
ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి : శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కక్కుర్తి అసెంబ్లీ చీఫ్ మార్షల్‌పై వేటుకు దారి తీసింది. అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి తరలించుకున్న సంగతి తెలిసిందే. తీరా ఈ విషయం గుప్పుమనడంతో పోలీసు ఫిర్యాదు వరకు వెళ్లింది. దీంతో తాను ఆ ఫర్నీచర్ ఇచ్చేస్తానని అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు రాసినట్టు కోడెల తప్పించుకునే మార్గాలు వెతికారు. అత్యంత భద్రత కలిగిన గౌరవప్రదమైన అసెంబ్లీ నుంచి ఫర్నీచర్‌ను కోడెల ఎలా తీసుకెళ్లారనే దానిపై పోలీసులు విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ చీఫ్ మార్షల్ వేలూరు గణేష్‌బాబు విధి నిర్వహణలో వైఫల్యం వెలుగు చూసింది. పోలీసులు ఆయన్ను గురువారం విచారించారు.
కోడెల, అసెంబ్లీ అధికారుల ఆదేశాల మేరకు తాను సహకరించానని గణేష్‌బాబు అంగీకరించినట్టు సమాచారం. తానే దగ్గరుండి కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్‌ను తరలించేలా వాహనాల్లోకి ఎక్కించినట్టు ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై చీఫ్ మార్షల్ నుంచి అంగీకార పత్రాన్ని రాతపూర్వకంగా తీసుకున్న పోలీసు అధికారులు క్రమశిక్షణ వేటు వేశారు. ఆక్టోపస్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్న గణేష్‌బాబు డిప్యుటేషన్‌పై అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఆయన్ను చీఫ్ మార్షల్ విధుల నుంచి తప్పించి పాత పోస్టింగ్‌కు వెళ్లాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి కోడెల ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో పోలీసు అధికారిపై వేటు పడటంతో అందుకు సహకరించిన మిగిలిన అధికారుల్లోనూ కలవరపాటు మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment