ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు! | Karnataka rebel MLAs should not be forced to take part in Assembly | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!

Published Thu, Jul 18 2019 3:21 AM | Last Updated on Thu, Jul 18 2019 8:47 AM

Karnataka rebel MLAs should not be forced to take part in Assembly - Sakshi

కుమారస్వామి, బెంగళూరులో హోమంలో పాల్గొన్న యెడ్డీ

సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాతో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీలకు చెందిన ఈ 15 మందిని విశ్వాసపరీక్షకు హాజరుకావాల్సిందిగా ఆదేశించలేరని సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ తెలిపింది. విశ్వాసపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది ఎమ్మెల్యేల ఇష్టమంది. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో స్పీకర్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 190, 208 కర్ణాటక అసెంబ్లీ నియమ నిబంధనలు (రెడ్‌విత్‌ 202ను) అనుసరించి నిర్ణయం తీసుకుంటారని చెప్పింది.

ఈ వ్యవహారంలో స్పీకర్‌ తన విచక్షణాధికారం మేరకు, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చనీ, నిర్ణీత కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని తాము ఆదేశించబోమనితేల్చిచెప్పింది. 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఆ వివరాలను స్పీకర్‌ తమకు సమర్పించాలని ఆదేశించింది. స్పీకర్‌ తొలుత రెబెల్‌ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలా? లేక రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలా?లేక రెండింటిని ఒకేసారి పరిశీలించాలా? అనేది తర్వాతి దశలో విచారణ చేపడతాం’ అని కోర్టు తెలిపింది.

అసెంబ్లీలో అడుగుపెట్టబోం: ఎమ్మెల్యేలు
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ విషయమై రెబెల్‌ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌ మాట్లాడుతూ.. ‘రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేమంతా కలసికట్టుగా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. మేం విశ్వాసపరీక్ష కోసం గురువారం అసెంబ్లీలో అడుగుపెట్టబోం’ అని స్పష్టం చేశారు.



సుప్రీం తీర్పును తప్పుపట్టిన కాంగ్రెస్‌..
తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది. ప్రజాతీర్పును తుంగలోతొక్కిన ఎమ్మెల్యేలకు రక్షణ కవచంలా సుప్రీం తీర్పుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. ఈ ఉత్తర్వులతో రాజకీయ పార్టీలు జారీచేసే విప్‌లు చెల్లకుండాపోతాయనీ, దేశంలోని కోర్టుల ముందు ప్రమాదకరమైన ఉదాహరణను అత్యున్నత న్యాయస్థానం ఉంచిందని వ్యాఖ్యానించారు.



ప్రభుత్వానికి ఓటేస్తా: రామలింగారెడ్డి కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటాననీ, గురువారం జరిగే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ రామలింగారెడ్డి ముంబైలో రెబెల్‌ ఎమ్మెల్యేల క్యాంప్‌కు వెళ్లలేదు.



తీర్పును స్వాగతిస్తున్నా: స్పీకర్‌
సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ తెలిపారు. ‘అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు నాపై అదనపు భారాన్ని ఉంచింది. రాజ్యాంగంలోని నియమనిబంధనలకు అనుగుణంగా>, బాధ్యతతో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాను’ అని స్పీకర్‌ చెప్పారు. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మద్దతును కూడగట్టుకునేందుకు విశ్వాసపరీక్షను కొద్దికాలం వాయిదావేయాలని కోరినట్లు సమాచారం. కాగా, ఈ భేటీ అనంతరం బీజేపీ నేతలు బోపయ్య, మధుస్వామి తదితరులు స్పీకర్‌ను కలుసుకుని విశ్వాసపరీక్షను వాయిదా వేయొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే గురువారం బలపరీక్ష జరుగుతుందనీ, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పీకర్‌ రమేశ్‌ ప్రకటించారు.

విశ్వాస పరీక్ష నేడే
కర్ణాటక అసెంబ్లీలో నేడు విశ్వాసపరీక్ష జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు వెనక్కిరాకపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం కొనసాగడంపై  నీలినీడలు అలుముకున్నాయి. 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా, ఇటీవల ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించడంతో అది 107కు చేరుకుంది.



ప్రస్తుతం రామలింగారెడ్డిని మినహాయించి 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక వారు గైర్హాజరైనా అసెంబ్లీలో అధికార కూటమి బలం 102కి పడిపోనుంది. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని వ్యాఖ్యానిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement