భయం వద్దు.. మోదీపై మా పోరాటం ఆగదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం భూసేకరణ బిల్లును తెరపైకి తెచ్చినప్పటినుంచి దేశంలోని రైతుల్లో అశాంతి నెలకొందని, వారు తీవ్ర ఆందోళనలతో ఉన్నారని రాహుల్గాంధీ అన్నారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేయడం వల్ల రైతులప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లును వెనక్కి తీసుకునే వరకు తాము పోరాడతామని హామీ ఇచ్చారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ ర్యాలీ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో భూసేకరణ బిల్లుపై తాము వెనక్కి వెళ్లేది లేదని చెప్పారు.
ఆ బిల్లును కేంద్రం ప్రభుత్వం వెనుకకు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే కేంద్రం రైతులను, కూలీలను మరిచిపోయి, వారికి వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోందని.. దానిని తాము సహించబోమని అన్నారు. భూమి పోతే తమ పరిస్ధితి ఏమిటా రైతులు భయాందోళనలో ఉన్నారని చెప్పారు. రైతులకు తాము రూ.70 వేల కోట్లను రుణాలను మాఫీ చేశామని చెప్పారు. బలహీనుల కోసం ఆహార భద్రతా చట్టంలో ఎన్నో మార్పులుతీసుకొచ్చామని చెప్పారు.
ఐటీ విప్లవం కన్నా ముందే వచ్చింది వ్యవసాయ విప్లవం అని గుర్తు చేశారు. మోదీ సర్కార్ తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతకుముందు ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మాట్లాడారు. మోదీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని అన్నారు. ఆయనవన్నీ ప్రజా వ్యతిరేక విధానాలేనని విమర్శించారు. ఈ సభకు దేశం నలుమూలలనుంచి రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.