
నర్సింగాపూర్: మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ పాలనలో 50 శాతం కమీషన్ల రాజ్యం నడుస్తోందంటూ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఆరోపించారు. చౌహాన్ అవినీతి పాలన రాష్ట్ర భవిష్యత్తును అంధకారమయం చేసిందన్నారు. బుధవారం నర్సింగాపూర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలో యువత, రైతులు, అన్ని సామాజిక వర్గాల భవిష్యత్తును బీజేపీ పాలన సర్వనాశనం చేసిందన్నారు. కేవలం బీజేపీ నేతలు, అధికార పెద్దలు మాత్రమే అభివృద్ధి చెందారని ఆరోపించారు. 18 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి వ్యవస్థ వంటివన్నీ పూర్తిగా పట్టాలు తప్పాయన్నారు. అబద్ధపు పథకాలను ప్రకటించనిదే చౌహాన్‌కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు.