‘కే’ మాయ | Kodela Siva Prasad Rao Shift Assembly Furniture To His Home | Sakshi
Sakshi News home page

‘కే’ మాయ

Published Wed, Aug 21 2019 3:47 AM | Last Updated on Wed, Aug 21 2019 2:53 PM

Kodela Siva Prasad Rao Shift Assembly Furniture To His Home - Sakshi

సాక్షి, అమరావతి : కంచే చేను మేస్తే.. అన్న సామెత మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు అతికినట్లు సరిపోతుంది. ఆయన స్పీకర్‌గా ఉన్నప్పుడు సర్కారు సొమ్ముకు కాపలాదారుగా ఉండాల్సింది పోయి అందినకాడికి సామగ్రిని ఇంటికి తరలించేయడం వెలుగు చూడటంతో ఔరా.. కోడెలా.. మజాకా.. అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా అసెంబ్లీలో భద్రత లేనందుకే ఇంటికి తెచ్చుకున్నానని దబాయించడం చూసి విస్తుపోతున్నారు. ‘కే ట్యాక్స్‌’ పేరుతో ఐదేళ్లపాటు సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల ప్రజల్ని పీడించిన ఈయన గారి కుటుంబ గాథలు రోజుకొకటి వెలుగు చూసిన తరుణంలో తాజాగా ఈ చిలక్కొట్టుడు వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఏపీ అసెంబ్లీని 2017 మార్చిలో హైదరాబాద్‌ నుంచి అమరావతికి మార్చారు. ఆ సమయంలో స్పీకర్‌ చాంబర్, పేషీకి సంబంధించిన ఫర్నీచర్‌ను మాత్రం సత్తెనపల్లి, నర్సరావుపేటలోని కోడెల ఇంటికి తరలించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్‌ స్పీకర్‌గా ఉన్న సమయంలో తన చాంబర్, పేషీ కోసం మలేషియా నుంచి ప్రత్యేకంగా ఫర్నీచర్‌ను కొనుగోలు చేయించారు. వీటిని 2017లో అమరావతికి తరలించాల్సి ఉండగా కోడెల మాత్రం తన ఇంటికి చేరవేశారు. ఫర్నీచర్‌తోపాటు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని సైతం తన నివాసానికి చేర్చడం గమనార్హం. ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఎన్ని తరలించాలనే లెక్కాపత్రం లేకుండా ఇష్టానుసారం వ్యవహరించి కొన్నింటిని స్క్రాప్‌ కింద విక్రయించేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అసెంబ్లీ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు విషయాలు బయటపడ్డాయి. 

సీసీ కెమేరాలు ఆపివేసి..
హైదరాబాద్‌ నుంచి అమరావతి అసెంబ్లీకి తెచ్చిన ఫర్నీచర్‌ను గదుల్లో ఉంచగా అనంతరం వాటిని సైతం కోడెల తన ఇంటికి లారీల్లో తరలించారు. ఈ వ్యవహారానికి అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌ సహకరించి సీసీ కెమెరాలను ఆపి వేసినట్లు సమాచారం. ఇక ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందు కూడా కంప్యూటర్లు, కొంత ఫర్నీచర్‌ను కోడెల మనుషులు భారీగా తరలించారు. కోడెల వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఉద్యోగి ఇందులో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. బాగున్న వాటిని తన ఇంటికి పంపాలని కోడెల ఆదేశించడం, ఆ ఉద్యోగి లారీలు తెప్పించి లోడ్‌ చేయించడం, చీఫ్‌ మార్షల్‌ అందుకు సహకరించడం అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ అధికారులు, సిబ్బంది ఇదంతా చూసినా ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. 

కొనసాగుతున్న విచారణ..
అసెంబ్లీ కాలపరిమితి ముగిసిన తరువాత నూతన స్పీకర్‌ కార్యాలయానికి ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ సహా అన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అసెంబ్లీ అధికారులు సరిచూసుకుని నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇచ్చిన తర్వాతే సిబ్బందిని రిలీవ్‌ చేస్తారు. కానీ లెక్కలు తేలకుండానే కోడెల సిబ్బందికి ఎన్‌ఓసీలిచ్చి రిలీవ్‌ చేయడంతోపాటు భారీ ఎత్తున ఫర్నీచర్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు మాయమైనట్లు స్పష్టమైంది. దీనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు డీఎస్పీ వై.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. 

తీసుకెళ్లడం నిజమే: కోడెల
నరసరావుపేట: పాత అసెంబ్లీ హాలు స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌కు భద్రత లేనందున తన దగ్గర ఉంచుకున్న మాట నిజమేనని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంగీకరించారు. వాటిని తీసుకెళ్లాలని లేదా విలువ కడితే నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటికే లేఖలు రాశానని చెప్పారు. నరసరావుపేటలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు, సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయాల్లో ఆ ఫర్నిచర్‌ను ఉంచామన్నారు. ఎన్నికల అనంతరం తనపై కేసులు నమోదు కావటంతో ఆలస్యమైందన్నారు. తాను వినియోగించుకున్న కంప్యూటర్లు, ఫర్నిచర్‌కు లెక్క చెప్పాలని కోరడంతో అసెంబ్లీ కార్యదర్శికి రెండు ఉత్తరాలు రాసినట్లు చెప్పారు. తాను వాడుకున్న ఫర్నిచర్‌కు విలువ కడితే డబ్బులు చెల్లిస్తానని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి మరోసారి లేఖ రాస్తానని తెలిపారు. ఇందులో తాను దుర్వినియోగం చేసిందేమీ లేదన్నారు. భద్రత లేని కారణంగా వాటిని తన వద్ద ఉంచుకున్న మాట నిజం అని స్పష్టంగా చెబుతున్నానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement