సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధానిలో రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. అయితే రుణ మాఫీ సహా మరికొన్ని డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతులు ప్రభుత్వం ముందుంచిన 11 డిమాండ్లలో ఏడు డిమాండ్లను కేంద్రం అంగీకరించిందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి యుధ్‌వీర్ సింగ్ మంగళవారం పేర్కొన్నారు.
నాలుగు ప్రధాన డిమాండ్లను నెరవేర్చడంపై కేంద్రం తీరు పట్ల రైతులు అసంతృప్తిగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం యుధ్‌వీర్ చెప్పారు. నాలుగు డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడినందున వీటిపై తదుపరి సమావేశంలో వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు. రుణ మాఫీపై విస్తృతంగా చర్చించిన మీదట నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించిందన్నారు.
కాగా బీకేయూ సారథ్యంలో రైతు సంఘాల పిలుపు మేరకు యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాల నుంచి దాదాపు 70,000 మందికి పైగా రైతులు దేశ రాజధానికి ప్రదర్శనగా తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కిసాన్ క్రాంతి యాత్ర పేరుతో రాజ్‌ఘాట్ వరకూ రైతులు బారీ ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment