మధ్యప్రదేశ్‌లో చౌహాన్‌ ఏలుబడి | Editorial About Chouhan Won Confidence Motion In Madhya Pradesh Assembly | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో చౌహాన్‌ ఏలుబడి

Published Thu, Mar 26 2020 12:13 AM | Last Updated on Thu, Mar 26 2020 12:15 AM

Editorial About Chouhan Won Confidence Motion In Madhya Pradesh Assembly - Sakshi

కరోనా వైరస్‌పై దేశమంతా పోరాడుతున్న వేళ మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ నేతృత్వాన ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని గెలుచుకుంది. తన పక్షానికి చెందిన 22మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన కారణంగా అర్ధాంతరంగా అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ ఈ సమావేశాన్ని బహిష్కరించడంతో తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా కలవరం గణనీయంగానే వుంది. చౌహాన్‌ ప్రమాణస్వీకారానికి ఈ కారణంగానే ఢిల్లీ పెద్దలెవరూ హాజరుకాలేదు. బీజేపీ పరిశీలకులు అరుణ్‌సింగ్, వినయ్‌ సహస్రబుధేలిద్దరూ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇంతవరకూ 15 కరోనా కేసులు బయటపడగా, ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.

ఎమ్మెల్యేల ఫిరాయింపు కారణంగా సీఎం పదవి నుంచి తప్పుకున్న కమల్‌నాథ్‌ ఈ నెల 20న మీడియా సమావేశం పెట్టినప్పుడు దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరుకాగా, ఆ తర్వాత వారిలో ఒకరు కరోనా వ్యాధిగ్రస్తుడిగా తేలారు. వారంతా ఇప్పుడు వైద్య పర్యవేక్షణలో ఉంటున్నారు. వేరే రాష్ట్రాల తరహాలోనే మధ్యప్రదేశ్‌ కూడా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుందో దీన్నిబట్టి అర్ధమవుతుంది. కానీ అధికారం కోసం నువ్వా నేనా అన్నట్టు పోరాడుతున్న పార్టీలకు ఇవి పట్టలేదు. అధికారాన్ని ఎలాగైనా నిలుపుకుందామని కాంగ్రెస్, ఆ పార్టీని సాధ్యమైనంత త్వరగా సాగనంపాలని బీజేపీ పోటాపోటీగా పనిచేశాయి. కరోనా సమస్యపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయంలో  రాజకీయ సంక్షోభం ఏర్పడటం అందరినీ కలవరపెట్టింది. క్లిష్ట సమయంలో అధికార యంత్రాంగానికి మార్గదర్శకత్వంవహించి, వారిని సరైన దిశగా కదల్చాల్సిన రాజకీయ నాయకత్వం ఇలా అధికార కుమ్ములాటల్లో పడటం మంచిది కాదని అందరూ భావించారు. ఏమైతేనేం...ఇదంతా త్వరగానే సద్దుమణిగిందనుకోవాలి. 

అయితే శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సగటు రాజకీయ నాయకుల్లాంటివారు కాదు. ఆయన సచ్చీలుడని, ఉన్నత విలువలు పాటించేవారని అందరికీ విశ్వాసం వుంది. ఆయన్ను మెతక స్వభావి, వివాదరహితుడు అని కూడా అంటారు. చౌహాన్‌ మూడు దఫాల ఏలుబడిలో మధ్యప్రదేశ్‌ రూపురేఖలు మారాయని, ఆయనందించిన సమర్ధవంతమైన పాలనే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ‘వ్యాపమ్‌’ కుంభకోణం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినా, అందులో చౌహాన్‌ ప్రమేయం వున్నట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఆ కుంభకోణంలో దోషులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయడంలో ఆయన మరింత పకడ్బందీగా వ్యవహరించి వుండాల్సిందన్న విమర్శలైతే వున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఆయన అందించిన పాలనే ఆ రాష్ట్రంలో బీజేపీకి వరస విజయాలు సాధించిపెట్టింది.

2018 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కూ, బీజేపీకి మధ్య అయిదారు స్థానాల వ్యత్యాసమే వుంది. తల్చుకుంటే అప్పుడే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేది. కానీ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అలాంటి రాజకీయ ఎత్తుగడలకు తావివ్వలేదు. ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోమని ఆదేశించారు గనుక ఆ తీర్పును  శిరసావహిస్తామని అప్పట్లో ఆయన ప్రకటించారు. దీన్నందరూ ప్రశంసించారు.  వేరే రాష్ట్రాల్లో తగినంత మెజారిటీ రాని స్థితిలో సైతం రాజకీయ చాణక్యంతో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి సిద్ధపడే బీజేపీ కేవలం ఆయన నిర్ణయం కారణంగానే మధ్యప్రదేశ్‌లో ఆ మార్గాన్ని అనుసరించలేదు. కానీ 14 నెలలు గడిచేసరికి పరిస్థితి మారిపోయింది. చౌహాన్‌ తన వైఖరిని మార్చుకున్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి.

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ తన అంతర్గత వ్యవహారాలను సకాలంలో చక్కదిద్దుకుని వుంటే బీజేపీ కొత్త ఎత్తుగడ ఫలించేది కాదు. వేరే రాష్ట్రాల తరహాలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సొంతంగా బీజేపీ వైపు వెళ్లే సాహసం చేయలేదు. ఎందుకంటే గెలిచినవారంతా దాదాపు మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, మరో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్, మొన్నీమధ్య బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా శిబిరాల్లో వున్నారు. ఆ నేతలు కనుసైగ చేస్తే తప్ప వీరెవరూ ఫిరాయించే రకం కాదు. కనుకనే ఈ సంక్షోభానికి ముందు ఎనిమిదిమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గురుగ్రామ్‌ వెళ్లి ఓ హోటల్‌లో బసచేసి పార్టీపై అసంతృప్తి ప్రకటించినప్పుడు దాన్ని చల్లార్చడంలో దిగ్విజయ్‌ సింగ్‌ విజయం సాధించారు. ఆ ఎమ్మెల్యేల తిరుగుబాటులో జ్యోతిరాదిత్య ప్రమేయం వున్నదన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత 22 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్ట్‌కు వెళ్లి కాంగ్రెస్‌ నుంచి తప్పుకున్నారు. ఆ రెండు ఉదంతాలతోనూ తమకు సంబంధం లేదని, అవి కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటల కారణంగా జరుగుతున్నవేనని బీజేపీ ప్రకటించింది. జ్యోతిరాదిత్యను కాంగ్రెస్‌ అధిష్టానం సకాలంలో బుజ్జగించివుంటే గురుగ్రామ్‌ ఉదంతం తరహాలోనే ఆ 22మంది కూడా వెనక్కు వచ్చేవారేమో! కానీ అది జరగలేదు. దింపుడు కళ్లం ఆశలా దిగ్విజయ్‌ తదితరులు బెంగళూరు వెళ్లి భంగపడ్డారు. వారంతా జ్యోతిరాదిత్య వర్గం కావడమే ఇందుకు కారణం.  

అయితే చౌహాన్‌ అసలు బలనిరూపణ ముందుంది. ఈ కరోనా సంక్షోభం సమసిపోయాక మొత్తం 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సివుంది. అందులో విజయం సాధించడంపైనే ఆయన రాజకీయ భవితవ్యం ఆధారపడివుంది. ప్రస్తుతం 230మంది సభ్యుల అసెంబ్లీలో రాజీనామాలు చేసిన వారిని మినహాయిస్తే 206మంది మాత్రమే వున్నారు. కనుక ప్రభుత్వం ఏర్పర్చడానికి కావలసిన బలం 104 మాత్రమే. సభలో బీజేపీకి ప్రస్తుతం 107మంది సభ్యులుండగా, 22మంది రాజీనామాలతో కాంగ్రెస్‌ బలం 92కి పడిపోయింది. జరగబోయే ఉప ఎన్నికల నాటికైనా కాంగ్రెస్‌ జవసత్వాలు పుంజుకుని తన సత్తా చాటుకుంటుందా లేక ఈ ఒరవడిలోనే కొట్టుకుపోతుందా అన్నది చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement