సాక్షి, న్యూఢిల్లీ : డిమాండ్ల సాధనకు దేశ రాజధాని బాట పట్టిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించే క్రమంలో ఢిల్లీ-యూపీ బోర్డర్‌లో ఉద్రిక్తత నెలకొంది. రైతులను ఢిల్లీలోకి చొచ్చుకురానీయకుండా నిరోధించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో తొలగించడంతో పోలీసులు అన్నదాతలను అడ్డుకున్నారు. లాఠీచార్జి, భాష్పవాయుగోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
రైతులు, పోలీసుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఓ ఏసీపీ సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బారికేడ్లను తొలగించవద్దని రైతులను కోరినా వారు వినిపించుకోలేదని ట్రాక్టర్లతో బారికేడ్లను ధ్వంసం చేయడంతో పాటు రాళ్లదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. పోలీసులే ఆందోళనకారులను రెచ్చగొట్టారని రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. హింసకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలను, వాటర్ కెనాన్లను ప్రయోగించామని పోలీసులు తెలిపారు.
రైతులను ఢిల్లీ చేరుకోకుండా నిలువరించేందుకు 3000 మంది పోలీసులను ఢిల్లీ-యూపీ బోర్డర్‌లో నియమించారు. స్వామినాధన్ కమిషన్ నివేదికను అమటు చేయాలని, రుణమాఫీ ప్రకటించాలని, ఇంధన ధరలు తగ్గించాలనే పలు డిమాండ్లతో రైతులు హరిద్వార్ నుంచి రాజ్‌ఘాట్ వరకూ కిసాన్ క్రాంతి యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment