Pakistan Political Turmoil: నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హడావిడిగా శనివారం అంతా పాక్ కీలక విభాగాలతో భేటీ అయ్యాడు. ఇందులో భాగంగా.. ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బజ్వా జరిగిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి వస్తే.. సాయం చేయాలని ఇమ్రాన్ ఖాన్ కోరగా, అందుకు పాక్ ఆర్మీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ భేటీలో ఆర్మీ చీఫ్, ఇమ్రాన్ ఖాన్‌కు రాజీనామా సలహానే ఇచ్చినట్లు తెలుస్తోంది.
అవిశ్వాసంలో గనుక ఓడితే.. ఈ నెలాఖరులో జరిగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇది ఇస్లామిక్ కో ఆపరేషన్ (OIC) తర్వాత పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్‌తో.. ఆర్మీ ఛీప్ ఖనార్ జావెద్ బజ్వా చెప్పినట్లు సమాచారం. ఈ భేటీలో బజ్వాతో పాటు ముగ్గురు సీనియర్ లెఫ్టినెంట్ జనరల్స్, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) డీజీ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అంతేకాదు బజ్వాతో పాటు మిగిలిన మిలిటరీ అధికారులు కూడా ఇమ్రాన్ ఖాన్‌తో గద్దె దిగిపోమనే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఖాన్‌కు దారులన్నీ మూసుకుపోయాయి.
ప్రభుత్వం గనుక కూలిపోయే పరిస్థితి వస్తే సైన్యం సాయం తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ భావించాడు. అంతకు ముందు ఆర్మీ మాజీ ఛీఫ్ రహీల్ షరీఫ్.. బజ్వాతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఇమ్రాన్ ఖాన్ తరపున రాయబారం నడిపే ప్రయత్నం చేశాడు. కానీ, రహీల్ దౌత్యాన్ని సైతం పాక్ ఆర్మీ ఛీ కొట్టిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం దగ్గరపడిందనే సంకేతాలు అందాయి. అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కించాలంటూ ప్రధాని వారిని కోరినా తామేమీ చేయలేమంటూ వారు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో అవిశ్వాస తీర్మానంతో పాటు ఓఐసీ సమ్మిట్, బెలూచిస్థాన్ అంశాలపై ప్రధానంగా చర్చించారు.
ఇక ఈ భేటీపై పీటీఐ నేతలు గంపెడు ఆశలు పెట్టుకోగా.. ఫలితం ఇలా రివర్స్ రావడంతో అసంతృప్తిలో కూరుకుపోయారని క్యాపిట్ టీవీ కథనం ప్రసారం చేసింది. మొదటి నుంచి పాక్ ప్రభుత్వాన్ని నియంత్రించే పనిలో ఆర్మీ ఉంటోంది. ప్రతిపక్ష నేతలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆర్మీ ఛీఫ్ బజ్వా మొదటి నుంచి పీటీఐ నేతలకు చెబుతున్నా.. స్వయంగా ఇమ్రాన్ ఖానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడం విశేషం.
ఇప్పటికే ఆర్థికంగా ఎంతో సతమతమవుతున్న దేశం.. ఇప్పుడీ రాజకీయ సంక్షోభంతో మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆర్మీ. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా, యూరోపియన్ యూనియన్ పై అనవసర వ్యాఖ్యలు చేశారంటూ ఇమ్రాన్ పై ఆర్మీ గుర్రుగా ఉంది. ఇప్పటికే సొంత పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ కే చెందిన 24 మంది నేతలు.. ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ దిగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment