బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని బుధవారం సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆ ఎమ్మెల్యేలు రానున్న ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా పేర్కొంటూ స్పీకర్‌రమేశ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు పోటీ చేసే అవకాశం లేదన్న భాగాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నికల్లో గెలిస్తే వారు మంత్రులూ కావచ్చని పేర్కొంది.
కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో జూలై నెలలో యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఎమ్మెల్యేలు నేడు(గురువారం) బీజేపీలో చేరనున్నారని సీఎం యడియూరప్ప, ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ద్వారా సంక్రమించిన అధికారాలను స్పీకర్ ఉపయోగించిన విషయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ‘ఎంత కాలం అనర్హులుగా ప్రకటించాలనే విషయంలో కానీ, ఎన్నికల్లో పోటీ చేయరాదనే విషయంలో కానీ స్పీకర్‌కు అధికారం లేదు’ అని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న రాజ్యాంగ ధర్మానికి వ్యతిరేకంగా స్పీకర్లు వ్యవహరించడం ఎక్కువైందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అవినీతికి పాల్పడటం, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం వంటి చర్యల వల్ల పౌరులు స్థిర ప్రభుత్వాన్ని పొందే హక్కును కోల్పోతున్నారని పేర్కొంది. ‘ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, వారు స్వచ్చంధంగానే చేశారా? అనే విషయాన్ని మాత్రమే స్పీకర్ పరిగణనలోకి తీసుకుని, ఆ రాజీనామాను ఆమోదించడమో, లేక తిరస్కరించడమో చేయాలి’ అని కోర్టు పేర్కొంది. ‘స్వచ్చంధంగానే రాజీనామా చేసినట్లు తేలితే, ఆ రాజీనామాను ఆమోదించడం మినహా స్పీకర్‌కు మరో మార్గం లేదు. ఆ రాజీనామాను ఆమోదించే విషయంలో సంబంధం లేని ఇతర అంశాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగపరంగా ఆమోదనీయం కాదు. స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు అర్హమైనదే’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎమ్మెల్యేలు మొదట హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టునే ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టును ఆశ్రయించి, ఆ తీర్పుపై సంతృప్తి చెందనట్లయితేనే, సుప్రీంకోర్టును ఆశ్రయించడం çసరైనదని వ్యాఖ్యానించింది.
డిసెంబర్ 5న ఉప ఎన్నికలు
తమను అనర్హ ఎమ్మెల్యేలుగా స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తాజా తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాల్లో 15 సీట్లకు డిసెంబర్ 5వ తేదీని ఉప ఎన్నికలు జరగనున్నాయి. 18 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.
‘ఆ’ ఎమ్మెల్యేలపై కఠిన విధానం సరికాదు
పార్టీ ధిక్కరణకు పాల్పడే చట్ట సభల సభ్యులపై కఠినమైన అనర్హత విధానాన్ని తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దానివల్ల న్యాయమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఆటంకం కలుగుతుందని కాబట్టి అది ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. పార్టీ విధానాన్ని ధిక్కరించే, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఒక కఠిన విధానాన్ని రూపొందించేలా ఆదేశాలు జారీ చేయలన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. కర్ణాటకకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవేళ అలాంటి విధానమేదైనా తీసుకురావాలన్నా.. అది శాసన వ్యవస్థ చేయాల్సిన విధి. ఆ పని కోర్టులు చేయలేవు’ అని పేర్కొంది.
విశ్వాస పరీక్షకు ముందే...
జూలై 23న కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నేపథ్యంలో... విప్‌ను వ్యతిరేకించే అవకాశమున్న కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. తరవాత జరిగిన విశ్వాస పరీక్షలో గెలవకపోవడంతో కుమార స్వామి రాజీనామా చేశారు. జూలై 29న∙విశ్వాస పరీక్షలో నెగ్గి, యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 17 మంది ఎమ్మెల్యేల అనర్హతతో అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య 225 నుంచి 208కి తగ్గింది. మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 105కి చేరింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, తమ 105 మంది ఎమ్మెల్యేల మద్దతుతో యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు.
అనర్హులే.. కానీ పోటీ చేయొచ్చు!
Published Thu, Nov 14 2019 5:12 AM | Last Updated on Thu, Nov 14 2019 5:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment