ఇస్లామాబాద్: దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించలేకపోయిందంటూ పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మంగళవారం అసమ్మతి తీర్మానం ప్రవేశపెట్టాయి. పీఎంఎల్– నవాజ్, పీపీపీ పార్టీలకు చెందిన 100మంది సభ్యులు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. ఈ తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్‌కు సమర్పించినట్లు పీఎంఎల్‌ఎన్ ప్రతినిధి ఔరంగజేబు తెలిపారు. పాక్ ప్రజల కోసమే ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ అధినేత షెబాజ్ షరీఫ్ చెప్పారు.
ప్రభుత్వం పడిపోయిన తర్వాత తమలో ఎవరు పదవిని అధిరోహించాలనే విషయంపై చర్చలు జరుపుతామన్నారు. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానానికి కనీసం 68 మంది మద్దతుండాలి. సరిపడ సభ్యుల మద్దతులో లేఖ అందితే 3– 7 రోజుల్లో స్పీకర్ సభను సమావేశపరిచి తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం సభలో సభ్యుల సంఖ్య 342 కాగా, తీర్మానం నెగ్గేందుకు 172మంది సభ్యుల మద్దతు అవసరం.
ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇమ్రాన్ సొంత పార్టీ టీఐఐకి 155మంది సభ్యులుండగా మరో ఆరు చిన్నపార్టీలు, ఒక స్వతంత్రుడు మద్దతిస్తున్నారు. ప్రతిపక్షాలన్నింటికీ కలిపి 163 మంది సభ్యులున్నారు. అధికార కూటమి నుంచి 28మందికి పైగా సభ్యులు తమకు మద్దతిస్తారని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ఇమ్రాన్‌కు పాక్ ఆర్మీ మద్దతున్న నేపథ్యంలో తీర్మానం నెగ్గడం అంత సులభం కాదని నిపుణుల అంచనా. పాక్‌లో ఆర్మీ ప్రభావం ప్రభుత్వాలపై అధికం. తన ప్రభుత్వం పడిపోదని తాజాగా ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేశారు.
(చదవండి: మా దేశం ఇక నాటో సభ్యత్వం గురించి ఆశించదు)
Comments
Please login to add a commentAdd a comment