న్యూఢిల్లీ: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. ‘‘మీ ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని పిలుచుకోండి. కానీ, మేము ముమ్మాటికీ ఇండియానే. మణిపూర్‌లో ఇండియా భావనను కచ్చితతంగా పునర్నిర్మిస్తాం. మణిపూర్ కోలుకొనేందుకు సహకరిస్తాం. రాష్ట్రంలో ప్రతి మహిళ, ప్రతి చిన్నారి కన్నీటిని తుడిచేస్తాం. ప్రజల కోసం ప్రేమను, శాంతిని తిరిగి తీసుకొస్తాం’’ అని రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు.
ఎప్పటికీ భరతమాత బిడ్డలమే: ఖర్గే
తాము మణిపూర్ హింసపై పార్లమెంట్‌లో మాట్లాడుతుంటే ప్రధాని మోదీ మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి పార్లమెంట్ బయట మాట్లాడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇండియా కూటమిని ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చడం ఏమిటని ప్రశ్నించారు. తాము ఎప్పటికీ భరతమాత బిడ్డలమేనని అన్నారు. ఈ మేరకు ఖర్గే ట్వీట్ చేశారు.
బీజేపీ రాజకీయ పూర్వీకులు బ్రిటిష్ పాలకులకు బానిసలుగా పని చేశారని ధ్వజమెత్తారు. వాక్చాతుర్యంతో ప్రజల దృష్టిని మళ్లించడం ఆపాలని ప్రధాని మోదీకి హితవు పలికారు. మణిపూర్ హింసపై ఇకనైనా స్పందించాలని సూచించారు. ‘ఇండియా’ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని, ప్రధానమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చవద్దని చెప్పారు.
పేరులో ఏమీ లేకపోతే ప్రతిపక్ష కూటమి పేరును చూసి మోదీ ఎందుకు భయపడుతున్నారని ఖర్గే ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వీడియో విడుదల చేశారు. పాట్నా, బెంగళూరులో ఇండియా కూటమి సమావేశాలు విజయవంతం కావడాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు.
ఎన్డీయే.. జాతీయ అపకీర్తి కూటమి
26 పార్టీలతో కూడిన విపక్ష ఇండియా కూటమిని చూసి ప్రధాని మోదీ బెంబేలెత్తిపోతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే మృతప్రాయంగా మారిన ఎన్డీయేకు ప్రాణం పోసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, విపక్షాలపై దూషణల ద్వారా ఎన్డీయేకు కొత్త అర్థం చెబుతున్నారని వెల్లడించారు.
ఎన్డీయే అంటే జాతీయ ప్రజాస్వామ్య కూటమి కాదని, అది జాతీయ అపకీర్తి కూటమి అని ట్విట్టర్‌లో తేల్చిచెప్పారు. విపక్ష కూటమిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) తదితర పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా కూడా తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment