కలెక్టర్‌కు చుక్కలు.. తరిమి కొట్టిన జనం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోవడంతో అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన సీనియర్ కలెక్టర్‌పై అప్పటికే ఆందోళనలో ఉన్న 100మందికి పైగా రైతులు దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. కొంతమంది చేయి కూడా చేసుకున్నారు. అనంతరం ఆయన్ను పరుగెత్తించడంతో పోలీసులు సహాయంతో ఆయన బయటపడ్డారు. మాందసౌర్‌లో గత వారం రోజులుగా తమ దైనందిన పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తూ నిరసన ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు మంగళవారం రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళన చేశారు. రహదారులు బ్లాక్ చేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు వచ్చిన సీఆర్‌పీఎఫ్ బలగాలు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు రైతులు చనిపోయారు. దీంతో బుధవారం రైతులకు సానుభూతిగా బంద్ ప్రకటించారు. ఈక్రమంలోనే నిరసనలు జరుగుతున్న ప్రాంతానికి జిల్లా కలెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ రాగా ఆయనపై రైతులు తీవ్ర ఆగ్రహంతో తరిమికొట్టారు. ప్రస్తుతం అక్కడి పరిస్తితిపై ప్రధాని నరేంద్రమోదీ కూడా సంబంధిత అధికారులతో చర్చించారు. కాగా, రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాత్రం ఆందోళనకారుల్లో సామాజిక వ్యతిరేక శక్తులు చేరాయంటూ ఆరోపించారు.