confidence motion
-
హ్యాండ్ ఇచ్చిన ఆర్మీ.. ఇమ్రాన్ ఖాన్ ఆశలు గల్లంతు
Pakistan Political Turmoil: నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హడావిడిగా శనివారం అంతా పాక్ కీలక విభాగాలతో భేటీ అయ్యాడు. ఇందులో భాగంగా.. ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బజ్వా జరిగిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి వస్తే.. సాయం చేయాలని ఇమ్రాన్ ఖాన్ కోరగా, అందుకు పాక్ ఆర్మీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ భేటీలో ఆర్మీ చీఫ్, ఇమ్రాన్ ఖాన్‌కు రాజీనామా సలహానే ఇచ్చినట్లు తెలుస్తోంది. అవిశ్వాసంలో గనుక ఓడితే.. ఈ నెలాఖరులో జరిగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇది ఇస్లామిక్ కో ఆపరేషన్ (OIC) తర్వాత పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్‌తో.. ఆర్మీ ఛీప్ ఖనార్ జావెద్ బజ్వా చెప్పినట్లు సమాచారం. ఈ భేటీలో బజ్వాతో పాటు ముగ్గురు సీనియర్ లెఫ్టినెంట్ జనరల్స్, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) డీజీ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అంతేకాదు బజ్వాతో పాటు మిగిలిన మిలిటరీ అధికారులు కూడా ఇమ్రాన్ ఖాన్‌తో గద్దె దిగిపోమనే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఖాన్‌కు దారులన్నీ మూసుకుపోయాయి. ప్రభుత్వం గనుక కూలిపోయే పరిస్థితి వస్తే సైన్యం సాయం తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ భావించాడు. అంతకు ముందు ఆర్మీ మాజీ ఛీఫ్ రహీల్ షరీఫ్.. బజ్వాతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఇమ్రాన్ ఖాన్ తరపున రాయబారం నడిపే ప్రయత్నం చేశాడు. కానీ, రహీల్ దౌత్యాన్ని సైతం పాక్ ఆర్మీ ఛీ కొట్టిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం దగ్గరపడిందనే సంకేతాలు అందాయి. అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కించాలంటూ ప్రధాని వారిని కోరినా తామేమీ చేయలేమంటూ వారు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో అవిశ్వాస తీర్మానంతో పాటు ఓఐసీ సమ్మిట్, బెలూచిస్థాన్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఇక ఈ భేటీపై పీటీఐ నేతలు గంపెడు ఆశలు పెట్టుకోగా.. ఫలితం ఇలా రివర్స్ రావడంతో అసంతృప్తిలో కూరుకుపోయారని క్యాపిట్ టీవీ కథనం ప్రసారం చేసింది. మొదటి నుంచి పాక్ ప్రభుత్వాన్ని నియంత్రించే పనిలో ఆర్మీ ఉంటోంది. ప్రతిపక్ష నేతలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆర్మీ ఛీఫ్ బజ్వా మొదటి నుంచి పీటీఐ నేతలకు చెబుతున్నా.. స్వయంగా ఇమ్రాన్ ఖానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడం విశేషం. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో సతమతమవుతున్న దేశం.. ఇప్పుడీ రాజకీయ సంక్షోభంతో మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆర్మీ. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా, యూరోపియన్ యూనియన్ పై అనవసర వ్యాఖ్యలు చేశారంటూ ఇమ్రాన్ పై ఆర్మీ గుర్రుగా ఉంది. ఇప్పటికే సొంత పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ కే చెందిన 24 మంది నేతలు.. ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ దిగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. చదవండి: సొంత పార్టీలోనే తిరుగుబాటు.. ఎందుకు? -
పాక్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
ఇస్లామాబాద్: దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించలేకపోయిందంటూ పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మంగళవారం అసమ్మతి తీర్మానం ప్రవేశపెట్టాయి. పీఎంఎల్– నవాజ్, పీపీపీ పార్టీలకు చెందిన 100మంది సభ్యులు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. ఈ తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్‌కు సమర్పించినట్లు పీఎంఎల్ఎన్ ప్రతినిధి ఔరంగజేబు తెలిపారు. పాక్ ప్రజల కోసమే ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ అధినేత షెబాజ్ షరీఫ్ చెప్పారు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత తమలో ఎవరు పదవిని అధిరోహించాలనే విషయంపై చర్చలు జరుపుతామన్నారు. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానానికి కనీసం 68 మంది మద్దతుండాలి. సరిపడ సభ్యుల మద్దతులో లేఖ అందితే 3– 7 రోజుల్లో స్పీకర్ సభను సమావేశపరిచి తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం సభలో సభ్యుల సంఖ్య 342 కాగా, తీర్మానం నెగ్గేందుకు 172మంది సభ్యుల మద్దతు అవసరం. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇమ్రాన్ సొంత పార్టీ టీఐఐకి 155మంది సభ్యులుండగా మరో ఆరు చిన్నపార్టీలు, ఒక స్వతంత్రుడు మద్దతిస్తున్నారు. ప్రతిపక్షాలన్నింటికీ కలిపి 163 మంది సభ్యులున్నారు. అధికార కూటమి నుంచి 28మందికి పైగా సభ్యులు తమకు మద్దతిస్తారని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ఇమ్రాన్‌కు పాక్ ఆర్మీ మద్దతున్న నేపథ్యంలో తీర్మానం నెగ్గడం అంత సులభం కాదని నిపుణుల అంచనా. పాక్‌లో ఆర్మీ ప్రభావం ప్రభుత్వాలపై అధికం. తన ప్రభుత్వం పడిపోదని తాజాగా ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: మా దేశం ఇక నాటో సభ్యత్వం గురించి ఆశించదు) -
‘సారీ..’ చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్! ఆపై సంచలన వ్యాఖ్యలు
ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాక్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులన్నీంటిని అమ్మేసుకుని.. అగ్గువకు ప్రైవేట్ వనరులను ఆశ్రయిస్తోంది అక్కడి ప్రభుత్వం. చివరకు.. అగ్రదేశాల నుంచి అప్పులు కూడా పుట్టని స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ను అభివృద్ధి చేయడంలో తమ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంగీకరించాడు. ప్రభుత్వానికి, దేశ ప్రయోజనాలకు మధ్య ఎలాంటి సంబంధం లేకపోవడమే అతిపెద్ద సమస్యగా పేర్కొన్నాడు ఇమ్రాన్ ఖాన్. ‘‘అధికారంలోకి రావడానికి ముందు దేశంలో మార్పు తీసుకొస్తామని వాగ్దానం చేశా. కానీ, చెప్పినట్లు ‘మార్పు’ తీసుకురాలేకపోయాం. దీనికి దేశ ప్రజలు క్షమించాలి. అందుకు కారణం వ్యవస్థలోని లోపాలే. పుంజుకునేందుకు ప్రయత్నిస్తాం’’ అంటూ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను డాన్ న్యూస్‌పేపర్ యధాతధంగా ప్రచురించింది. అధికారంలోకి రాగానే.. మేము విప్లవాత్మక చర్యల ద్వారా వెంటనే మార్పు తేవాలనుకున్నాం. కానీ, మా వ్యవస్థ అప్పటికే దిగజారిన వ్యవస్థను సంగ్రహించలేకపోయింది. ప్రభుత్వం.. అందులోని మంత్రులం ఎవరం లక్ష్యాన్ని సాధించలేకపోయాం అని ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, దేశ ప్రయోజనాల మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య అని వ్యాఖ్యానించాడు ఇమ్రాన్ ఖాన్. ఎగుమతులు, పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం.. ఈ మూడు విషయాలపైనే దృష్టిసారించినప్పటికీ.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నాలు మొదలుపెట్టగా.. ఇలాంటి పరిస్థితిని తామూ ముందుగానే ఊహించానని, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించాడు ఇమ్రాన్ ఖాన్. మిత్రపక్షాలు సైతం.. ఇదిలా ఉండగా.. పాక్ స్థితిని దిగజార్చిన ఇమ్రాన్ ఖాన్ సర్కార్‌ను గద్దె దించే ప్రయత్నాలు మొదలయ్యాయి. చేతకానీ దద్దమ్మ, అంతర్జాతీయ బిచ్చగాడు అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు Imran Khanను ఏకీపడేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఇమ్రాన్ తాజా ప్రకటనను ఆధారంగా చేసుకుని ఏ క్షణంలోనైనా నేషనల్ అసెంబ్లీలో(పాక్ పార్లమెంట్) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పాకిస్థాన్ డెమోక్రటిక్ మూమెంట్ పార్టీ పాక్ పార్లమెంట్లో అధికార పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సఫ్ పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక గీస్తోంది. ఒకవైపు నిరసన ప్రదర్శనలతో పాటు ఒకేసారి నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఝలక్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం పీపీపీ, పీఎంఎల్ ఎన్తో పాటు ఇమ్రాన్ జట్టు పార్టీలైన ఎంక్యూఎం, పీఎంఎల్ క్యూ సైతం ముందుకొస్తున్నాయి. మరోవైపు అధికార పక్షాన్ని వీడేందుకు పలువురు నేతలు సైతం సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ప్రతిపక్షాలకు తన మిత్ర పక్షాలు, సొంత పీటీఐ పార్టీ నేతలు తోడు కావడంతో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చదవండి: వాడుకొని వదిలేయడం ఆ దేశానికి అలవాటే: పాక్ పీఎం కామెంట్లు -
మధ్యప్రదేశ్‌లో చౌహాన్ ఏలుబడి
కరోనా వైరస్‌పై దేశమంతా పోరాడుతున్న వేళ మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌చౌహాన్ నేతృత్వాన ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని గెలుచుకుంది. తన పక్షానికి చెందిన 22మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన కారణంగా అర్ధాంతరంగా అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించడంతో తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా కలవరం గణనీయంగానే వుంది. చౌహాన్ ప్రమాణస్వీకారానికి ఈ కారణంగానే ఢిల్లీ పెద్దలెవరూ హాజరుకాలేదు. బీజేపీ పరిశీలకులు అరుణ్‌సింగ్, వినయ్ సహస్రబుధేలిద్దరూ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇంతవరకూ 15 కరోనా కేసులు బయటపడగా, ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కారణంగా సీఎం పదవి నుంచి తప్పుకున్న కమల్‌నాథ్ ఈ నెల 20న మీడియా సమావేశం పెట్టినప్పుడు దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరుకాగా, ఆ తర్వాత వారిలో ఒకరు కరోనా వ్యాధిగ్రస్తుడిగా తేలారు. వారంతా ఇప్పుడు వైద్య పర్యవేక్షణలో ఉంటున్నారు. వేరే రాష్ట్రాల తరహాలోనే మధ్యప్రదేశ్ కూడా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుందో దీన్నిబట్టి అర్ధమవుతుంది. కానీ అధికారం కోసం నువ్వా నేనా అన్నట్టు పోరాడుతున్న పార్టీలకు ఇవి పట్టలేదు. అధికారాన్ని ఎలాగైనా నిలుపుకుందామని కాంగ్రెస్, ఆ పార్టీని సాధ్యమైనంత త్వరగా సాగనంపాలని బీజేపీ పోటాపోటీగా పనిచేశాయి. కరోనా సమస్యపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయంలో రాజకీయ సంక్షోభం ఏర్పడటం అందరినీ కలవరపెట్టింది. క్లిష్ట సమయంలో అధికార యంత్రాంగానికి మార్గదర్శకత్వంవహించి, వారిని సరైన దిశగా కదల్చాల్సిన రాజకీయ నాయకత్వం ఇలా అధికార కుమ్ములాటల్లో పడటం మంచిది కాదని అందరూ భావించారు. ఏమైతేనేం...ఇదంతా త్వరగానే సద్దుమణిగిందనుకోవాలి. అయితే శివరాజ్‌సింగ్ చౌహాన్ సగటు రాజకీయ నాయకుల్లాంటివారు కాదు. ఆయన సచ్చీలుడని, ఉన్నత విలువలు పాటించేవారని అందరికీ విశ్వాసం వుంది. ఆయన్ను మెతక స్వభావి, వివాదరహితుడు అని కూడా అంటారు. చౌహాన్ మూడు దఫాల ఏలుబడిలో మధ్యప్రదేశ్ రూపురేఖలు మారాయని, ఆయనందించిన సమర్ధవంతమైన పాలనే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ‘వ్యాపమ్’ కుంభకోణం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినా, అందులో చౌహాన్ ప్రమేయం వున్నట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఆ కుంభకోణంలో దోషులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయడంలో ఆయన మరింత పకడ్బందీగా వ్యవహరించి వుండాల్సిందన్న విమర్శలైతే వున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఆయన అందించిన పాలనే ఆ రాష్ట్రంలో బీజేపీకి వరస విజయాలు సాధించిపెట్టింది. 2018 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కూ, బీజేపీకి మధ్య అయిదారు స్థానాల వ్యత్యాసమే వుంది. తల్చుకుంటే అప్పుడే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేది. కానీ శివరాజ్‌సింగ్ చౌహాన్ అలాంటి రాజకీయ ఎత్తుగడలకు తావివ్వలేదు. ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోమని ఆదేశించారు గనుక ఆ తీర్పును శిరసావహిస్తామని అప్పట్లో ఆయన ప్రకటించారు. దీన్నందరూ ప్రశంసించారు. వేరే రాష్ట్రాల్లో తగినంత మెజారిటీ రాని స్థితిలో సైతం రాజకీయ చాణక్యంతో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి సిద్ధపడే బీజేపీ కేవలం ఆయన నిర్ణయం కారణంగానే మధ్యప్రదేశ్‌లో ఆ మార్గాన్ని అనుసరించలేదు. కానీ 14 నెలలు గడిచేసరికి పరిస్థితి మారిపోయింది. చౌహాన్ తన వైఖరిని మార్చుకున్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తన అంతర్గత వ్యవహారాలను సకాలంలో చక్కదిద్దుకుని వుంటే బీజేపీ కొత్త ఎత్తుగడ ఫలించేది కాదు. వేరే రాష్ట్రాల తరహాలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంతంగా బీజేపీ వైపు వెళ్లే సాహసం చేయలేదు. ఎందుకంటే గెలిచినవారంతా దాదాపు మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, మరో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మొన్నీమధ్య బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా శిబిరాల్లో వున్నారు. ఆ నేతలు కనుసైగ చేస్తే తప్ప వీరెవరూ ఫిరాయించే రకం కాదు. కనుకనే ఈ సంక్షోభానికి ముందు ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురుగ్రామ్ వెళ్లి ఓ హోటల్లో బసచేసి పార్టీపై అసంతృప్తి ప్రకటించినప్పుడు దాన్ని చల్లార్చడంలో దిగ్విజయ్ సింగ్ విజయం సాధించారు. ఆ ఎమ్మెల్యేల తిరుగుబాటులో జ్యోతిరాదిత్య ప్రమేయం వున్నదన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత 22 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్ట్‌కు వెళ్లి కాంగ్రెస్ నుంచి తప్పుకున్నారు. ఆ రెండు ఉదంతాలతోనూ తమకు సంబంధం లేదని, అవి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల కారణంగా జరుగుతున్నవేనని బీజేపీ ప్రకటించింది. జ్యోతిరాదిత్యను కాంగ్రెస్ అధిష్టానం సకాలంలో బుజ్జగించివుంటే గురుగ్రామ్ ఉదంతం తరహాలోనే ఆ 22మంది కూడా వెనక్కు వచ్చేవారేమో! కానీ అది జరగలేదు. దింపుడు కళ్లం ఆశలా దిగ్విజయ్ తదితరులు బెంగళూరు వెళ్లి భంగపడ్డారు. వారంతా జ్యోతిరాదిత్య వర్గం కావడమే ఇందుకు కారణం. అయితే చౌహాన్ అసలు బలనిరూపణ ముందుంది. ఈ కరోనా సంక్షోభం సమసిపోయాక మొత్తం 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సివుంది. అందులో విజయం సాధించడంపైనే ఆయన రాజకీయ భవితవ్యం ఆధారపడివుంది. ప్రస్తుతం 230మంది సభ్యుల అసెంబ్లీలో రాజీనామాలు చేసిన వారిని మినహాయిస్తే 206మంది మాత్రమే వున్నారు. కనుక ప్రభుత్వం ఏర్పర్చడానికి కావలసిన బలం 104 మాత్రమే. సభలో బీజేపీకి ప్రస్తుతం 107మంది సభ్యులుండగా, 22మంది రాజీనామాలతో కాంగ్రెస్ బలం 92కి పడిపోయింది. జరగబోయే ఉప ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ జవసత్వాలు పుంజుకుని తన సత్తా చాటుకుంటుందా లేక ఈ ఒరవడిలోనే కొట్టుకుపోతుందా అన్నది చూడాలి. -
గందరగోళంలో బ్రెగ్జిట్
బ్రెగ్జిట్ పీటముడి మరింత జటిలమైపోయింది. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం బ్రిటన్ అక్టోబర్ 31కల్లా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాల్సి ఉండగా.. ప్రధాని బోరిస్ జాన్సన్ కాస్తా పార్లమెంటును సస్పెండ్ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒప్పందంలో మార్పులు జరిగితే బ్రిటన్ వైదొలగేందుకు తనకు అభ్యంతరం లేదని బోరిస్ అంటూండగా.. విపక్షాలు తమకు అనుకూలమైన మార్పులు జరిగితేనే వీడాలని పట్టుపడుతున్నాయి. లేదంటే బ్రిటన్‌కు ఆర్థికంగా నష్టమని హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ అక్టోబర్ 31లోగా బ్రెగ్జిట్ సాధ్యమేనా? అధికార, విపక్షల ముందున్న అవకాశాలు ఏంటి? రహస్య పద్ధతితో సాధిస్తారా? మెరుగైన ఒప్పందం లేకుండా విడిపోవడంపై పార్లమెంటు సభ్యులు అత్యధికుల్లో అభ్యంతరాలున్నాయి. కానీ ఇది జరక్కుండా ఉండాలంటే పార్లమెంటు పనిచేయాల్సి ఉంటుంది. పార్లమెంటు సస్పెన్షన్‌లో ఉన్న నేపథ్యంలో పరిస్థితులు జటిలంగా మారినా.. ప్రతిపక్ష నేతలు జో స్విన్సన్ లాంటి వాళ్లు తమ గళాన్ని పెంచారు. ఇటీవలి బీబీసీ ఇంటర్వ్యూలో లిబరల్ డెమొక్రాట్స్ నేత అయిన జో స్విన్సన్ మాట్లాడుతూ తామూ బోరిస్ జాన్సన్ మాదిరిగా ఒక సీక్రెట్ పద్ధతి ద్వారా తమకు కావాల్సింది సాధించుకుంటామని సూచించారు. అదేంటో ఇప్పటికి స్పష్టం కాకపోయినా... అనూహ్య పరిణామమేదైనా జరగవచ్చునని మాత్రం తెలుస్తోంది. తుది అస్త్రంగా అవిశ్వాసం... మెరుగైన బ్రెగ్జిట్ ఒప్పందంపై చట్టం చేయలేని పరిస్థితి ఏర్పడితే బోరిస్ జాన్సన్‌ను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రస్తుతానికి ఇందుకు తగ్గ బలం లేకపోగా.. దీనివల్ల సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకమూ లేదు. అవిశ్వాస తీర్మానం మేరకు ఒకవేళ బోరిస్ జాన్సన్ దిగిపోయినా రెండు వారాల్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పడటం, లేదంటే సాధారణ ఎన్నికలు నిర్వహించడం జరగాలని బ్రిటన్ చట్టాలు చెబుతూండటం దీనికి కారణం. ఆపద్ధర్మ ప్రధాని నియామకం ద్వారా బ్రెగ్జిట్‌ను వాయిదా వేసి ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ.. ఆపద్ధర్మ ప్రధాని ఎవరన్న అంశంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. లేబర్ పార్టీ తరఫున జెరెమీ కార్బిన్... ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి కావచ్చుగానీ... యూనియన్ వ్యతిరేకిగా ముద్ర ఉన్న కారణంగా అతడిని బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్న వారు ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ అన్నీ సవ్యంగా జరిగి ఆపద్ధర్మ ప్రధాని బాధ్యతలు చేపడతాడు అనుకుంటే.. బోరిస్ మరో ఎత్తు వేయవచ్చు. రాజీనామా చేయకుండా నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించవచ్చు. దీంతో మెరుగైన ఒప్పందం లేకుండానే అక్టోబర్ 31 తరువాత బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చేస్తుంది. ఒప్పందంతో బయటకు... థెరెసా మే ప్రధానిగా ఉండగా సిద్ధమైన ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఇప్పటికే మూడుసార్లు తిరస్కరించిన నేపథ్యంలో ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువే. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా మరోసారి చర్చలు లేవని భీష్మించుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17 –18లలో జరిగే యూనియన్ నేతల సమావేశం కీలకం కానుంది. ప్రధాని బోరిస్ ఏదో ఒక రకంగా యూనియన్ నేతలను ఒప్పించి ఒప్పందంలో మార్పులు తీసుకు వస్తే.. ఆ మార్పులను బ్రిటన్ పార్లమెంటు ఆమోదిస్తేనే బ్రిటన్‌కు నష్టదాయకం కాని ఒప్పందంతో బ్రెగ్జిట్ అమల్లోకి వస్తుంది. ఒప్పందం లేకుండానే వీడుతుందా..? మెరుగైన ఒప్పందం కుదుర్చుకునేందుకు బోరిస్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోతే ఒప్పందం లేకుండానే యూనియన్ను వీడేందుకు ఆయన సిద్ధం కావచ్చు. కాలపరిమితి కారణంగా పార్లమెంటు కూడా దీన్ని అడ్డుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒప్పందంలో మార్పులు జరిగినా, జరక్కపోయినా అక్టోబర్ 31 తరువాత బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో భాగం కాదు కాబట్టి. ఇదే జరిగితే జాన్సన్ బ్రెగ్జిట్ మద్దతుదార్లను కూడగట్టుకుని ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది మొదట్లో సాధారణ ఎన్నికలకు సిద్ధం కావచ్చు. కానీ యూనియన్ నుంచి వైదొలగిన తరువాతి ఆర్థిక పరిణామాల కారణంగా ఆ ఎన్నికలను గెలవడం బోరిస్‌కు కష్టం కావచ్చు. ముందస్తు ఎన్నికలు..? పార్లమెంటు సస్పెన్షన్ మొదలయ్యేలోపు ఎంపీలు అందరూ మెరుగైన ఒప్పందం లేకుండా బ్రెగ్జిట్ కుదరదని చట్టం చేయగలిగితే.. ఆ వెంటనే బోరిస్ జాన్సన్ సాధారణ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావచ్చు. ప్రస్తుతం ఒకే ఒక్క సభ్యుడి ఆధిక్యంతో సభ నడుస్తూండగా.. ఎన్నికలు జరిగితే జాన్సన్‌కు మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే అవి అక్టోబర్ 17 లోగానే జరగవచ్చునని తద్వారా బోరిస్ గెలిస్తే.. యూరోపియన్ యూనియన్ సదస్సుకు వెళ్లి తన బలాన్ని ప్రదర్శించవచ్చునని అంచనా. కానీ.. ఎన్నికలు నిర్వహించాలంటే హౌస్ ఆఫ్ కామన్స్‌లో మూడింట రెండు వంతుల మంది మద్దతు కావాల్సి ఉంటుంది. అంటే.. బోరిస్‌కు ప్రతిపక్ష నేతల సభ్యులు కొందరు మద్దతు పలకాలి. లేబర్ పార్టీ కూడా తక్షణ ఎన్నికలు కోరుకుంటున్నా బోరిస్‌పై ఉన్న అపనమ్మకం కారణంగా అతడికి మద్దతిచ్చే అవకాశాలు తక్కువే. న్యాయస్థానాలు నిర్ణయిస్తాయా? పార్లమెంటును సస్పెండ్ చేయడంపై ఇప్పటికే బ్రిటన్ న్యాయస్థానాల్లో మూడు కేసులు నమోదయ్యాయి. గతంలో పార్లమెంటును కాదని యూనియన్‌తో చర్చలకు సిద్ధమైన థెరెసా మే నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేసి గెలుపొందిన గినా మిల్లర్ ఇప్పుడు కూడా బోరిస్ నిర్ణయాన్ని సవాలు చేస్తున్నారు. దీంతో బ్రెగ్జిట్ బంతి బ్రిటన్ కోర్టులో పడిపోతుంది! -
‘పాపాలాల్’కు పరీక్షే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగర మేయర్ పాపాలాల్‌కు పెద్ద పరీక్షే ఎదురైంది. అధికార పార్టీ కార్పొరేటర్లకు, మేయర్‌కు మధ్య ఏర్పడిన అగాధం రాజకీయ దుమారం రేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించాల్సిందేనని అధికార పార్టీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు నిర్ణయించారు. గురువారం సాయంత్రం నగరంలోని ఒక అతిథి గృహంలో సమావేశమైన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు.. కార్పొరేషన్ వ్యవహారాలపై, మేయర్ అనుసరిస్తున్న ధోరణిపై వాడీవేడిగా చర్చించారు. కార్పొరేటర్లను ఏ విషయంలోనూ పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెద్దు పోకడలను అనుసరిస్తున్న మేయర్ పాపాలాల్ వైఖరి నగర ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉందని, కార్పొరేటర్లుగా డివిజన్లో ఫలానా సమస్య ఉందన్నా పట్టించుకునే పరిస్థితి లేకపోగా.. తమను కాదని డివిజన్ వ్యవహారాల్లో తలదూరుస్తున్న తీరును పలువురు కార్పొరేటర్లు ఆక్షేపించారు. మొత్తం 42 మంది కార్పొరేటర్లకు గాను 37 మంది సమావేశానికి హాజరయ్యారు. మేయర్ పాపాలాల్‌తోపాటు మరో కార్పొరేటర్‌కు సమావేశానికి సంబంధించి సమాచారం ఇవ్వలేదు. మరో కార్పొరేటర్ పోతుగంటి వాణి కొంతకాలంగా అందుబాటులో లేకపోవడంతో సమావేశానికి హాజరుకాలేదు. ఇద్దరు కార్పొరేటర్లు వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి హాజరు కానప్పటికీ సమావేశంలో చేసిన తీర్మానాలకు మద్దతు పలుకుతామని చెప్పినట్లు సమాచారం. మేయర్ పాపాలాల్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సమావేశానికి హాజరైన డిప్యూటీ మేయర్ బత్తుల మురళితో సహా కార్పొరేటర్లు సంతకాలు చేశారు. మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తుండడంతో ఈ పత్రాన్ని కలెక్టర్‌కు అందజేసి.. అవిశ్వాస తీర్మాన ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్‌ను కోరాలని సమావేశంలో నిర్ణయించారు. ఎమ్మెల్యే అజయ్‌కి వివరించాలని నిర్ణయం.. అయితే మేయర్ పాపాలాల్ వ్యవహార శైలి, మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయం, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి దారితీసిన పరిస్థితులపై ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్‌ను కలిసి పరిస్థితిని వివరించాలని సమావేశం నిర్ణయించింది. దాదాపు గంటకుపైగా జరిగిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయా కార్పొరేటర్లు మేయర్ వ్యవహార శైలి.. తమ డివిజన్లో అభివృద్ధి అంశాలపై కలిసినప్పుడు స్పందించిన తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండడంతో నగర పాలక సంస్థ రాజకీయం రసకందాయంలో పడినట్లయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఎవరిని మేయర్ చేయాలనే అంశం సైతం ప్రస్తావనకు వచ్చింది. అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత మరోసారి సమావేశమై మేయర్ అభ్యర్థిపై పార్టీ సూచనల మేరకు నడుచుకోవాలని మెజార్టీ కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే వెసులుబాటు కలిగిందని, అవిశ్వాస తీర్మానం చేయాల్సిన పరిస్థితిని డిప్యూటీ మేయర్ బత్తుల మురళి తదితరులు వివరించారు. సమావేశంలో కొందరు కార్పొరేటర్లు కొత్త చట్టం మేయర్‌కు వర్తించదని జరుగుతున్న ప్రచారాన్ని కార్పొరేటర్ల దృష్టికి తేగా.. దీనిపై ఇప్పటికే అధికారులతో సంప్రదించామని.. కొత్త చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టుకునే అవకాశం ఉందని సమావేశ నిర్వాహకులు స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తున్న మేయర్ పాపాలాల్ తనపై అవిశ్వాçస తీర్మానానికి జరుగుతున్న ప్రయత్నాలపై ఆచితూచి స్పందిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు చావా నారాయణరావు, శీలంశెట్టి రమా వీరభద్రం, కమర్తపు మురళి, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణతోపాటు పలువురు కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. -
ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాతో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఈ 15 మందిని విశ్వాసపరీక్షకు హాజరుకావాల్సిందిగా ఆదేశించలేరని సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. విశ్వాసపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది ఎమ్మెల్యేల ఇష్టమంది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో స్పీకర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 190, 208 కర్ణాటక అసెంబ్లీ నియమ నిబంధనలు (రెడ్‌విత్ 202ను) అనుసరించి నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. ఈ వ్యవహారంలో స్పీకర్ తన విచక్షణాధికారం మేరకు, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చనీ, నిర్ణీత కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని తాము ఆదేశించబోమనితేల్చిచెప్పింది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఆ వివరాలను స్పీకర్ తమకు సమర్పించాలని ఆదేశించింది. స్పీకర్ తొలుత రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలా? లేక రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలా?లేక రెండింటిని ఒకేసారి పరిశీలించాలా? అనేది తర్వాతి దశలో విచారణ చేపడతాం’ అని కోర్టు తెలిపింది. అసెంబ్లీలో అడుగుపెట్టబోం: ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ విషయమై రెబెల్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ మాట్లాడుతూ.. ‘రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేమంతా కలసికట్టుగా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. మేం విశ్వాసపరీక్ష కోసం గురువారం అసెంబ్లీలో అడుగుపెట్టబోం’ అని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పును తప్పుపట్టిన కాంగ్రెస్.. తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రజాతీర్పును తుంగలోతొక్కిన ఎమ్మెల్యేలకు రక్షణ కవచంలా సుప్రీం తీర్పుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. ఈ ఉత్తర్వులతో రాజకీయ పార్టీలు జారీచేసే విప్‌లు చెల్లకుండాపోతాయనీ, దేశంలోని కోర్టుల ముందు ప్రమాదకరమైన ఉదాహరణను అత్యున్నత న్యాయస్థానం ఉంచిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఓటేస్తా: రామలింగారెడ్డి కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటాననీ, గురువారం జరిగే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ రామలింగారెడ్డి ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు వెళ్లలేదు. తీర్పును స్వాగతిస్తున్నా: స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ తెలిపారు. ‘అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు నాపై అదనపు భారాన్ని ఉంచింది. రాజ్యాంగంలోని నియమనిబంధనలకు అనుగుణంగా>, బాధ్యతతో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాను’ అని స్పీకర్ చెప్పారు. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మద్దతును కూడగట్టుకునేందుకు విశ్వాసపరీక్షను కొద్దికాలం వాయిదావేయాలని కోరినట్లు సమాచారం. కాగా, ఈ భేటీ అనంతరం బీజేపీ నేతలు బోపయ్య, మధుస్వామి తదితరులు స్పీకర్‌ను కలుసుకుని విశ్వాసపరీక్షను వాయిదా వేయొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే గురువారం బలపరీక్ష జరుగుతుందనీ, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. విశ్వాస పరీక్ష నేడే కర్ణాటక అసెంబ్లీలో నేడు విశ్వాసపరీక్ష జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు వెనక్కిరాకపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం కొనసాగడంపై నీలినీడలు అలుముకున్నాయి. 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా, ఇటీవల ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించడంతో అది 107కు చేరుకుంది. ప్రస్తుతం రామలింగారెడ్డిని మినహాయించి 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక వారు గైర్హాజరైనా అసెంబ్లీలో అధికార కూటమి బలం 102కి పడిపోనుంది. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. -
మళ్లీ వేడెక్కుతున్న తమిళ రాజకీయాలు
చెన్నై: తమిళ రాజకీయాలు మరోసారి వేడుకుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్ష డీఎంకే సిద్దమైంది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్‌ను కలిసిన డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి నోటీసులు అందజేశారు. అయితే ఈ నోటీసులు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో తాము అవిశ్వాసం పెట్టినప్పటితో పోల్చితే శాసనసభలో ఇరు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్యలో చాలా మార్పు కన్పిస్తుందని డీఎంకే సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. టీటీవీ దినకరన్‌కు మద్దతు తెలుపుతున్న అధికార అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయడం కారణంగానే డీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి.18 అసెంబ్లీ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ నెల 18న పోలింగ్ ముగియగా.. మిగిలిన నాలుగు స్థానాలకు మే 19న పోలింగ్ జరగనుంది. ఒకవేళ ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాలను డీఎంకే సొంతం చేసుకుంటే తమిళనాడులో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కాగా, 2017 మార్చిలో కూడా డీఎంకే, ధన్‌పాల్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా 122 మంది, అనుకూలంగా 97 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో అది వీగిపోయింది. -
కర్ణాటక ప్రభుత్వంపై ‘అవిశ్వాస’ అస్త్రం!
సాక్షి బెంగళూరు: కన్నడనాట రాజకీయ సమరం ముదిరింది. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను బీజేపీలోకి ఫిరాయించేలా చేయాలన్న వ్యూహం పనిచేయకపోవడంతో కమలనాథులు మరో ఎత్తుగడ వేశారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మాత్రమే తమవైపునకు వచ్చిన నేపథ్యంలో సీఎం కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ మండలి సమావేశాల కోసం బీజేపీ తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించింది. వీరంతా శనివారం రాత్రి కర్ణాటకకు చేరుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తర్వాత ఎమ్మెల్యేలంతా కలిసి కుమారస్వామి ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించాయి. ప్రభుత్వ వ్యవహారశైలితో అసంతృప్తిగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బలవంతంగా ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించిందని ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీని సమావేశపర్చి బలనిరూపణకు ఆదేశించాల్సిందిగా బీజేపీ నేతలు గవర్నర్‌ను కోరనున్నారు. ఇందుకు గవర్నర్ ఓకే చెప్తే కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై బీజేపీ సభ్యులు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఏడుగురు రెబెల్స్‌పై గంపెడాశలు కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు అసంతృప్త ఎమ్మెల్యేలపై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. శుక్రవారం సీఎల్పీ భేటీకి గైర్హాజరైన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించేందుకు కమలనాథులు యత్నిస్తున్నారు. దీనివల్ల సభలో ప్రభుత్వాన్ని కూల్చడానికి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. ఈ సందర్భంగా అవిశ్వాసం పెడితే మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేల చేత క్రాస్ ఓటింగ్ చేయించాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటువేసినా, బీజేపీ ప్రభుత్వం వచ్చాక తగిన ప్రతిఫలం ఉంటుందని వీరందరికీ ఆశచూపుతున్నారు. సీఎల్పీకి గైర్హాజరైన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. నేడు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సొంత పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ప్రభుత్వాన్ని కూల్చబోం: యడ్యూరప్ప కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. కాంగ్రెస్ నేతలే సమన్వయ లోపంతో తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వం పతనమవుతుందని తామెన్నడూ చెప్పలేదన్నారు. బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. సంకీర్ణ ప్రభుత్వం ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా కొనసాగవచ్చని యడ్యూరప్ప వెల్లడించారు. తాము ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని పేర్కొన్నారు. కాగా, కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రచారం వెనుక మాజీ సీఎం సిద్దరామయ్య ఉన్నారని కేంద్ర మంత్రి సదానంద గౌడ ఆరోపించారు. సీఎం కుమారస్వామి ఏ పని చేసినా సిద్దరామయ్య అడ్డు తగులుతున్నారని విమర్శించారు. మరోవైపు యడ్యూరప్ప ప్రకటనను స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలపగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీతో టచ్‌లోనే ఉన్నారని మంత్రి శివకుమార్ చెప్పారు. అసంతృప్తుల్ని బుజ్జగించడంలో భాగంగా అధిష్టానం ఆదేశిస్తే మంత్రి పదవులు వదులుకోవడానికి తనతో సహా సీనియర్ నేతలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. -
అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కిన థెరిస్సామే
-
తీవ్ర ఒడిదుడుకులు
తీవ్ర హెచ్చుతగ్గుల్లో సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ముగిసింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితిల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ట్రేడింగ్ మొత్తంలో 184 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 3 పాయింట్ల లాభంతో 36,321 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 3 పాయింట్లు పెరిగి 10,890 పాయింట్ల వద్దకు చేరింది. ఆరంభ లాభాలు ఆవిరి... చైనా కేంద్ర బ్యాంక్ బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా 8,300 కోట్ల డాలర్ల నిధులను గుమ్మరించనున్నదన్న వార్తల కారణంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. దీంతో సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. బ్రెగ్జిట్ బిల్లు వీగిపోవడంతో యూరప్ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి. దీంతో మన మార్కెట్లో ఆటు పోట్లు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 144 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 40 పాయింట్ల వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 184 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్రిటన్‌లో అనిశ్చితి... యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ బిల్లు బ్రిటన్ పార్లమెంట్లో భారీ మెజారిటీతో వీగిపోయింది. దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టిన బ్రిటన్ ప్రధాని థెరిసా మేపై అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశముందని, ఎన్నికలు కూడా రావచ్చనే రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. లండన్ ఎఫ్టీఎస్ఈ 0.6 శాతం పతనం కాగా, ఇతర యూరప్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ల లిస్టింగ్ ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో క్యాపిటల్ ఫస్ట్ కంపెనీ విలీనం కారణంగా ఏర్పడిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. బీఎస్ఈలో ఈ షేర్ రూ.47 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 2.7 శాతం లాభంతో రూ.48 వద్ద ముగిసింది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.23,071 కోట్లుగా ఉంది. ఈ బ్యాంక్ రుణాలు రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 32 శాతంగా ఉన్నాయి. ► జెట్ ఎయిర్వేస్ కంపెనీ పునరుజ్జీవన ప్రణాళికపై అనిశ్చితి నెలకొనడంతో జెట్ ఎయిర్వేస్ షేర్లు నష్టపోయాయి. ఈ కంపెనీ భాగస్వామి ఎతిహాద్ జెట్ ఎయిర్వేస్లో మరింత వాటాను కొనుగోలు చేయనున్నదని, అయితే ఒక్కో షేర్‌ను రూ.150కు మాత్రమే ఆఫర్ ఇచ్చిందన్న వార్తల కారణంగా ఈ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ 8 శాతం తగ్గి రూ.271 వద్ద ముగిసింది. ► క్యూ3లో ఆర్థిక ఫలితాలు అదిరిపోవడంతో స్పెషాల్టీ రెస్టారెంట్ షేర్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.98 వద్ద ముగిసింది. -
‘విశ్వాసం–అవిశ్వాసం’ విశేషాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల లోక్‌సభకు విశ్వాసం ఉందా, లేదా తెలుసుకోవడానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం విశ్వాసం లేదా అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడతారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షం ప్రవేశపెడితే, విశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది. రెండు తీర్మానాల సందర్భంగా కూడా ప్రభుత్వ సాఫల్య, వైఫల్యాలపై చర్చకు (కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు మినహాయిస్తే) అవకాశం లభిస్తుంది. ఈ రెండు తీర్మానాలపై ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వం ఓడిపోతే ప్రధాన మంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రధాన మంత్రే లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేయవచ్చు. సాధారణంగా విశ్వాస తీర్మానంలో ఓడిపోతామని భావించిన సందర్భాల్లోనే ఓటింగ్‌కు కంటే ముందే ప్రధాని లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేస్తారు. 26 సార్లు అవిశ్వాస తీర్మానాలు కేంద్ర ప్రభుత్వాలపై గతంలో 26 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. 25 సార్లు అవి వీగిపోయాయి. ఒక్కసారి మాత్రం తీర్మానంపై ఓటింగ్‌కు అవకాశం ఇవ్వకుండా అప్పటి ప్రధాన మంత్రి మురార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దేశంలో మొట్టమొదటి సారిగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై అవిశ్వాసం వచ్చింది. భారత్–చైనా యుద్ధానంతరం 1963లో ఆయన ప్రభుత్వంపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి ప్రజా సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జేబీ కృపలాని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా 285 ఓట్ల మార్జిన్‌తో నెహ్రూ సభా విశ్వాసాన్ని పొందారు. రాజీÐŒ గాంధీ, అటల్ బిహారీ వాజపేయి చెరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనగా, లాల్ బహదూర్ శాస్త్రీ, పీవీ నర్సింహారావులు మూడేసి సార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీ మొత్తం 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. మురార్జీ దేశాయ్‌కి కూడా రెండు సార్లు అవిశ్వాస తీర్మానం ఎదురుకాగా, ఒకసారి ఓటింగ్‌కన్నా ముందే (1979, జూలై 12) తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. చివరి సారి 2003లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదురుకొన్నది అటల్ బిహారి వాజపేయికాగా, 15 ఏళ్ల అనంతరం ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీకే అవిశ్వాసం ఎదురయింది. విశ్వాస తీర్మానాల్లో.. దేశంలో ఇప్పటి వరకు విశ్వాస తీర్మానాల సందర్భంగా ఐదుగురు ప్రధాన మంత్రులు రాజీనామా చేయగా, ఏడుసార్లు మాత్రం ప్రధాన మంత్రులు సభా విశ్వాసాన్ని నిరూపించుకో గలిగారు. రెండు సార్లు ప్రధాన మంత్రులు విశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి వాటిపై ఓటింగ్ జరగక ముందే పదవులకు రాజీనామా చేశారు. 1979లో చరణ్ సింగ్ రాజీనామా చేయగా, 1996లో వాజపేయి రాజీనామా చేశారు. 1979, ఆగస్టు 20వ తేదీన తీర్మానం చర్చకు రావల్సి ఉండగా ముందే చరణ్ సింగ్ రాజీనామా చేశారు. 1996, మే 27,28 తేదీల్లో వాజపేయి విశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అయినప్పటికీ ఓటింగ్ ఎదుర్కోకుండానే ఆయన రాజీనామా చేశారు. 1989లో వీపీ సింగ్, 1990లో చంద్రశేఖర్, 1993లో పీవీ నర్సింహారావు, 1996లో హెచ్డీ దేవెగౌడ, 1997లో ఐకే గుజ్రాల్, 1998లో వాజపేయి, 2008లో మన్మోహన్ సింగ్‌లు సభా విశ్వాసాన్ని పొందారు. వీరిలో ముగ్గురు ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షల్లో వీగిపోయి వారి పదవులకు రాజీనామా చేశారు. 1990లో వీపీ సింగ్, 1997లో దేవెగౌడ, 1999లో వాజపేయిలు అలా రాజీనామా చేశారు. చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్ సభా విశ్వాసాన్ని పొంది తమ పదవులకు రాజీనామా చేయడం విశేషం. వారి స్థానాల్లో పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్‌లు ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. -
ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు
-
విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్-జేడీఎస్ కలిశాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బీజేపీ వ్యవహరించిందని విమర్శించారు. హంగ్ అసెంబ్లీ రాష్ట్రానికి కొత్తేమీ కాదని, 2004లో కూడా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబం ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నిర్వహించాల్సి వస్తోందని ప్రకటించారు. చర్చ తర్వాత శాసనసభలో ఓటింగ్ నిర్వహించనున్నారు. తనకు ఎటువంటి ఆందోళన లేదని, బలపరీక్షలో విజయం సాధిస్తామని కుమారస్వామి అంతకుముందు అసెంబ్లీ వెలుపల విలేకరులతో అన్నారు. -
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నందుకే..
స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానంపై రాచమల్లు సాక్షి, హైదరాబాద్: స్పీకర్ కోడెల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నందుకే అవిశ్వాసం ప్రతిపాదించామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. కోడెలపై ప్రతిపాదించిన అవిశ్వాసంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన స్పీకర్ పక్షపాత ధోరణిని తూర్పారపట్టారు. ‘‘ఆనాడు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించడం మా సంస్కారం. పక్షపాత ధోరణితో వ్యవహరించినప్పుడు వ్యతిరేకించడం మా బాధ్యత. ఏ స్పీకరుకైనా ఉండకూడని లక్షణం పక్షపాత ధోరణి. అవినీతి కార్యక్రమాల్లో, పోలీసు కేసుల్లో ఉండకుండా ఉండాలి. సౌమ్యుడై ఉండాలి. ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు ప్రతిపక్షానికి ఉపయోగపడాలి. కానీ ఇవన్నీ కరువయ్యాయి. నన్ను నాలుగుసార్లు సస్పెండ్ చేశారు. మూడుసార్లు ఏతప్పు చేయలేదు. ఒకసారి నేను సభలో లేకున్నా సస్పెండ్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రతిసందర్భంలోనూ ప్రయత్నిస్తున్నారు. నిన్న(సోమవారం) జరిగిన అవిశ్వాసం చివర్లో మూజువాణి ఓటుతో మమ అనిపించారు. అధికారపక్ష సభ్యులంతా కలసి మా పార్టీ అధ్యక్షునిపై ఎన్నో అసత్య, అసందర్భ ఆరోపణలు చేశారు. మనసు గాయపడేలా దాడి చేసి అసభ్యపదాలుపయోగిస్తే ఒక్క సభ్యుడిపైనైనా చర్య తీసుకున్నారా? అందుకే మేము స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెడుతున్నాం.’’ అని వివరించారు. కేసుల్లో ఉన్న వ్యక్తిని స్పీకర్‌గా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. -
'స్పీకర్ వైఫల్యంగానే భావిస్తున్నాం'
-
అవిశ్వాసం ఎందుకు వెనక్కు తీసుకున్నారు: టీడీపీ
సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై అవిశ్వాసం నోటీసును ఎందుకు ఉపసంహరించుకున్నారో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి స్పష్టం చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. పార్టీ నేతలు సి.ఎం.రమేష్, ధూళిపాళ్ల నరేంద్ర శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గత డిసెంబర్ 9 నుంచి 18 వరకూ వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసంపై నోటీసులు ఇచ్చారని, 18న వైఎస్సార్సీపీని స్పీకర్ పిలిచి అవిశ్వాసంపై చర్చకు సిద్ధంగా ఉండాలని సూచించగా, వెంటనే నోటీసును ఉపసంహరించుకుంటున్నట్టు సమాచారం ఇచ్చారని వారు ఆరోపించారు. -
బలపరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ ప్రభుత్వం
-
బలపరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభలో ఈ సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన బలం నిరూపించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. బిజెపి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. 37 మంది సభ్యుల మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఆప్‌కు చెందిన 28 సభ్యులు, కాంగ్రెస్‌కు చెందిన 8, ఒక జెడియు సభ్యుడు మద్దతు పలికారు. -
ఆప్.. దేశానికే ప్రమాదకరం: బీజేపీ
-
ఆప్.. దేశానికే ప్రమాదకరం: బీజేపీ
ఆమ్ ఆద్మీ పార్టీ దేశానికే ప్రమాదకరమని బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎన్నికల్లో తగినన్ని స్థానాలు దక్కించుకోవడంతో దేశ ప్రజల్లో ఒక ఆశ పుట్టిందని, కానీ కాంగ్రెస్ పార్టీతో కేజ్రీవాల్ చేతులు కలపడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. విశ్వాస తీర్మానంపై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి కారణాలేంటో కేజ్రీవాల్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు చెత్తబుట్టలో పడేసిన పార్టీతో ఆమ్ఆద్మీపార్టీ ఎందుకు చేతులు కలిపిందని హర్షవర్దన్ ప్రశ్నించారు. నిజాయితీగల పార్టీకి ఓటేయాలని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారని, అందుకే నిజాయితీ గల బీజేపీకే ప్రజలు ఓటేశారని, అసెంబ్లీలో ఎక్కువ సీట్లు తమకే వచ్చాయని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడటం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. కాగా, విశ్వాస పరీక్ష అంటే తమకు ఏమాత్రం భయం లేదని.. భయపడితే తాము గుడికి వెళ్లి ఉండేవాళ్లమని ఉదయమే కేజ్రీవాల్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎటూ విప్ జారీ చేయడంతో ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గడం లాంఛనప్రాయమే అయ్యింది.