సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌ | MLA Nagaraj Joins Other Rebels in Mumbai | Sakshi
Sakshi News home page

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

Published Mon, Jul 15 2019 3:59 AM | Last Updated on Mon, Jul 15 2019 11:09 AM

MLA Nagaraj Joins Other Rebels in Mumbai - Sakshi

బెంగళూరులో రామలింగారెడ్డితో భేటీ అయిన సిద్దరామయ్య

బెంగళూరు/ముంబై: కర్ణాటకలో రాజకీయం ఆదివారం అనూహ్య మలుపు తిరిగింది. రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు చేసిన విజ్ఞప్తికి తొలుత సానుకూలంగా స్పందించిన రెబెల్‌ ఎమ్మెల్యేల ఎంటీబీ నాగరాజ్‌ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ నేత ఆర్‌.అశోక్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం బెంగళూరు నుంచి ముంబైలోని రెబెల్‌ ఎమ్మెల్యేల క్యాంప్‌కు చేరుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకొస్తానని చెప్పి ముంబైలో దిగగానే మాటమార్చారు. దీంతో కాంగ్రెస్‌–జేడీఎస్‌ నేతల ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. అయితే రెబెల్‌ ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు మరికొందరిని ఒప్పించి వెనక్కు తీసుకొచ్చేందుకే నాగరాజ్‌ ముంబైకి వెళ్లారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హెచ్‌.కె.పాటిల్‌ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో విశ్వాసపరీక్ష నాటికి అన్నీ సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇప్పటివరకూ కాంగ్రెస్‌–జేడీఎస్‌ పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే.

రాజీనామా వెనక్కి తీసుకోను: నాగరాజ్‌
ముంబైకి వెళ్లేముందు నాగరాజ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘సుధాకర్‌ గత రెండ్రోజులుగా తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. ఆయనతో మాట్లాడి ఒప్పించి వెనక్కి తీసుకొస్తాను. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేతలకు ఇప్పటికే చెప్పాను’ అని తెలిపారు. కానీ ముంబైలో రెబెల్‌ ఎమ్మెల్యేల క్యాంప్‌కు చేరుకున్న వెంటనే నాగరాజ్‌ మాటమార్చారు. ‘మేమంతా(రెబెల్‌ ఎమ్మెల్యేలు) ఒకేసారి రాజీనామా చేశాం. ఇప్పుడు రాజీనామా విషయంలో నేను పూర్తి స్పష్టతతో ఉన్నాను. నా రాజీనామాను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మా వెనుక బీజేపీ లేదు. బీజేపీ నేత అశోక్‌తో కలిసి నేను ముంబైకి వచ్చినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అని వెల్లడించారు. మరో రెబెల్‌ ఎమ్మెల్యే ఎస్‌.టి.సోమశేఖర్‌ స్పందిస్తూ.. నాగరాజ్‌ తమతో కలవడానికే ముంబై వచ్చారనీ, ఎమ్మెల్యే సుధాకర్‌ను వెనక్కి తీసుకెళ్లడానికి కాదన్నారు. నాగరాజ్‌     చేరికతో ముంబైలో మకాం వేసిన రెబెల్స్‌ సంఖ్య 15కు   చేరుకుంది.

రామలింగారెడ్డితో కాంగ్రెస్‌ నేతల భేటీ..
ఎమ్మెల్యే నాగరాజ్‌ చాకచక్యంగా ముంబైలోని రెబెల్స్‌ క్యాంప్‌కు చేరుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రెబెల్‌ నేత రామలింగారెడ్డితో కర్ణాటక కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వర్‌ ఖంద్రే, సీఎల్పీ నేత సిద్దరామయ్య, సీనియర్‌ నేత హెచ్‌.కె.పాటిల్‌ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి సమర్పించిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కోరారు. అనంతరం ఖంద్రే మీడియాతో మాట్లాడుతూ..‘రామలింగారెడ్డి సీనియర్‌ నేత. కాంగ్రెస్‌ పార్టీకి ఆయన అవసరం చాలాఉంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. కాబట్టి రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరాం‘’ అని తెలిపారు. మరోవైపు రామలింగారెడ్డి స్పందిస్తూ.. స్పీకర్‌ రమేశ్‌కుమార్‌తో సోమవారం సమావేశమయ్యేవరకూ తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీఎల్పీ సోమవారం సమావేశం కానుంది.

2–3 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం: యడ్యూరప్ప
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప మరోసారి డిమాండ్‌ చేశారు.‘కుమారస్వామి నిజంగా నిజాయితీపరుడైతే, ఆయనకు ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవముంటే వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రికి నేను ఇదే సూచిస్తాను. రెబెల్‌ ఎమ్మెల్యేలు వెనక్కు రాబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకో 2–3 రోజుల్లో కర్ణాటక ప్రజలకు సేవలందించే సదవకాశం బీజేపీకి లభిస్తుంది’ అని చెప్పారు.

కాంగ్రెస్‌పై కుమారస్వామి చిందులు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో సీఎం కుమారస్వామి కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ నేత సిద్దరామయ్యతో సమావేశమయ్యారు. బెంగళూరులోని కుమారకృప గెస్ట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ నేతలపై ముఖ్యమంత్రి చిందులు తొక్కారు. ‘మా పార్టీ నుంచి కేవలం          ముగ్గురే వెళ్లారు. కానీ కాంగ్రెస్‌ నుంచి ఏకంగా 13 మంది  రాజీనామాలు చేశారు. మీ ఎమ్మెల్యేలను కూడా మీరు బుజ్జగించలేరా?’ అని అసహనం వ్యక్తం చేశారు.

అప్రమత్తమైన కమల్‌నాథ్‌
కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ అప్రమత్తమయ్యారు. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్న వేళ ఎమ్మెల్యేలు జారిపోకుండా బుధవారం విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 230 స్థానాలున్నమధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114, బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందాయి. అయితే స్వతంత్రులు(4), బీఎస్పీ(2) ఎస్పీ(1)ల మద్దతుతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, కాంగ్రెస్‌ ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే మిత్రపక్షాలతో సమావేశమయ్యారు.  

అసెంబ్లీలో బలాబలాలు
224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి 118 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 16 మంది రాజీనామా చేయగా, మరో ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఒకవేళ స్పీకర్‌ ఈ 16 రాజీనామాలను ఆమోదిస్తే కూటమి బలం 100కు పడిపోతుంది. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కు చేరుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 105 అవుతుంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగినందున ఆ పార్టీ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement