కోడెలపై తక్షణమే అనర్హత వేటు వేయాలి: అంబటి
-రూ.11.5 కోట్లు ఖర్చు చేశానని తానే నేరం ఒప్పుకున్నారు
-ఎన్నికల నియమావళి ప్రకారం రూ.28 లక్షలే ఖర్చు చేయాలి
-డబ్బు వెదజల్లడం వల్లనే 924 ఓట్లతో గెలిచారని భావిస్తున్నాం
-కోడెలను తక్షణమే ఎమ్మెల్యే పదవినుంచి తొలగించండి
-ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన అంబటి రాంబాబు
-అడ్డదారిలో గెలిచిన వ్యక్తి స్పీకర్ పదవికీ అనర్హుడే...రోజా
-బ్రీఫ్‌డ్‌మీ వాయిస్ నాది కాదని ఇప్పటికీ బాబు ఖండించలేదు...వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్‌ను కోరారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే రోజా, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్‌సీపీ నేత కరణం ధర్మశ్రీలతో కలిసి సచివాలయంలో ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. ప్రస్తుత ఏపీ స్పీకర్‌గా ఉన్న కోడెల శివపస్రాదరావు తాను ఎన్నికల్లో రూ.11.5 కోట్లు ఖర్చు చేశానని ఓ ప్రముఖ తెలుగు ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని, అందుకే ఆయనపై తక్షణమే చర్యలు తీసుకుని, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
ఈమేరకు వినతి పత్రంతో పాటు కోడెల శివప్రసాదరావు మాట్లాడిన టేపులను సీడీల రూపంలో భన్వర్‌లాల్‌కు అందజేశారు. అనంతరం సచివాలయంలో మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో తనపై 924 ఓట్లతో కోడెల శివప్రసాదరావు గెలుపొందారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రూ.11.5 కోట్లు ఖర్చు చేసినందునే ఆయన 924 ఓట్లతో గెలుపొందినట్టు భావిస్తున్నానని అన్నారు. ఒక ఎమ్మెల్యే ఎన్నికల నిబంధనల మేరకు రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని, కానీ కోడెల శివప్రసాదరావు ఇందుకు భిన్నంగా 40 రెట్లు అధికంగా ఖర్చు చేశారన్నారు. రూ.11.5 కోట్లు ఖర్చుచేసినట్టు తానే స్వయంగా ఒప్పుకున్నందున ఇంతకంటే ఆధారాలు అవసరం లేదని చెప్పారు.
నేను మర్డర్ చేశాను బాబూ అన్నట్టు నేను రూ.11.5 కోట్లు ఖర్చుచేశానని నేరం అంగీకరించారని చెబుతూంటే ఆయనపై చర్యలు తీసుకోకపోవడం సమంజసం కాదన్నారు. ఆయన రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేసి ఉంటే ఇన్ని ఓట్లు వచ్చేవి కావని అంబటి అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు కదా, మరి వారిపై స్పీకర్ చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించగా... ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే కోర్టులు చర్యలు తీసుకునే అవకాశం లేదన్న ఒకే ఒక్క లొసుగుతో స్పీకర్ ఈ దారుణానికి పాల్పడుతున్నారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.11.5 కోట్లు ఖర్చు చేశానని చెప్పిన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారని తాము అనుకోవడం లేదన్నారు. స్పీకర్ కోడెల ఫ్యాక్షన్ లీడర్ అని గ్రహించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను స్పీకర్‌గా నియమించారనేది అర్థమవుతోందన్నారు. ధనం విచ్చలవిడిగా వెదజల్లి కోడెల గెలిచారని, ఈ గెలుపు గెలుపే కాదన్నారు. స్పీకర్‌పై ఎన్నికల కమిషనే చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ఉందని, కోర్టులకు వెళ్లే అవసరం ఉండదని భావిస్తున్నామని అన్నారు.
స్పీకర్ పోస్టుకు అనర్హులు
ఎందరో మహామహులు కూర్చున్న స్పీకర్ స్థానంలో అడ్డదారిలో గెలిచి ఆ సీటులోకి వచ్చిన కోడెల శివప్రసాదరావు అనర్హుడని ఆయన్ను తక్షణమే స్పీకర్ పదవినుంచి, ఎమ్మెల్యే పదవినుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు ఓటుకు నోటుతో ఎమ్మెల్యేలను కొంటారు, ఈయనేమో ప్రజలను కొన్నట్టు చెబుతున్నారు...ఇది ప్రజాస్వామ్యంలో సిగ్గు చేటైన విషయమని అన్నారు. అసెంబ్లీలో నియమాలు, నిబంధనలు అంటూ చెప్పే స్పీకర్‌కు ఇలా కోట్లు వెదజల్లి శాసనసభకు వచ్చారని, ఆయనకు నీతులు మాట్లాడే నైతిక అర్హత ఏ మాత్రం లేదని అన్నారు.
నేరుగా తానే తప్పును ఒప్పుకున్న స్పీకర్‌పై చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని రోజా అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా సంతలో పశువుల్లాగా కొంటున్నా, వారిపై చర్యలు తీసుకునే ధైర్యం స్పీకర్‌కు లేదన్నారు. ఇప్పటికే పాలనా వ్యవస్థ, పోలీసుల వ్యవస్థ బ్రష్టు పట్టిపోయాయని, ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోకపోతే శాసన వ్యవస్థ కూడా బ్రష్టు పట్టే అవకాశం ఉందని అన్నారు.
బ్రీఫ్‌డ్ మీ వాయిస్ నాది కాదు అని అనలేదు
ఓటుకు కోట్లు వ్యవహారంలో బ్రీఫ్‌డ్ మీ అన్న వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పటికీ అవి తన వ్యాఖ్యలు కాదని ఖండించడం లేదని, అయినా దానినుంచి ఆయన తప్పించుకునేందుకు అడ్డదార్లు తొక్కారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఇప్పుడు స్పీకర్ కూడా రూ.11.5కోట్లు ఖర్చు చేశానని నేరం అంగీకరించారని, ఎన్నికల అఫిడవిట్‌లో ఇచ్చింది తప్పని నిరూపించారని, ఈయన కూడా తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఇలా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లు ఏం చేసినా చెల్లుబాటవుతుందని, ఎలాగైనా తప్పించుకోవచ్చునని అనుకుంటే రాజ్యాంగంలో నిబంధనలకు విలువలేదని, ప్రజాస్వామ్యంలో పూర్తిగా తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు.