Mandsaur farmers
-
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా...
అటు వ్యవసాయరంగంలోని రైతులు, వ్యవసాయకార్మికులు, ఇటు పారిశ్రామికరంగంలోని ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న శ్రామికులు దేశం నలుమూలల నుంచి కదిలారు. శ్రమశక్తినే నమ్ముకున్న ఈ శ్రామికవర్గం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా తమ మౌలికసమస్యల పరిష్కారానికి గళమెత్తారు. కార్మికులు, కర్షకులు భుజం, భుజం కలిపి ఏకతాటిపై నడిచారు. అంగన్వాడి, ఆశావర్కర్లు, ఇలా వివిధరంగాలకు చెందిన కార్మిక,కర్షకలోకం వెంట నడిచింది. బుధవారం ఢిల్లీ నడివీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. చలోపార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొత్తం 23 రాష్ట్రాల నుంచి రైతులు, కార్మికులు ఢిల్లీకి చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకున్న వారందరికీ రామ్‌లీలా మైదానంలోనే టెంట్లు, ఇతరత్రా ఏర్పాట్లతో తాత్కాలికంగా బస ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావించారు. అయితే గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో అక్కడి నేలంతా బురదమయమై చిత్తడిగా మారింది. ఈ ఇబ్బందులను కూడా లెక్కచేయకుండా చాలా మంది రైతులు, కార్మికులు అక్కడే ఎలాగోలా సర్దుకున్నారు. మిగతావారిని గురుద్వారాలు, సాహిబాబాద్‌లోని క్యాంపులు, విడిదికేంద్రాలకు వాలంటీర్లు తరలించారు. దేశం నలుమూలల నుంచి ఢిల్లీకి వచ్చిన పలువురు శ్రామికులు, కర్షకులు అనారోగ్యం బారిన కూడా పడ్డారు. జ్వరం, జలుబు, డయేరియా వంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి ఢిల్లీ ప్రభుత్వ సంచార ఆరోగ్యపథకం పరిధిలోని నలుగురు డాక్టర్ల బృందం సపర్యలు చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 699 మందికి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఈ బృందంలోని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినీత్‌కుమార్ సాహు తెలిపారు. గత మార్చినెలలో నాసిక్ నుంచి ముంబై వరకు నిర్వహించిన రైతుల ‘మహాపాదయాత్ర’లో పాల్గొన్న వారిలో 5 వేల మంది ఈ ర్యాలీలోనూ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించి మరో బృందం మణిపూర్ నుంచి పయనమైంది. మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ నుంచి ఓ రైతుల బృందం దేశ రాజధానికి వచ్చి చేరింది. బిహార్ నుంచి వచ్చిన మహిళా రైతులు, కార్మికుల బృందం తమ జానపద నృత్యాల ద్వారా ఢిల్లీ నిరసనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలోని ఆదిలాబాద్, తదితర ప్రాంతాల నుంచి అంగన్వాడి స్కూల్ టీచర్లుగా, వర్కర్లుగా పనిచే స్తున్న మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఎం అనుబంధ సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), అఖిల భారత కిసాన్ సభ, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లు... స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలో భాగంగా రైతులకు గిట్టుబాటుధరలు, సకాలంలో రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, ధరల పెరుగుదల నియంత్రించి, ప్రజాపంపిణీ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు, ఉపాధి కల్పనకు గట్టి చర్యలు తీసుకోవాలి. రైతుల పంటరుణాల మాఫీ, కార్మికచట్టాల సక్రమ అమలు, నెలకు కనీస వేతనంగా రూ. 18 వేలు, మరిన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, దేశవ్యాప్తంగా కోటి మంది అంగన్వాడి వర్కర్లు, అక్రిడేటెడ్ సోషల్ హెఃల్త్ యాక్టివిస్ట్‌లను కార్మికులుగా ప్రభుత్వ గుర్తింపు. -
మాంద్సౌర్ కాల్పులపై కమిటీ నివేదిక
భోపాల్: గత ఏడాది మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో పోలీసుల కాల్పుల కారణంగా ఆరుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. కాల్పులపై నియమించిన కమిటీ మంగళవారం తుది నివేదికను విడుదల చేసింది. పంటకు మద్దతు ధర కల్పించాలని, పూర్తి రుణమాఫీ చేయాలని రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు ఆత్మరక్షణకై రైతులపై కాల్పులు జరిపారని విచారణ కమిషన్ చైర్మన్ ఏకే జైన్ తెలిపారు. కాల్పుల్లో మొదట ఐదుగురు చనిపోగా, తీవ్రంగా గాయపడిన వారిలో మరొకరు మరణించారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒక్క పోలీసు అధికారి మీద కూడా కేసు నమోదు కాకపోవడం గమనార్హం. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కాల్పులు జరిపారని, ఇలాంటివి జరగడం దురదృష్టకరమని రాష్ట్ర హోం మంత్రి భుపేందర్‌సింగ్ అన్నారు. రైతులపై కాల్పులు జరిపి ఏడాది గడిచిన సందర్భంగా మంద్‌సౌర్‌లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇటీవల కిసాన్ ఆందోళన్ ర్యాలీని నిర్వహించిన విషయం తెలిసిందే. -
‘ఆ మూడు రాష్ట్రాల్లో విజయం మాదే’
భోపాల్ : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కిసాన్ ఆందోళన్ ర్యాలీని తప్పుబాట పట్టించాలని బీజేపీ భావిస్తోందని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ పేర్కొన్నారు. మాంద్‌సోర్‌లో రైతులపై గత ఏడాది జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. రైతులు మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా జూన్ ఆరవ తేదీన మాంద్‌సోర్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని చేపట్టనుందని ప్రకటించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్‌పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరై అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని కమల్‌నాథ్ తెలిపారు. కిసాన్ ర్యాలీని నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తే ర్యాలీపై బీజేపీకి ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించి తీరుతుందని కమల్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. శివరాజ్‌సింగ్ ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, మద్దతు ధరకోసం ఆందోళన చేసిన మాంద్సోర్ రైతులను కాల్చిచంపారని సీఎంపై ధ్వజమెత్తారు. -
కలెక్టర్‌కు చుక్కలు.. తరిమి కొట్టిన జనం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోవడంతో అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన సీనియర్ కలెక్టర్‌పై అప్పటికే ఆందోళనలో ఉన్న 100మందికి పైగా రైతులు దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. కొంతమంది చేయి కూడా చేసుకున్నారు. అనంతరం ఆయన్ను పరుగెత్తించడంతో పోలీసులు సహాయంతో ఆయన బయటపడ్డారు. మాందసౌర్‌లో గత వారం రోజులుగా తమ దైనందిన పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తూ నిరసన ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు మంగళవారం రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళన చేశారు. రహదారులు బ్లాక్ చేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు వచ్చిన సీఆర్పీఎఫ్ బలగాలు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు రైతులు చనిపోయారు. దీంతో బుధవారం రైతులకు సానుభూతిగా బంద్ ప్రకటించారు. ఈక్రమంలోనే నిరసనలు జరుగుతున్న ప్రాంతానికి జిల్లా కలెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ రాగా ఆయనపై రైతులు తీవ్ర ఆగ్రహంతో తరిమికొట్టారు. ప్రస్తుతం అక్కడి పరిస్తితిపై ప్రధాని నరేంద్రమోదీ కూడా సంబంధిత అధికారులతో చర్చించారు. కాగా, రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాత్రం ఆందోళనకారుల్లో సామాజిక వ్యతిరేక శక్తులు చేరాయంటూ ఆరోపించారు.