సాక్షి బెంగళూరు: కన్నడనాట రాజకీయ సమరం ముదిరింది. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను బీజేపీలోకి ఫిరాయించేలా చేయాలన్న వ్యూహం పనిచేయకపోవడంతో కమలనాథులు మరో ఎత్తుగడ వేశారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మాత్రమే తమవైపునకు వచ్చిన నేపథ్యంలో సీఎం కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ మండలి సమావేశాల కోసం బీజేపీ తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించింది. వీరంతా శనివారం రాత్రి కర్ణాటకకు చేరుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
తర్వాత ఎమ్మెల్యేలంతా కలిసి కుమారస్వామి ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించాయి. ప్రభుత్వ వ్యవహారశైలితో అసంతృప్తిగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బలవంతంగా ఈగల్‌టన్ రిసార్ట్‌కు తరలించిందని ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీని సమావేశపర్చి బలనిరూపణకు ఆదేశించాల్సిందిగా బీజేపీ నేతలు గవర్నర్‌ను కోరనున్నారు. ఇందుకు గవర్నర్ ఓకే చెప్తే కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై బీజేపీ సభ్యులు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ఏడుగురు రెబెల్స్‌పై గంపెడాశలు
కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు అసంతృప్త ఎమ్మెల్యేలపై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. శుక్రవారం సీఎల్పీ భేటీకి గైర్హాజరైన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించేందుకు కమలనాథులు యత్నిస్తున్నారు. దీనివల్ల సభలో ప్రభుత్వాన్ని కూల్చడానికి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. ఈ సందర్భంగా అవిశ్వాసం పెడితే మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేల చేత క్రాస్ ఓటింగ్ చేయించాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటువేసినా, బీజేపీ ప్రభుత్వం వచ్చాక తగిన ప్రతిఫలం ఉంటుందని వీరందరికీ ఆశచూపుతున్నారు. సీఎల్పీకి గైర్హాజరైన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. నేడు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సొంత పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.
ప్రభుత్వాన్ని కూల్చబోం: యడ్యూరప్ప
కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. కాంగ్రెస్ నేతలే సమన్వయ లోపంతో తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వం పతనమవుతుందని తామెన్నడూ చెప్పలేదన్నారు. బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. సంకీర్ణ ప్రభుత్వం ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా కొనసాగవచ్చని యడ్యూరప్ప వెల్లడించారు. తాము ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని పేర్కొన్నారు. కాగా, కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రచారం వెనుక మాజీ సీఎం సిద్దరామయ్య ఉన్నారని కేంద్ర మంత్రి సదానంద గౌడ ఆరోపించారు. సీఎం కుమారస్వామి ఏ పని చేసినా సిద్దరామయ్య అడ్డు తగులుతున్నారని విమర్శించారు. మరోవైపు యడ్యూరప్ప ప్రకటనను స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలపగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీతో టచ్‌లోనే ఉన్నారని మంత్రి శివకుమార్ చెప్పారు. అసంతృప్తుల్ని బుజ్జగించడంలో భాగంగా అధిష్టానం ఆదేశిస్తే మంత్రి పదవులు వదులుకోవడానికి తనతో సహా సీనియర్ నేతలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment