'తెలుగువారంతా సిగ్గుపడుతున్నారు'
తిరుపతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వ్యవహారశైలిపై ఢిల్లీలోని తెలుగువారందరూ సిగ్గుపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు శాసన సభ్యుల్లా కాకుండా వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారి వ్యవహారశైలిని జాతీయ మీడియా సైతం విమర్శిస్తూ ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరువును దేశ వ్యాప్తంగా తీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పీకర్ లా కాకుండా ఒక ఫ్యాక్షన్ లీడర్ లా, టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్ సమావేశాలను అసెంబ్లీలో కాకుండా ఎన్ టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించుకుంటే బాగుంటుందని వ్యంగంగా అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పలేకే అచ్చన్నాయుడు, బొండా ఉమామహేశ్వర రావు తదితరులను రెచ్చగొట్టి వారితో పనిగట్టుకొని తిట్టిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మిథున్ రెడ్డి మండిపడ్డారు.