అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నందుకే..
స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానంపై రాచమల్లు
సాక్షి, హైదరాబాద్: స్పీకర్ కోడెల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నందుకే అవిశ్వాసం ప్రతిపాదించామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. కోడెలపై ప్రతిపాదించిన అవిశ్వాసంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన స్పీకర్ పక్షపాత ధోరణిని తూర్పారపట్టారు. ‘‘ఆనాడు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించడం మా సంస్కారం. పక్షపాత ధోరణితో వ్యవహరించినప్పుడు వ్యతిరేకించడం మా బాధ్యత. ఏ స్పీకరుకైనా ఉండకూడని లక్షణం పక్షపాత ధోరణి. అవినీతి కార్యక్రమాల్లో, పోలీసు కేసుల్లో ఉండకుండా ఉండాలి. సౌమ్యుడై ఉండాలి.
ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు ప్రతిపక్షానికి ఉపయోగపడాలి. కానీ ఇవన్నీ కరువయ్యాయి. నన్ను నాలుగుసార్లు సస్పెండ్ చేశారు. మూడుసార్లు ఏతప్పు చేయలేదు. ఒకసారి నేను సభలో లేకున్నా సస్పెండ్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రతిసందర్భంలోనూ ప్రయత్నిస్తున్నారు. నిన్న(సోమవారం) జరిగిన అవిశ్వాసం చివర్లో మూజువాణి ఓటుతో మమ అనిపించారు.
అధికారపక్ష సభ్యులంతా కలసి మా పార్టీ అధ్యక్షునిపై ఎన్నో అసత్య, అసందర్భ ఆరోపణలు చేశారు. మనసు గాయపడేలా దాడి చేసి అసభ్యపదాలుపయోగిస్తే ఒక్క సభ్యుడిపైనైనా చర్య తీసుకున్నారా? అందుకే మేము స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెడుతున్నాం.’’ అని వివరించారు. కేసుల్లో ఉన్న వ్యక్తిని స్పీకర్‌గా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.