
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్-జేడీఎస్ కలిశాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బీజేపీ వ్యవహరించిందని విమర్శించారు. హంగ్ అసెంబ్లీ రాష్ట్రానికి కొత్తేమీ కాదని, 2004లో కూడా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు.
స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబం ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నిర్వహించాల్సి వస్తోందని ప్రకటించారు. చర్చ తర్వాత శాసనసభలో ఓటింగ్ నిర్వహించనున్నారు. తనకు ఎటువంటి ఆందోళన లేదని, బలపరీక్షలో విజయం సాధిస్తామని కుమారస్వామి అంతకుముందు అసెంబ్లీ వెలుపల విలేకరులతో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment