
సాక్షి, ముంబయి : రైతుల న్యాయమైన డిమాండ్లను నిరాకరిస్తే కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను వారు కూల్చివేస్తారని పాలక బీజేపీని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హెచ్చరించారు. కిసాన్ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ఏచూరి మీడియాతో మాట్లాడుతూ రైతులు భారత్‌కు ఆధునిక సైనికులని అభివర్ణించారు. సైనికులు సరిహద్దులను కాపాడితే,..రైతులు ఆహారంతో ప్రజలను రక్షిస్తున్నారని కొనియాడారు. రైతుల ఆకాంక్షలను నెరవేర్చని పార్టీలు మనుగడ కోల్పోతాయని అన్నారు. గత ఏడాది దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్ర రైతుల సమ్మెతో ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించాల్సి వచ్చిందన్నారు.
మాఫీని ప్రకటించి పది నెలలు గడిచినా అది అమలుకు నోచుకోలేదన్నారు. 88 సంవత్సరాల కిందట ఇదే రోజున మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహంతో బ్రిటిష్ పాలకులను వణికించారని చెప్పారు. రైతుల డిమాండ్లను పట్టించుకోకుంటే కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను వారు కుప్పకూల్చుతారని ఏచూరి హెచ్చరించారు. కార్పొరేట్ల రుణాలను మాఫీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రభుత్వం అన్నదాతలను విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment