‘భూ’ బిల్లుపై పారిపోయారు
ఎన్డీయే ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
న్యూఢిల్లీ: భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై ఎన్డీయే ప్రభుత్వం అరిచి, బెదిరించి.. చివరికి పారిపోయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. ఇదే తరహాలో లలిత్‌మోదీ, వ్యాపమ్ అంశాల్లో సంబంధిత నేతల రాజీనామా కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. భూ సేకరణ చట్ట సవరణకు సంబంధించి యూపీఏ చేసిన చట్టంలోని అంశాలనే తిరిగి చేర్చాలంటూ పార్లమెంటరీ కమిటీలోని బీజేపీ సభ్యులు సోమవారం పేర్కొనడం తెలిసిందే. ఈమేరకు ‘భూ’ బిల్లుపై వెనక్కితగ్గనున్నట్లు కేంద్రం సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ మంగళవారం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.
ఎప్పుడైనా మార్పులకు అవకాశం..
యూపీఏ చేసిన భూసేకరణ చట్టంలోని అంశాలను తిరిగి చేర్చాలని, మోదీ ప్రభుత్వం చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్‌సింగ్ చెప్పారు. అయితే ‘భూ’ బిల్లుపై వెనక్కితగ్గినట్లు కాదని, ఏకాభిప్రాయం మేరకు ఎప్పుడైనా మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు.
జేపీసీ సమావేశం వాయిదా
భూ సేకరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) భేటీ ఆరు రోజులు వాయిదా పడింది. లోక్‌సభ నుంచి ఐదు రోజులపాటు సస్పెండైన కాంగ్రెస్ సభ్యుల్లో జేపీసీలోని కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ సతవ్ ఉండడంతో భేటీని ఈ నెల 10కి వాయిదా వేశారు. ఈమేరకు మంగళవారం జరిగిన జేపీసీ భేటీలో నిర్ణయించారు. దీంతో నివేదికకు ఉన్న గడువును(ఈనెల 7) మళ్లీ పొడిగించాలని కమిటీ లోక్‌సభను కోరనుంది.