న్యూఢిల్లీ: ధరల పెంపు అంశం పార్లమెంట్‌ని కుదిపేసింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలపై వరుసగా రెండోరోజూ పార్లమెంట్ దద్దరిల్లింది. విపక్షాల నిరసనలతో ఉభయసభలు అట్టుడికాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
ఆందోళనల మధ్యే స్పీకర్ ఓంబిర్లా క్వశ్చన్ అవర్ నిర్వహించారు. అయినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గలేదు. వెల్‌లో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలతో గందరగోళం సృష్టించారు. దీంతో లోక్‌సభను కాసేపు వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా.
అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే షాహిద్ దివస్ సందర్భంగా భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం విపక్ష ఎంపీలు ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఛైర్మన్ వారించినా వారు వెనక్కి తగ్గకపోవడంతో సభ మధ్యాహ్నానికి వాయిదాపడింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపంసంహరించుకోవాలి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మార్గాని భరత్ లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. క్యాపిటివ్ మైన్స్ కేటాయించి ప్లాంట్‌ను పరిరక్షించాలని కోరారు. క్వశ్చన్ అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికి బదులిచ్చిన కేంద్ర ఉక్కుమంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్.. స్టీల్‌ప్లాంట్ నష్టాలకు సొంత గనులు లేకపోవడం కారణం కాదన్నారు. ప్రైవేటీకరణతో ప్లాంట్‌తోపాటు ఆ ప్రాంతం, ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment