ఆప్ సభలో రైతు ఆత్మహత్య
సభా ప్రాంగణంలోనే వేపచెట్టుకు కండువాతో ఉరేసుకున్న రాజస్థాన్ రైతు గజేంద్రసింగ్
వర్షాలకు పంటనష్టంతో ఆవేదనతోనే అంటూ సూసైడ్ నోట్
పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో కేజ్రీవాల్ ఎదుటే ఘటన
భూసేకరణ బిల్లుకు నిరసనగా ఆప్ సభ.. మృతునికి ముగ్గురు పిల్లలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున, పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా వేలాది మంది చూస్తుండగా, ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలి అకాల వర్షాలకు తన పంట పూర్తిగా నాశనమైందని, ఇక తనకు భవిష్యత్తు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ముగ్గురు పిల్లల తండ్రి తనువు చాలించాడు. చనిపోయే ముందు భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా నినదించాడు. జంతర్‌మంతర్ వద్ద బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చేపట్టిన కిసాన్ ర్యాలీలో దేశంలోని రైతాంగ దుస్థితికి అద్దంపట్టే ఈ విషాదం చోటు చేసుకుంది.
భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆప్ తలపెట్టిన కిసాన్‌ర్యాలీలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని దౌసా నుంచి గజేంద్రసింగ్ అనే రైతు వచ్చాడు. ఒకవైపు ర్యాలీనుద్దేశించి ఆప్ నేతలు ప్రసంగిస్తుండగానే.. గజేంద్ర ధర్నా వేదిక సమీపంలోని వేపచెట్టుపైకి ఎక్కాడు. చేతిలో ఆప్ ఎన్నికల గుర్తు ‘చీపురు’ను ఊపుతూ అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. అకాల వర్షాలతో సర్వం కోల్పోయానని, తండ్రి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని, ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కేకలు వేశాడు. ఆప్ వలంటీర్లు, రైతులు కిందికి దిగిరావాలంటూ కోరినా దిగలేదు.
ఒకరిద్దరు ఆయనను రక్షించేందుకు చెట్టుపైకి ఎక్కుతుండగానే తన కండువా కొనను మెడచుట్టూ కట్టుకున్న గజేంద్ర మరోవైపును చెట్టుకు కట్టి ఉరివేసుకున్నాడు. చెట్టుపైకి ఎక్కిన వారు ఆ కొమ్మ వద్దకు చేరుకుని ముడి విప్పడానికి ప్రయత్నిస్తుండగా ఆ కొమ్మ విరిగి నేల కూలింది. వెంటనే రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. పంటనష్టాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనకు ముగ్గురు పిల్లలున్నారని, తండ్రి తనను దూరం పెట్టారని హిందీలో రాసిన లేఖ మృతుని వద్ద లభించింది. ఓవైపు రైతు ఆత్మహత్యకు పాల్పడుతుండగా.. రక్షించడానికి బదులు ప్రసంగాలను, ర్యాలీని కొనసాగించడంపై కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై విమర్శలు వెల్లువెత్తాయి.
గజేంద్ర ఆత్మహత్యపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, కేజ్రీవాల్ సంతాపం తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సమగ్ర దర్యాప్తునకు, కేజ్రీవాల్ మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఆత్మహత్యపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ పెట్టారు.
రైతులను మోసం చేశారు.. ధనికుల కోసమే మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. రైతులను బాధపెడుతూ భూసేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను ఇంత హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరిస్తారని నమ్మి బీజేపీకి ఓటేసిన రైతులను దారుణంగా మోసం చేశారని, కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం రైతుల విశ్వాసాన్ని కోల్పోయిందని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, హరియాణా, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల నుంచి ర్యాలీకి భారీగా తరలివచ్చిన రైతులు, కార్యకర్తలనుద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు.
‘ఎన్డీయే ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.. ధనికుల కోసమే ఈ ప్రభుత్వం నడుస్తోంది. మోదీ చుట్టూ 24 గంటలూ తిరిగే ధనికుల ప్రయోజనాల కోసమే భూసేకరణ చట్ట సవరణ బిల్లును తీసుకువస్తున్నారు’ అని అన్నారు. ర్యాలీలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రాజస్థాన్ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులేనని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజస్థాన్ ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించి ఉంటే.. ఆ రైతు బలవన్మరణానికి పాల్పడేవాడు కాదన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం తర్వాత మోదీపై కేజ్రీవాల్ ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి