భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్
- బిల్లుకు రాజ్యసభలో ఆమోదం కష్టమే
- కేంద్రం ఇప్పటికే పునరాలోచనలో పడింది
- ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కారత్
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో భూ సేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందే ప్రసక్తే లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు.
లోక్‌సభ, రాజ్యసభల్లో వామపక్షాల బలం తక్కువగానే ఉన్నా, యావత్ ప్రతిపక్షం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నందున అది ఆమోదం పొందే అవకాశం లేదని చెప్పారు. సీపీఎం తొలి తెలంగాణ రాష్ట్ర మహాసభ ల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజ్యసభలో ఎన్డీఏ కు తగిన బలం లేకపోయినా, ఉభయసభల సమావేశాన్ని పెట్టి ఆ బిల్లును ఆమోదింప చేసుకుంటామని బీజేపీ చెబుతోంది కదా అన్న ప్రశ్నకు.. లోక్‌సభలో లేదా రాజ్యసభలో బిల్లు తిరస్కరణకు గురైనపుడే ఉమ్మడి సమావేశాన్ని పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎలాగైనా సరే ఈ బిల్లును ఆమోదింపచేసుకుంటామని ప్రధాని మోదీ చెబుతున్నారు కదా అన్న ప్రశ్నకు, కేంద్రం ఇప్పటికే ఈ విషయంలో పునరాలోచనలో పడిందన్నారు. ఈ బిల్లు రాజ్యసభకు వస్తుందా లేదా అన్నది అనుమానంగానే ఉందన్నారు. ఆయా అంశాలపై ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..
సాక్షి: రైల్వే, సాధారణ బడ్జెట్‌లపై లెఫ్ట్ ఏవైనా ఆందోళనలు చేపడుతుందా?
కారత్: కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా కార్పొరేట్ రంగానికి అనుకూలంగా బడ్జెట్‌లలో ఆయా ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి ఆయా వర్గాల ప్రజల్లో వ్యక్తమయ్యే ఆందోళన, అసంతృప్తిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీపీఎం, సీపీఐ జాతీయ మహాసభలు ముగిసిన తర్వాత కార్యాచరణను రూపొందించుకుంటాం.
కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలసి ఆందోళనలు చేసే అవకాశముందా?
ఇకముందు కాంగ్రెస్, ఇతర బూర్జువాపార్టీలతో కలసి ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనే అవకాశాలు లేవు.
వామపక్షాల కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి?
సీపీఐ, సీపీఎం జాతీయ మహాసభలు ముగిశాక, ఆయా అంశాలపై చర్చించుకుని, కార్యక్రమాలను రూపొందించుకుంటాం. ఇప్పటికే ఆరు వామపక్షాలు కలసి పనిచేస్తున్నాయి. ముందుగా వామపక్షాల మధ్య ఐక్యత సాధిం చేందుకు కృషి చేస్తూనే, ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై ప్రజాస్వామ్యశక్తులతో కలసి ఆందోళనలను తీవ్రతరం చేయాలనే ఆలోచనతో ఉన్నాము.
దేశంలో వ్యవసాయ సంక్షోభం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏ విధమైన వైఖరిని తీసుకుంటారు?
వ్యవసాయరంగానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకేవిధమైన పరిస్థితులు, సమస్యలు లేవు. తెలంగాణలో ఒకవిధంగా, మరో రాష్ర్టంలో మరో విధంగా పంటలతీరు, వాతావరణ పరిస్థితులున్నాయి. అయితే భూసంస్కరణల అంశం అందరికీ సంబంధించిన విషయం కాబట్టి దానిపై కార్యాచరణను చేపడుతున్నాం. భూసంస్కరణ చట్టానికి సవరణలు, బీమారంగంలో ఎఫ్‌డీఐల కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటాం.
కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ను సస్పెండ్ చేస్తారా?
ఆ అవసరమే లేదు. పార్టీలో అచ్యుతానందన్ ఒంటరి అయ్యారు. ఆయన ఒక వ్యక్తి మాత్రమే. కేరళలో మొదటిసారిగా 20 ఏళ్లలో పార్టీలో రాజకీయంగా, సంస్థాగతంగా ఐక్యత కనిపించింది. క్రమశిక్షణకు కట్టుబడితే మాజీ సీఎం అచ్యుతానందన్ మళ్లీ పార్టీలోకి రావొచ్చు. ప్రస్తుతం ఆయన స్థానాన్ని ఖాళీగానే ఉంచాం.
ఆ బిల్లును అందరూ వ్యతిరేకిస్తున్నారు
Published Mon, Mar 2 2015 4:01 AM | Last Updated on Wed, Aug 29 2018 9:12 PM
Advertisement
Advertisement