
ముంబై వైపు కొనసాగుతున్న ర్యాలీ
మహారాష్ట్ర : అఖిల భారతీయ కిసాన్ సభ (ఏబీకేఎస్) ఆధ్వర్యంలో మహారాష్ట్ర రైతులు చేపట్టిన మహాధర్నా ఆదివారం ముంబైకి చేరింది. సుమారు 35 వేల మంది రైతులు పాల్గొంటున్న ఈ ర్యాలీకి అన్ని రాజకీయ పక్షాలూ మద్దతు పలికాయి. రైతులంతా సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడించనున్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ 35 వేల మంది రైతులు నాసిక్ నుంచి ముంబైకి పాదయాత్రగా బయలుదేరిన సంగతి తెలిసిందే. రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలుచేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్.
వీటితోపాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 40 వేల రూపాయల పరిహారం అందజేయాలని, గుజరాత్‌కు నీటి విడుదల వెంటనే నిలిపివేయాలనే డిమాండ్లూ ఉన్నాయి. రైతులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, వృద్ధులు ర్యాలీలో పాల్గొనడం విశేషం. కిసాన్ సభ మహార్యాలీకి శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు సీపీఎం పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని ఏబీకేస్ కార్యదర్శి తెలిపారు.
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి.. ‘రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకొచ్చారు. ఇకపై బీజేపీ ప్రభుత్వం వారిని మోసం చేయలేదంటూ’ ట్వీట్ చేశారు. నాసిక్‌లో మంగళవారం ప్రారంభమైన రైతు యాత్ర రోజుకు సగటున 35 కిలో మీటర్ల మేర కొనసాగుతూ సోమవారం దక్షిణ ముంబైకి చేరనుంది. గతంలో కూడా సుమారు లక్ష మంది రైతులు ఒకేచోటికి చేరి నిరసన వ్యక్తం చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment