కొన్ని ఉదంతాలు మనల్ని విషాదంలో ముంచెత్తుతాయి. మనం మనుషులుగానే మనుగడ సాగిస్తు న్నామా, సమాజం ఇంత అమానుషంగా మారిందా అనే ఆందోళన కలిగిస్తాయి. మధ్యప్రదేశ్‌లో ప్రవేశ్ శుక్లా అనే దుండగుడు ఆదివాసీపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం అటువంటిదే. అసలు ఊహకు కూడా అందని రీతిలో శుక్లా ఇలా రెచ్చిపోవడానికి కారణమేమిటి? మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉదంతం విషయంలో చకచకా కదిలింది. వెనువెంటనే ఆ దుండగుడిని కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద నిర్బంధించింది.
అతను నివాసం ఉంటున్న ఇంటిని కూల్చేసింది. ఆదివాసీకి రూ. 6.5 ల„ý లు పరిహారంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు...ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుణ్ణి తన నివాసానికి పిలిపించుకొని అతని కాళ్లు కడిగి తలపై జల్లు కున్నారు. దుండగుడు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడంవల్ల తమపై ఆ మచ్చ పడుతుందన్న భయంతో ప్రభుత్వం వేగంగా కదిలివుండొచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఉదంతంపై ఇంకా నిరసలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి.
ఏదైనా ఉదంతం చోటుచేసుకున్నప్పుడు ప్రభుత్వాలు తక్షణం స్పందించటం, కారకులపై కఠినమైన చర్యలు తీసుకోవటం, బాధితులకు రక్షణ కల్పించటం సాధారణ ప్రజలకు భరోసానిస్తుంది. అయితే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ప్రవేశ్ శుక్లా వంటి దుండగులు ఈ సమాజంలో నాగరిక వేషంలో ఎలా మనుగడ సాగించగలుగుతున్నారు? రాజకీయ పార్టీల్లోకి ఎలా చొరబడగలుగుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషించకపోతే ఇవి పదే పదే పునరావృతమవుతూనే ఉంటాయి.
దళితులనూ, ఆదివాసీలనూ, అట్టడుగు కులాల వారినీ అకారణంగా అవమానించటం, వారిని అత్యంత హీనంగా చూడటం మన దేశంలో కొత్తగాదు. తాజా ఉదంతం వీడియో సాక్షిగా బయటికొచ్చింది కనుక ఇంతగా స్పందన వచ్చింది. ప్రభుత్వం కూడా చురుగ్గా కదిలింది. కానీ చట్టానికి దొరక్కుండా, సాక్ష్యాలకు చిక్కకుండా నిత్యం సాగుతున్న దుండగాల మాటేమిటి?
ఈ ఉదంతంపై నిరసనల హోరు ప్రారంభమైన రోజే సర్వోన్నత న్యాయస్థానం విశ్వవిద్యాలయాల పర్యవేక్షణను చూస్తున్న యూజీసీకి కీలకమైన ఆదేశాలిచ్చింది. ఉన్నత విద్యాలయాల్లో వివక్షకు తావులేకుండా చేయటానికి ఇంతవరకూ తీసుకున్న, తీసుకోబోతున్న చర్యలేమిటో చెప్పా లని కోరింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తూ వివక్షకు బలై ప్రాణం తీసుకున్న రోహిత్ వేముల తల్లి, ముంబైలో వైద్య విద్యలో పీజీ చేస్తూ తోటి విద్యార్థినుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఆదివాసీ యువతి పాయల్ తాడ్వి తల్లి దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.
వారి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ గత ఏడాది కాలంలో మూడు ఉన్నత శ్రేణి సంస్థల్లో ముగ్గురు విద్యార్థులు కులోన్మాదుల హింస భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వైనాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వి ఉదంతాలప్పుడు విద్యాసంస్థల నిర్వాహకులు తమ సంస్థల్లో వివక్ష లేనేలేదని బుకాయించారు. వారికి వత్తాసు పలికిన విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. సరిగ్గా గ్రామ స్థాయి నుంచి ఉన్నత శ్రేణి విద్యాసంస్థల వరకూ నిత్యం వినబడే ఇలాంటి బుకాయింపులే మన సమాజంలో ఆధిపత్య కులాల హింసకు లైసెన్సునిస్తున్నాయి.
గ్రామాల్లో ఇప్పటికీ యధేచ్ఛగా కొనసాగుతూనే ఉన్న రెండు గ్లాసుల వ్యవస్థ, మహానగరాలనుకునేచోట అపార్ట్‌మెంట్లలో పనివాళ్ల పట్ల చూపే వివక్ష... అట్టడుగు కులాలవారికీ, మైనారిటీలకూ ఇళ్లు అద్దెకు దొరక్క పోవటం వంటివి ఈ హింసను అడుగడుగునా చాటుతూనే ఉన్నాయి. వాటిని సరిచేయటానికి పూనుకోవాల్సిన వ్యవస్థలు చాలా సందర్భాల్లో రాజీపడుతున్నాయి. పైకి ఎంతో గౌరవప్రదంగా కనబడే వ్యక్తులే ఈ వివక్షకు బాధ్యులవుతుండటం చేదు నిజం. ఎంతో గొడవ జరిగి, పెను వివాదమైతే తప్ప చర్యలకు సిద్ధపడటం లేదు.
అసలు పట్టించుకోకపోవటం వేరు...అతిగా పట్టించుకోవటం వేరు. పర్వేశ్ శుక్లాను కఠినమైన చట్టంకింద అరెస్టు చేశారు. మంచిదే. ఆదివాసీ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిపై జల్లుకున్నారు. పాలకుడిగా మానసిక వేదనకు లోనయి ఈ పని చేశారని సరిపెట్టుకోవచ్చు. కానీ దుండగుడి నివాసం కూల్చేయటం ఎలాంటి చర్య? తప్పు చేసిన ఏ వ్యక్తయినా చట్టం ముందు సమానమేనని, వారిపై కఠిన చర్య తీసుకుంటామని సందేశం పంప డానికి బదులు, తాము ఏం చేస్తే అదే చట్టమనే ధోరణి ప్రదర్శించటం ఎలాంటి సంకేతాలిస్తుంది? శివరాజ్ సింగ్ చౌహాన్ ఆలోచించాలి.
అట్టడుగు కులాలవారిపై ఆధిపత్య కులాల హింసను అంతమొందించటంలో, మహిళలపై నిత్యం సాగే అమానుషత్వాన్ని అరికట్టడంలో మన సమాజం పదే పదే విఫలమవుతున్న తీరు ఆందోళన కలిగించే అంశం. 2002లో గుజరాత్ అగ్నిగుండమైనప్పుడు బిల్కిస్ బానో అనే మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యావజ్జీవ శిక్ష పడిన 11మంది నేరస్తులను నిరుడు విడుదల చేయటం, దీనికి వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నా ఇంకా అతీ గతీ లేకపోవటం అందరూ గమని స్తూనే ఉన్నారు.
అటువంటప్పుడు మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఆఖరులో ఎన్నికలు వస్తున్నందువల్లే శివరాజ్ సింగ్ సర్కారు వేగంగా స్పందించిందన్న విపక్షాల విమర్శలను కొట్టిపారేయగలమా? ఏదేమైనా చట్ట ప్రకారం వ్యవహరించటంలోనే, సంయమనం పాటించటంలోనే ప్రభుత్వాల సమర్థత వెల్లడవుతుంది. అది ప్రజాస్వామిక సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment