ఢిల్లీలో 50వేల మందితో ‘కిసాన్‌ గర్జన’.. మరో రైతు ఉద్యమానికి సన్నాహమా? | 50000 Farmers Gather At Delhi Ramlila Maidan For Fresh Agitation | Sakshi
Sakshi News home page

ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ‘కిసాన్‌ గర్జన’.. 50వేల మంది రైతులు హాజరు

Published Mon, Dec 19 2022 4:43 PM | Last Updated on Mon, Dec 19 2022 4:43 PM

50000 Farmers Gather At Delhi Ramlila Maidan For Fresh Agitation - Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెలలతరబడి వేలాది మంది రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసింది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. కానీ, కేంద్రం వైఖరిపై ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో సోమవారం సుమారు 50వేల మంది రైతులు సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్‌ సంఘ్‌ పిలుపు ఇచ్చిన ‘కిసాన్‌ గర్జన’ ర్యాలీ కోసం ఢిల్లీ రామ్‌లీలా మైదానానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రైతులు. రైతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రైతు రుణాల మాఫీ, పంటలకు సరైన ధర, పాడైన పంటలకు పరిహారం వంటి డిమాండ్లతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ సమావేశం రైతలు బలాన్ని సూచిస్తుందని పలువురు తెలిపారు. మరోవైపు.. సాగు చట్టాల రద్దు సమయంలో రైతుల డిమాండ్లు తీరుస్తామని కేంద్ర ప్రభుత్వ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల అమలును గుర్తు చేసినట్లవుతోందన్నారు. 

బీకేఎస్‌ డిమాండ్లలో ప్రధానమైనవి.. 
 అన్ని పంట ఉత్పత్తులపై లాభదాయకమైన ధరలు

► పంట ఉత్పత్తులపై ఎలాంటి జీఎస్‌టీ ఉండకూడదు

► కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద అందిస్తున్న సాయాన్ని పెంచడం

► జన్యుపరంగా మార్పు చేసిన ఆవాల విత్తనాలకు అనుమతులు ఇవ్వకూడదు

► రైతు అనుకూల ఎగుమతి, దిగుమతులు విధానాన్ని రూపొందించటం

► 15 ఏళ్ల వాహనాల తక్కు పాలసీ నుంచి రైతుల ట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వడం

కాంగ్రెస్‌ హెచ్చరిక..
దేశ రాజధానిలో మరోసారి భారీ స్థాయిలో రైతులు సమావేశం కావడంపై హెచ్చరికలు చేశారు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. గతంలో జరిగిన విషయాల నుంచి నేర్చుకుని భవిష్యత్తులో మళ్లీ ఎదురవకుండా చూసుకోవాలన్నారు. రైతుల సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాల్సిన సమయం ఇదేనని, లేదంటే వారు మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉందన్నారు. 

ట్రాఫిక్‌ ఆంక్షలు..
గతంలో రైతుల ఆందోళనలతో ఎదురైన ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కిసాన్‌ గర్ణన వేళ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. రామ్‌లీలా మైదనానికి వెళ్లే దారులను మళ్లించారు. మహరాజ్‌ రంజీత్‌ సింగ్‌ మార్గ్‌, మిర్దార్ద్‌ చౌక్‌, మింటో రోడ్‌, అజ్మేరి గేట్‌, ఛమన్‌లాల్‌ మార్గ్‌, ఢిల్లీ గేట్‌ వంటి మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:  కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్‌ అమలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement