న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) అభ్యర్థుల తుది జాబితా ఆదివారం(డిసెంబర్15) విడుదలైంది. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికలకు ఇప్పటికే ఆప్ మూడు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
తాజాగా 38మంది అభ్యర్థులతో ఫైనల్ లిస్టును విడుదల చేసింది.ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా సీఎం అతిశీ మరోసారి కాల్కాజీ సీటు నుంచి బరిలో నిలుస్తున్నారు. అలాగే, గ్రేటర్ కైలాశ్ సీటు నుంచి ఆప్ కీలక నేతలు సౌరభ్ భరద్వాజ్, బాబర్‌పుర్ నుంచి గోపాల్‌రాయ్, ఓఖ్లా నుంచి అమానతుల్లా ఖాన్, షాకుర్‌బస్తీ నుంచి సత్యేందర్‌కుమార్ జైన్‌ను బరిలో దించింది.
ఈ ఎన్నికల్లో 20మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆప్ సీట్లు నిరాకరించింది. కస్తూర్బానగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మదన్‌లాల్ స్థానంలో రమేశ్ పెహల్వాన్‌ను పోటీకి దించింది. బీజేపీని వీడిన రమేశ్ పెహల్వాన్ తన సతీమణి కుసుమ్‌లతతో కలిసి ఈ ఉదయమే ఆప్‌లో చేరారు.
ఆప్ పూర్తి ఆత్మవిశ్వాసంతో 70 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టినట్లు కేజ్రీవాల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘బీజేపీ అదృశ్యమైంది. ఆ పార్టీకి సీఎం అభ్యర్థి లేరు, ఒక టీమ్‌లేదు. ప్రణాళిక లేదు. ఢిల్లీపై ఒక విజన్ లేదు. కేజ్రీవాల్‌ను తొలగించాలన్నదే వాళ్లకు ఉన్న ఏకైక మిషన్’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment