
'నాకు కుల పట్టింపు లేదు'
న్యూఢిల్లీ: తనకు కుల పట్టింపులు లేవని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఆయన చేపట్టిన కిసాన్ ర్యాలీ 200 కిలోమీటర్లు చేరింది. ఈ ర్యాలీలో ఆయన ఎన్నో చోట్ల ఆగారు. రోడ్డు వెంట ఉన్న పలు టీ షాపుల్లో ఆగారు. గుడిసెల్లోకి వెళ్లారు. ఆలయాల్లోకి వెళ్లారు. అన్ని రకాల ప్రజలను పలకరించారు. ఈ సందర్భంగా ఆయనను ఓ మీడియా ఇంటర్వ్యూ చేస్తూ యూపీ ఎన్నికల సందర్భంగా మీరు బ్రాహ్మణ వర్గాన్ని ఎక్కువగా మద్దతిస్తున్నారా అని ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు.
'నాకు కులంపై నమ్మకం లేదు. దానికి ఎప్పుడు నేను ప్రత్యేకంగా మద్దతు తెలపను. అంగీకరించను. పార్టీ పరంగా నేను అందరినీ సమంగానే చూస్తాను. పార్టీ టికెట్లు ఇచ్చే సమయంలో కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని సమంగా ఇస్తాను. ఇది నేనొక్కడిని తీసుకునే నిర్ణయం కూడా కాదు. అందరం కూర్చుని చర్చించే నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు నేను చేస్తున్న కిసాన్ ర్యాలీ కులానికి సంబంధించినది కాదు' అని చెప్పారు.
దేశ వ్యాప్తంగా రైతుల సమస్యలు ఉండగా మీరు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే ఎందుకు ర్యాలీ చేస్తున్నారు? ఎన్నికలు దృష్టిలో పెట్టుకునేనా అని ప్రశ్నించగా మెల్లిగా నవ్వుతూ దేశ వ్యాప్తంగా ర్యాలీ తీయాలా లేక ఒక రాష్ట్రంలో తొలుత ర్యాలీ తీయాలా అని ఆలోచించి చివరకు యూపీలో తీయాలని అనుకున్నామని చెప్పారు. ప్రతిపక్షంగా ప్రజలు ఏ చెబితే దానిని ప్రభుత్వానికి సూచించడం తన బాధ్యత అని అన్నారు.