సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రధాన పార్టీల నడుమ మరోసారి రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. 94 అసెంబ్లీ స్థానాలకు బిహార్‌లో రెండోదశ పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఈ స్థానాలు జేడీయూ, ఆర్జేడీకి ఎంతో ముఖ్యమైనవి. ఎన్డీయే తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు కేంద్రమంత్రులు సైతం ఆయా నియోజకవర్గల్లో సుడిగాలి పర్యటన చేశారు. జేడీయూ-బీజేపీ అభ్యర్థుల విజయానికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీకి రెండోదశ పోలింగ్ అత్యంత కీలమైనది. కూటమి తరుఫున తేజస్వీ అన్నీ తానై ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. ఇక 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి ఇప్పటికే తొలిదశ పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే.
మరోవైపు మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రత్యేక దృష్టికి ఆకర్షించాయి. కమల్‌నాథ్ సర్కార్‌ను కూల్చి బీజేపీ గూటికి చేరిన 25 మంది ఎమ్మెల్యే రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మరో మూడు స్థానాలు కలుపుకుని మొత్తం 28 స్థానాలకు పోలింగ్ ఇదివరకే మొదలైంది. ఈ ఎన్నికను అధికార బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 28 స్థానాల్లో తొమ్మిదింటిలో గెలిస్తే శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన జ్యోతిరాధిత్య సింధియాకూ ఈ ఎన్నిక కీలకమైనది. ఆయన వర్గంగా భావిస్తున్న ఎమ్మెల్యేలంతా పోటీలో ఉండటంతో బీజేపీ నాయకత్వంలో వారి గెలుపు బాధ్యతను యువ నేతపై మోపింది.
కాంగ్రెస్ నుంచి అవమానానికి గురై తిరుగుబాటు చేసిన సింధియా ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బ తీయాలని కసితో రగిలిపోతున్నారు. అదే స్థాయిలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం సైతం జోరుగా నిర్వహించారు. మరోవైపు చేతిలో ఉన్న అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్న 28 సీట్లు గెలిచినా మ్యాజిక్ ఫిగర్‌కు ఒక్క అడుగు దూరంలో ఆ పార్టీ నిలిచిపోతుంది. అయినప్పట్టికీ స్వతంత్రుల మద్దతులో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని మారుస్తాయా? లేక ఏకపక్ష తీర్పు రానుందా అనేది వేచి చూడాలి. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగటం గమనార్హం. మరోవైపు గుజరాత్(8), కర్ణాటక(2), చత్తీస్‌గఢ్(1), ఉత్తర ప్రదేశ్(7), జార్ఖండ్(2), నాగాలాండ్(2), హరియాణా(1), ఒడిశా(2), తెలంగాణ (దుబ్బాక)ల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment