Land Acquisition Law Amendment Bill
-
‘భూ’ బిల్లుపై పారిపోయారు
ఎన్డీయే ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు న్యూఢిల్లీ: భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై ఎన్డీయే ప్రభుత్వం అరిచి, బెదిరించి.. చివరికి పారిపోయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. ఇదే తరహాలో లలిత్‌మోదీ, వ్యాపమ్ అంశాల్లో సంబంధిత నేతల రాజీనామా కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. భూ సేకరణ చట్ట సవరణకు సంబంధించి యూపీఏ చేసిన చట్టంలోని అంశాలనే తిరిగి చేర్చాలంటూ పార్లమెంటరీ కమిటీలోని బీజేపీ సభ్యులు సోమవారం పేర్కొనడం తెలిసిందే. ఈమేరకు ‘భూ’ బిల్లుపై వెనక్కితగ్గనున్నట్లు కేంద్రం సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ మంగళవారం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఎప్పుడైనా మార్పులకు అవకాశం.. యూపీఏ చేసిన భూసేకరణ చట్టంలోని అంశాలను తిరిగి చేర్చాలని, మోదీ ప్రభుత్వం చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్‌సింగ్ చెప్పారు. అయితే ‘భూ’ బిల్లుపై వెనక్కితగ్గినట్లు కాదని, ఏకాభిప్రాయం మేరకు ఎప్పుడైనా మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. జేపీసీ సమావేశం వాయిదా భూ సేకరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) భేటీ ఆరు రోజులు వాయిదా పడింది. లోక్‌సభ నుంచి ఐదు రోజులపాటు సస్పెండైన కాంగ్రెస్ సభ్యుల్లో జేపీసీలోని కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ సతవ్ ఉండడంతో భేటీని ఈ నెల 10కి వాయిదా వేశారు. ఈమేరకు మంగళవారం జరిగిన జేపీసీ భేటీలో నిర్ణయించారు. దీంతో నివేదికకు ఉన్న గడువును(ఈనెల 7) మళ్లీ పొడిగించాలని కమిటీ లోక్‌సభను కోరనుంది. -
‘భూసేకరణ’ సవరణపై సీపీఐ సమరం
రాష్ట్రవ్యాప్తంగా జైల్‌భరో ‘చలో రాజ్‌భవన్’లో చాడ, ఇతర నేతల అరెస్ట్ హైదరాబాద్: భూసేకరణ చట్ట సవరణపై సీపీఐ సమరభేరి మోగించింది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరి అనుసరిస్తోందని ఆందోళనలకు దిగింది. భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జైల్‌భరో చేపట్టింది. దీనిలో భాగంగా గురువారం హైదరాబాద్‌లో ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజ్‌భవన్ వైపు దూసుకువచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నాయకులు బీవీ విజయలక్ష్మి, వీఎస్ బోస్, ఈటీ నర్సింహా తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన జైల్‌భరోలో ఆ పార్టీ సీనియర్ నేత అజీజ్‌పాషా తదితరులు అరెస్ట్ అయ్యారు. భూసేకరణ చట్ట సవరణలను నిరసిస్తూ సీపీఐ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల ఎదుట కార్యకర్తలు ‘జైల్‌భరో’ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చలో రాజ్‌భవన్‌ను నిర్వహించిన సీపీఐ రాష్ట్ర నాయకులను ఖైరతాబాద్ చౌరస్తాలో అరెస్ట్ చేశారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించి, 2013 భూసేకరణ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లుకు అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలన్నా రు. యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చినపుడు సమర్థించి ఇప్పుడు ఎందుకు సవ రణలు చేస్తున్నారని ప్రశ్నించారు. -
ఆప్ సభలో రైతు ఆత్మహత్య
సభా ప్రాంగణంలోనే వేపచెట్టుకు కండువాతో ఉరేసుకున్న రాజస్థాన్ రైతు గజేంద్రసింగ్ వర్షాలకు పంటనష్టంతో ఆవేదనతోనే అంటూ సూసైడ్ నోట్ పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో కేజ్రీవాల్ ఎదుటే ఘటన భూసేకరణ బిల్లుకు నిరసనగా ఆప్ సభ.. మృతునికి ముగ్గురు పిల్లలు న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున, పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా వేలాది మంది చూస్తుండగా, ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలి అకాల వర్షాలకు తన పంట పూర్తిగా నాశనమైందని, ఇక తనకు భవిష్యత్తు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ముగ్గురు పిల్లల తండ్రి తనువు చాలించాడు. చనిపోయే ముందు భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా నినదించాడు. జంతర్‌మంతర్ వద్ద బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చేపట్టిన కిసాన్ ర్యాలీలో దేశంలోని రైతాంగ దుస్థితికి అద్దంపట్టే ఈ విషాదం చోటు చేసుకుంది. భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆప్ తలపెట్టిన కిసాన్‌ర్యాలీలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని దౌసా నుంచి గజేంద్రసింగ్ అనే రైతు వచ్చాడు. ఒకవైపు ర్యాలీనుద్దేశించి ఆప్ నేతలు ప్రసంగిస్తుండగానే.. గజేంద్ర ధర్నా వేదిక సమీపంలోని వేపచెట్టుపైకి ఎక్కాడు. చేతిలో ఆప్ ఎన్నికల గుర్తు ‘చీపురు’ను ఊపుతూ అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. అకాల వర్షాలతో సర్వం కోల్పోయానని, తండ్రి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని, ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కేకలు వేశాడు. ఆప్ వలంటీర్లు, రైతులు కిందికి దిగిరావాలంటూ కోరినా దిగలేదు. ఒకరిద్దరు ఆయనను రక్షించేందుకు చెట్టుపైకి ఎక్కుతుండగానే తన కండువా కొనను మెడచుట్టూ కట్టుకున్న గజేంద్ర మరోవైపును చెట్టుకు కట్టి ఉరివేసుకున్నాడు. చెట్టుపైకి ఎక్కిన వారు ఆ కొమ్మ వద్దకు చేరుకుని ముడి విప్పడానికి ప్రయత్నిస్తుండగా ఆ కొమ్మ విరిగి నేల కూలింది. వెంటనే రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. పంటనష్టాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనకు ముగ్గురు పిల్లలున్నారని, తండ్రి తనను దూరం పెట్టారని హిందీలో రాసిన లేఖ మృతుని వద్ద లభించింది. ఓవైపు రైతు ఆత్మహత్యకు పాల్పడుతుండగా.. రక్షించడానికి బదులు ప్రసంగాలను, ర్యాలీని కొనసాగించడంపై కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై విమర్శలు వెల్లువెత్తాయి. గజేంద్ర ఆత్మహత్యపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, కేజ్రీవాల్ సంతాపం తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సమగ్ర దర్యాప్తునకు, కేజ్రీవాల్ మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఆత్మహత్యపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టారు. రైతులను మోసం చేశారు.. ధనికుల కోసమే మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. రైతులను బాధపెడుతూ భూసేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను ఇంత హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరిస్తారని నమ్మి బీజేపీకి ఓటేసిన రైతులను దారుణంగా మోసం చేశారని, కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం రైతుల విశ్వాసాన్ని కోల్పోయిందని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, హరియాణా, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల నుంచి ర్యాలీకి భారీగా తరలివచ్చిన రైతులు, కార్యకర్తలనుద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ఎన్డీయే ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.. ధనికుల కోసమే ఈ ప్రభుత్వం నడుస్తోంది. మోదీ చుట్టూ 24 గంటలూ తిరిగే ధనికుల ప్రయోజనాల కోసమే భూసేకరణ చట్ట సవరణ బిల్లును తీసుకువస్తున్నారు’ అని అన్నారు. ర్యాలీలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రాజస్థాన్ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులేనని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజస్థాన్ ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించి ఉంటే.. ఆ రైతు బలవన్మరణానికి పాల్పడేవాడు కాదన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం తర్వాత మోదీపై కేజ్రీవాల్ ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి -
ఆ బిల్లును అందరూ వ్యతిరేకిస్తున్నారు
భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్ - బిల్లుకు రాజ్యసభలో ఆమోదం కష్టమే - కేంద్రం ఇప్పటికే పునరాలోచనలో పడింది - ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కారత్ సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో భూ సేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందే ప్రసక్తే లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో వామపక్షాల బలం తక్కువగానే ఉన్నా, యావత్ ప్రతిపక్షం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నందున అది ఆమోదం పొందే అవకాశం లేదని చెప్పారు. సీపీఎం తొలి తెలంగాణ రాష్ట్ర మహాసభ ల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజ్యసభలో ఎన్డీఏ కు తగిన బలం లేకపోయినా, ఉభయసభల సమావేశాన్ని పెట్టి ఆ బిల్లును ఆమోదింప చేసుకుంటామని బీజేపీ చెబుతోంది కదా అన్న ప్రశ్నకు.. లోక్‌సభలో లేదా రాజ్యసభలో బిల్లు తిరస్కరణకు గురైనపుడే ఉమ్మడి సమావేశాన్ని పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎలాగైనా సరే ఈ బిల్లును ఆమోదింపచేసుకుంటామని ప్రధాని మోదీ చెబుతున్నారు కదా అన్న ప్రశ్నకు, కేంద్రం ఇప్పటికే ఈ విషయంలో పునరాలోచనలో పడిందన్నారు. ఈ బిల్లు రాజ్యసభకు వస్తుందా లేదా అన్నది అనుమానంగానే ఉందన్నారు. ఆయా అంశాలపై ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. సాక్షి: రైల్వే, సాధారణ బడ్జెట్లపై లెఫ్ట్ ఏవైనా ఆందోళనలు చేపడుతుందా? కారత్: కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా కార్పొరేట్ రంగానికి అనుకూలంగా బడ్జెట్లలో ఆయా ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి ఆయా వర్గాల ప్రజల్లో వ్యక్తమయ్యే ఆందోళన, అసంతృప్తిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీపీఎం, సీపీఐ జాతీయ మహాసభలు ముగిసిన తర్వాత కార్యాచరణను రూపొందించుకుంటాం. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలసి ఆందోళనలు చేసే అవకాశముందా? ఇకముందు కాంగ్రెస్, ఇతర బూర్జువాపార్టీలతో కలసి ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనే అవకాశాలు లేవు. వామపక్షాల కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? సీపీఐ, సీపీఎం జాతీయ మహాసభలు ముగిశాక, ఆయా అంశాలపై చర్చించుకుని, కార్యక్రమాలను రూపొందించుకుంటాం. ఇప్పటికే ఆరు వామపక్షాలు కలసి పనిచేస్తున్నాయి. ముందుగా వామపక్షాల మధ్య ఐక్యత సాధిం చేందుకు కృషి చేస్తూనే, ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై ప్రజాస్వామ్యశక్తులతో కలసి ఆందోళనలను తీవ్రతరం చేయాలనే ఆలోచనతో ఉన్నాము. దేశంలో వ్యవసాయ సంక్షోభం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏ విధమైన వైఖరిని తీసుకుంటారు? వ్యవసాయరంగానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకేవిధమైన పరిస్థితులు, సమస్యలు లేవు. తెలంగాణలో ఒకవిధంగా, మరో రాష్ర్టంలో మరో విధంగా పంటలతీరు, వాతావరణ పరిస్థితులున్నాయి. అయితే భూసంస్కరణల అంశం అందరికీ సంబంధించిన విషయం కాబట్టి దానిపై కార్యాచరణను చేపడుతున్నాం. భూసంస్కరణ చట్టానికి సవరణలు, బీమారంగంలో ఎఫ్‌డీఐల కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటాం. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ను సస్పెండ్ చేస్తారా? ఆ అవసరమే లేదు. పార్టీలో అచ్యుతానందన్ ఒంటరి అయ్యారు. ఆయన ఒక వ్యక్తి మాత్రమే. కేరళలో మొదటిసారిగా 20 ఏళ్లలో పార్టీలో రాజకీయంగా, సంస్థాగతంగా ఐక్యత కనిపించింది. క్రమశిక్షణకు కట్టుబడితే మాజీ సీఎం అచ్యుతానందన్ మళ్లీ పార్టీలోకి రావొచ్చు. ప్రస్తుతం ఆయన స్థానాన్ని ఖాళీగానే ఉంచాం.