హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ...స్పీకర్ కోడెల శివప్రసాద్కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో మంగళవారం తమపై కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో దూషించటంతో పాటు దాడికి యత్నించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని, సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని చెవిరెడ్డి అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా మంగళవారం అసెంబ్లీలో శాంతిభద్రతల అంశంపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి చర్చ జరగాలని నినదిస్తున్న సమయంలో ప్రతిగా అధికార పక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. స్పీకర్ అనుమతితో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయగా, అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడానికి ఉపక్రమించారు.
మంత్రి మాట్లాడుతున్న సమయంలో చెవిరెడ్డి ప్లకార్డుతో పోడియం వద్ద తన నిరసన తెలియజేస్తుండగా, అధికార పక్షం సభ్యులు కొందరు.. అసభ్య పదజాలంతో.. కెమెరాకు అడ్డంగా ఉన్నావు... తప్పుకో అంటూ ఆయన్నుద్దేశించి గట్టిగా కేకలు వేశారు. ఆ సమయంలో ఇరుపక్షాల వాగ్వాదాలతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి తలెత్తింది.