‘భూసేకరణ’ సవరణపై సీపీఐ సమరం
రాష్ట్రవ్యాప్తంగా జైల్‌భరో
‘చలో రాజ్‌భవన్’లో చాడ, ఇతర నేతల అరెస్ట్
హైదరాబాద్: భూసేకరణ చట్ట సవరణపై సీపీఐ సమరభేరి మోగించింది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరి అనుసరిస్తోందని ఆందోళనలకు దిగింది. భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జైల్‌భరో చేపట్టింది. దీనిలో భాగంగా గురువారం హైదరాబాద్‌లో ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజ్‌భవన్ వైపు దూసుకువచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నాయకులు బీవీ విజయలక్ష్మి, వీఎస్ బోస్, ఈటీ నర్సింహా తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన జైల్‌భరోలో ఆ పార్టీ సీనియర్ నేత అజీజ్‌పాషా తదితరులు అరెస్ట్ అయ్యారు.
భూసేకరణ చట్ట సవరణలను నిరసిస్తూ సీపీఐ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల ఎదుట కార్యకర్తలు ‘జైల్‌భరో’ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చలో రాజ్‌భవన్‌ను నిర్వహించిన సీపీఐ రాష్ట్ర నాయకులను ఖైరతాబాద్ చౌరస్తాలో అరెస్ట్ చేశారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించి, 2013 భూసేకరణ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లుకు అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలన్నా రు. యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చినపుడు సమర్థించి ఇప్పుడు ఎందుకు సవ రణలు చేస్తున్నారని ప్రశ్నించారు.