సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న సీఎం కుమారస్వామి
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నెల 18న(గురువారం) ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. ఈ మేరకు సోమవారం విధానసౌధలో ప్రకటించిన స్పీకర్..విశ్వాసపరీక్షకు వీలుగా సభను గురువారానికి వాయిదా వేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ‘పూర్తి నమ్మకంతో ఉన్నా. మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?’ అని మీడియాను ప్రశ్నించారు.
స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యడ్యూరప్ప
బీఏసీ సమావేశం సోమవారం సహృద్భావ వాతావరణంలో సాగిందని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తాము ప్రకటించడంతో, ప్రభుత్వం బలపరీక్షకు తేదీని ఖరారు చేసిందని వ్యాఖ్యానించారు. ‘విశ్వాసపరీక్ష జరిగేవరకూ ఎలాంటి సభా కార్యకలాపాలు కొనసాగరాదని మేం స్పీకర్‌ను కోరాం. మా విజ్ఞప్తి మేరకు ఆయన సభను గురువారానికి వాయిదా వేశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. రాబోయే 3–4 రోజుల్లోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకకు అత్యుత్తమ పాలన అందిస్తుంది’ అని తెలిపారు. అసెంబ్లీలో మంచి ప్రసంగం ఒకటి ఇచ్చాక సీఎం కుర్చీ నుంచి కుమారస్వామి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు.
విచారణకు ఇద్దరు రెబెల్స్ డుమ్మా..
స్పీకర్ ముందు విచారణకు ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజీనామాల విషయంలో తమ వాదనల్ని వినిపించేందుకు సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యలను స్పీకర్ ఆదేశించారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసుకు ఫోన్‌చేసిన ఇద్దరు నేతలు, విచారణకు తాము రాలేకపోతున్నట్లు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విచారణకు మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే వీరి విజ్ఞప్తిపై స్పీకర్ స్పందించలేదు.
పోలీస్ కమిషనర్‌కు రెబెల్స్ లేఖ..
తమను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే, ఆజాద్‌లు రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఈ 15 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ‘ ఖర్గే లేదా ఆజాద్ లేదా మరో కాంగ్రెస్ నేతను కలుసుకునే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ నేతల రాక నేపథ్యంలో మా భద్రతపై ఆందోళనతో ఉన్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నేతలు మమ్మల్ని కలుసుకోకుండా నిలువరించండి’ అని లేఖలో కోరారు. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని రినైసెన్స్ హోటల్‌లో బస చేస్తున్నారు. కాగా, ఈ రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరుకాబోరని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
సిట్ విచారణకు ఎమ్మెల్యే బేగ్ గైర్హాజరు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు గైర్హాజరయ్యారు. ఐఎంఏ జువెల్స్ అధినేత మన్సూర్ ఖాన్ నుంచి రూ.400 కోట్లు పుచ్చుకున్న కేసులో ఆయనకు సిట్ నోటీసులు జారీచేసింది. ముఖ్యమైన పనిపడటంతో తాను విచారణకు రాలేకపోతున్నానని రోషన్ బేగ్ తెలిపారు. ఈ నెల 25న విచారణకు వస్తానని చెప్పారు. అయితే ఇందుకు అంగీకరించని సిట్.. జూలై 19న విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ రెండోసారి నోటీసులు జారీచేసింది. బేగ్ తన దగ్గర రూ.400 కోట్లు పుచ్చుకుని తిరిగివ్వడం లేదని మన్సూర్ ఖాన్ ఓ వీడియో ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సుప్రీం ఓకే
స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకం గానే ఆమోదించడంలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తమ పిటిషన్‌ను మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌తో కలిపి విచారించాలన్న రెబెల్ ఎమ్మెల్యేల విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ 15 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తామని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ గుప్తాల బెంచ్ తెలిపింది. కర్ణాటకకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోర్టు ఇంతకుముందు స్పీకర్ రమేశ్‌ను ఆదేశించడం తెల్సిందే. ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హత పిటిషన్‌పైనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అనే విషయాన్ని తాము పరిశీలించాల్సి ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment