఉచిత కరెంట్, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుతో పాటు మరికొన్ని డిమాండ్ల సాధనకై రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. హరిద్వార్ నుంచి బయలుదేరిన రైతులు సోమవారం సాయంత్రం ఘజియాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. తమ సమస్యలపై కచ్చితమైన హామీ వచ్చేవరకు వెనక్కితగ్గేది లేదని రైతులు తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారిస్తుందని నాలుగేళ్ల పాటు ఎదురుచూశామని.. అయినా లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రైతు నాయకులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఉండేందుకు సరిహద్దులోని రహదారులపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటుచేసిన పోలీసులు తూర్పు ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా భారీగా బలగాలను మోహరించారు. రైతులకు మద్దతు తెలిపిన కేజ్రీవాల్, అఖిలేశ్ కిసాన్ క్రాంతి ర్యాలీ పేరిట రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. రైతులను ఢిల్లీలోకి అనుమతించాలని కోరారు. అలాగే వారిని ఢిల్లీలోకి ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు నిరసనకు దిగారని పేర్కొన్నారు. -
ఢిల్లీ వీధుల్లో భారీ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కార్మిక లోకం మరోసారి కదం తొక్కింది. ధరల నియంత్రణ, పంటకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో బుధవారం రైతు పోరాట ర్యాలీని నిర్వహించారు. అఖిల భారత వ్యవసాయ కార్మికుల యూనియన్ (ఎఐఎడబ్య్లూయూ) ఆధ్వర్యంలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ ర్యాలీని ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాదిగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కార్మికులు ర్యాలీలో పాల్గొన్ని నిరసన వ్యక్తం చేశారు. ఎర్రజెండాలతో ఢిల్లీ వీధుల్లో కవాతు నిర్వహించడంతో.. ట్రాఫిక్ అధికారులు ముందస్తుగానే స్పందించి వాహనాలకు వేరే మార్గాలకు మల్లించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని.. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేశారని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచుతూ.. కనీస వేతనం 600 చేయాలని డిమాండ్ చేశారు. -
బెంగాల్లో ‘సిండికేట్’ రాజ్యం
మిడ్నాపూర్/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో సిం డికేట్ రాజ్యం నడుస్తోందనీ, దాని అను మతి లేకుండా రాష్ట్రంలో చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా జరగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తోందని మండిపడ్డారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్యకర్తల్ని వరుసగా హత్యచేసినా ప్రజ లు తమవెంటే నిలిచారన్నారు. తృణమూల్ కాంగ్రెస్ దుష్పరిపాలన నుంచి బెంగాలీలు త్వరలోనే విముక్తి పొందుతారన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ న్నారు. పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్‌లో సోమవారం నిర్వహించిన ‘కిసాన్ కళ్యాణ్ ర్యాలీ’లో మోదీ నిప్పులుచెరిగారు. జనగణమన గడ్డపై: ‘జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం పుట్టిన భూమిని ప్రస్తుతం రాజకీయ సిండికేట్ పాలిస్తోంది. ఈ సిండికేట్ బుజ్జగింపు, ముడుపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిండికేట్ల ద్వారా చిట్ ఫండ్లను నడుపుతూ రైతులకు దక్కాల్సిన లబ్ధిని లాగేసుకుంటోంది. చివరికి కేంద్రం పంపే నిధుల్ని సైతం వీరి అనుమతి లేకుండా ఖర్చుపెట్టడం కుదరడం లేదు’ అని మోదీ అన్నారు. తన పర్యటనను నిరసిస్తూ తృణమూల్ కార్యకర్తలు మమత ఫొటోలు, పోస్టర్లను సభలో ప్రదర్శించడంపై మోదీ స్పందిస్తూ.. ‘మేం సాధించిన విజయాలను తృణమూల్ కూడా అంగీకరిస్తోంది. అందుకే చేతులు జోడించిన సీఎం మమతా బెనర్జీ పోస్టర్లతో వాళ్లు ప్రధానికి స్వాగతం పలికారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూలిన టెంట్.. 67 మందికి గాయాలు ప్రధాని కిసాన్ కళ్యాణ్ సభ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ టెంట్ కూలిపోవడంతో 13 మంది మహిళలు సహా 67 మంది గాయపడ్డారు. ప్రధాని ప్రసంగం సాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వెంటనే స్పందించిన మోదీ బాధితులకు సాయమందించాలని పక్కనే ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అధికారుల్ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బాధితులకు ప్రథమ చికిత్స చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మోదీ ప్రసంగం సందర్భంగా పలువురు కార్యకర్తలు టెంట్‌పైకి ఎక్కారు. చివరికి టెంట్ పైభాగంగా బరువు ఎక్కువ కావడంతో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. -
‘దీదీ సిండికేట్ కనుసన్నల్లో బెంగాల్’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ప్రజల ఆకాంక్షలను మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. తృణమూల్ స్వార్ధపూరిత రాజకీయాలతో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతోందని దుయ్యబట్టారు. పశ్చిమ మిడ్నపూర్‌లో సోమవారం కిసాన్ కళ్యాణ్ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. బెంగాల్లో రాజకీయ సిండికేట్ రాష్ట్రాన్ని దిగజార్చుతూ బెంగల్ ప్రతిష్టను మంటగలుపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో వ్యాపారం చేయాలన్నా, ఉత్పత్తులు విక్రయించాలన్నా మమతా సిండికేట్ కనుసన్నల్లోనే జరగాలని అన్నారు. చివరికి కాలేజీల్లో అడ్మిషన్లకూ సిండికేట్‌ను సంతృప్తిపరచకుండా సాధించే పరిస్థితి లేదని మండిపడ్డారు. బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో చెలరేగిన హింసను ప్రస్తావిస్తూ ఇక్కడ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదనేందుకు ఇది సంకేతమన్నారు. రాజకీయ ప్రత్యర్ధులను ఇక్కడ సిండికేట్ హతమారుస్తోందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం పంపే నిధులను సిండికేట్ అనుమతి లేకుండా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. త్రిపుర తరహాలో ఇక్కడ సైతం సిండికేట్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు చొరవ చూపాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. కూలిన టెంట్ 15 మందికి గాయాలు ప్రధాని కిసాన్ ర్యాలీలో ప్రసంగిస్తుండగా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్ కుప్పకూలడంతో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మోటార్ బైక్‌లు, ప్రధాని కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో ప్రధాని పరామర్శించారు. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో పాటు కొందరు టెంట్‌కు ఊతంగా ఏర్పాటు చేసిన పోల్స్‌పైకి ఎక్కేందుకు కొందరు ప్రయత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ప్రధాని ప్రసంగించే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా కొద్దిసేపు ఆయన తన ప్రసంగాన్ని నిలిపివేశారు. టెంట్‌పైకి ఎక్కిన వారంతా దిగిరావాలని, షామియానాలో కూర్చున్నవారు బయటకు రావాలని కోరారు. పరిగెత్తకుండా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. -
రైతులను వంచించిన కాంగ్రెస్..
చండీగఢ్ : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో గత 70 ఏళ్లుగా ప్రజలను వంచించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పంజాబ్‌లోని మలౌట్‌లో బుధవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ రైతులకు కాంగ్రెస్ పార్టీ నమ్మకద్రోహం చేసిందని విమర్శించారు. అన్నదాతల శ్రమను ఆ పార్టీ ఎన్నడూ గుర్తించలేదని దుయ్యబట్టారు. రైతులను కేవలం ఓటుబ్యాంక్‌గానే కాంగ్రెస్ పరిగణిస్తూ వారి సాధికారతను విస్మరించిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. భారత్‌ను వ్యవసాయంలో అగ్రగామిగా నిలపడంలో పంజాబ్ రైతుల పాత్ర తిరుగులేనిదని ప్రశంసించారు. పంజాబ్ రైతులు కష్టించి పనిచేయడం ద్వారా రికార్డు స్ధాయిలో వ్యవసాయ ఉత్పత్తులను దేశానికి అందిస్తున్నారని కొనియాడారు.2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తాము కృషిచేస్తున్నామని ప్రధాని చెప్పుకొచ్చారు. కిసాన్ కళ్యాణ్ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చని రైతులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. -
‘ఆ మూడు రాష్ట్రాల్లో విజయం మాదే’
భోపాల్ : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కిసాన్ ఆందోళన్ ర్యాలీని తప్పుబాట పట్టించాలని బీజేపీ భావిస్తోందని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ పేర్కొన్నారు. మాంద్‌సోర్‌లో రైతులపై గత ఏడాది జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. రైతులు మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా జూన్ ఆరవ తేదీన మాంద్‌సోర్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని చేపట్టనుందని ప్రకటించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్‌పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరై అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని కమల్‌నాథ్ తెలిపారు. కిసాన్ ర్యాలీని నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తే ర్యాలీపై బీజేపీకి ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించి తీరుతుందని కమల్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. శివరాజ్‌సింగ్ ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, మద్దతు ధరకోసం ఆందోళన చేసిన మాంద్సోర్ రైతులను కాల్చిచంపారని సీఎంపై ధ్వజమెత్తారు.