కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా... | Farmers And Workers Protests At New Delhi | Sakshi
Sakshi News home page

ఏకతాటిపై కార్మికులు, కర్షకులు...!

Published Wed, Sep 5 2018 10:50 PM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

Farmers And Workers Protests At New Delhi - Sakshi

అటు వ్యవసాయరంగంలోని రైతులు, వ్యవసాయకార్మికులు, ఇటు పారిశ్రామికరంగంలోని ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న శ్రామికులు దేశం నలుమూలల నుంచి కదిలారు. శ్రమశక్తినే నమ్ముకున్న ఈ శ్రామికవర్గం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా తమ మౌలికసమస్యల పరిష్కారానికి గళమెత్తారు. కార్మికులు, కర్షకులు భుజం, భుజం కలిపి ఏకతాటిపై నడిచారు. అంగన్‌వాడి, ఆశావర్కర్లు, ఇలా వివిధరంగాలకు చెందిన కార్మిక,కర్షకలోకం వెంట నడిచింది. బుధవారం ఢిల్లీ నడివీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. చలోపార్లమెంట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొత్తం 23 రాష్ట్రాల నుంచి రైతులు, కార్మికులు ఢిల్లీకి చేరుకున్నారు.  

వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకున్న వారందరికీ రామ్‌లీలా మైదానంలోనే టెంట్లు, ఇతరత్రా ఏర్పాట్లతో  తాత్కాలికంగా బస ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావించారు. అయితే గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో అక్కడి నేలంతా బురదమయమై చిత్తడిగా మారింది. ఈ ఇబ్బందులను కూడా లెక్కచేయకుండా చాలా మంది రైతులు, కార్మికులు అక్కడే ఎలాగోలా సర్దుకున్నారు. మిగతావారిని గురుద్వారాలు, సాహిబాబాద్‌లోని క్యాంపులు, విడిదికేంద్రాలకు వాలంటీర్లు తరలించారు. 

దేశం నలుమూలల నుంచి ఢిల్లీకి వచ్చిన పలువురు శ్రామికులు, కర్షకులు అనారోగ్యం బారిన కూడా పడ్డారు. జ్వరం, జలుబు, డయేరియా వంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి ఢిల్లీ ప్రభుత్వ సంచార ఆరోగ్యపథకం పరిధిలోని నలుగురు డాక్టర్ల బృందం సపర్యలు చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 699 మందికి ట్రీట్‌మెంట్‌ ఇచ్చినట్టు ఈ బృందంలోని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వినీత్‌కుమార్‌ సాహు తెలిపారు. 

  • గత మార్చినెలలో నాసిక్‌ నుంచి ముంబై వరకు నిర్వహించిన రైతుల ‘మహాపాదయాత్ర’లో పాల్గొన్న వారిలో 5 వేల మంది ఈ ర్యాలీలోనూ పాల్గొన్నారు.
  • స్థానికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించి మరో బృందం మణిపూర్‌ నుంచి పయనమైంది.
  • మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ నుంచి ఓ రైతుల బృందం దేశ రాజధానికి వచ్చి చేరింది. 
  • బిహార్‌ నుంచి వచ్చిన  మహిళా రైతులు, కార్మికుల బృందం తమ జానపద నృత్యాల ద్వారా  ఢిల్లీ నిరసనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 
  • తెలంగాణలోని ఆదిలాబాద్, తదితర ప్రాంతాల నుంచి అంగన్‌వాడి స్కూల్‌ టీచర్లుగా, వర్కర్లుగా పనిచే స్తున్న మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
  • సీపీఎం అనుబంధ సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సీఐటీయూ), అఖిల భారత కిసాన్‌ సభ, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. 

డిమాండ్లు...
స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలో భాగంగా రైతులకు గిట్టుబాటుధరలు, సకాలంలో రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, ధరల పెరుగుదల నియంత్రించి, ప్రజాపంపిణీ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు, ఉపాధి కల్పనకు గట్టి చర్యలు తీసుకోవాలి.
రైతుల పంటరుణాల మాఫీ, కార్మికచట్టాల సక్రమ అమలు, నెలకు కనీస వేతనంగా రూ. 18 వేలు, మరిన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, దేశవ్యాప్తంగా కోటి మంది అంగన్‌వాడి వర్కర్లు, అక్రిడేటెడ్‌ సోషల్‌ హెఃల్త్‌ యాక్టివిస్ట్‌లను కార్మికులుగా ప్రభుత్వ గుర్తింపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement