
సాక్షి, న్యూఢిల్లీ: సీఏఏకి నిరసనగా గత డిసెంబరు 15 న ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనలో మహమ్మద్ మిన్హాజుద్దీన్ అనే విద్యార్ధి కంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ లైబ్రరీలోకి ప్రవేశించిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. లాఠీ దెబ్బలు అతని ఎడమకంటికి బలంగా తగిలాయి. అంతే ! తీవ్ర గాయమైన మిన్హాజుద్దీన్ కంటి చూపు పోయింది. ఆ సమయంలో అతను మానవహక్కులకు సంబంధించిన వ్యాసం రాస్తున్నాడు. గాయం అనంతరం డాక్టర్ల వద్దకు వెళ్లగా అతని కంటిని పరీక్షించిన వారు ఇక శాశ్వతంగా చూపు రాదని స్పష్టం చేశారు. (కొట్టరాని చోటా కొట్టారు)
ఆశ్చర్యం ఏమిటంటే పోలీసు లాఠీ తనపై విరగడానికి కేవలం కొద్ది నిముషాల ముందే మిన్హాజుద్దీన్ తన వ్యాసాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత కంటి చూపు కోల్పోయి తలనొప్పి ఎంతగా బాధిస్తున్నా.. ఆ పేపర్ కి తుదిమెరుగులు దిద్ది తన యూనివర్సిటీ అధ్యాపకుల సంఘానికి సమర్పించాడు. రెండు నెలలు గడిచిపోయాయి. మానవ హక్కులపై మిన్హాజుద్దీన్ రాసిన ఆర్టికల్ కే ఉత్తమమైనదిగా జామియా టీచర్స్ అసోసియేషన్ అవార్డు లభించింది. ఈ అవార్డుకు ఆ విద్యార్ధి పొంగిపోలేదు. మానవ హక్కులు రోజురోజుకీ ఎందుకిలా దిగజారిపోతున్నాయా అన్నదే ఇప్పుడా 26 ఏళ్ళ విద్యార్ధి మనోవేదన ! ఒక చట్టానికి నిరసనగా ఆందోళన చేసినంత మాత్రాన ఎక్కడో లైబ్రరీలో ఉన్న తనలాంటి విద్యార్థుల మీద పోలీసు లాఠీ విరగడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. (‘ఢిల్లీకి వచ్చి పెద్ద తప్పు చేశాను’)
Comments
Please login to add a commentAdd a comment