సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం శూన్య హామీలు మినహా రైతులకు ఎలాంటి మేలూ చేయలేదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగిన కిసాన్ మార్చ్‌లో రాహుల్ పాల్గొన్నారు. మద్దతు ధర పెంపు, బోనస్‌లపై రైతులకు వాగ్ధానం చేసిన మోదీ ఇప్పుడు హామీలు నెరవేర్చకుండా కబుర్లు చెబుతున్నారని ఆక్షేపించారు.
పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తే రైతు రుణాలను కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తాము రైతుల పక్షాన ఉండి వారి తరపున పోరాటం చేస్తామని రాహుల్ అన్నదాతలకు భరోసా ఇచ్చారు. మీ శక్తితోనే ఈ దేశం బలోపేతమైందని అన్నారు. దేశం నలుమూలల నుంచీ రాజధానికి చేరుకున్న వేలాది రైతులు పార్లమెంట్ స్ర్టీట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సంఘీభావ సభలో పలువురు నేతలు రైతులకు బాసటగా నిలిచారు.
మోదీ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో రైతులు మోదీ సర్కార్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని రైతుల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త మేథా పాట్కర్ ఆరోపించారు. రైతులు, గిరిజనుల భూములను బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment