రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు | DK Shivakumar visited MTB Nagaraj house | Sakshi
Sakshi News home page

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌ నివాసానికి శివకుమార్‌

Published Sat, Jul 13 2019 9:55 AM | Last Updated on Sat, Jul 13 2019 12:38 PM

DK Shivakumar visited MTB Nagaraj house  - Sakshi

సాక్షి, బెంగళూరు : రాజీనామాలు చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా  ఆ పార్టీ సీనియర్‌ నేత శివకుమార్‌ శనివారం ఉదయం రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌ నివాసానికి వెళ్లారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా నాగరాజ్‌ను కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఆయన కుమార్తె సౌమ్యారెడ్డికి కూడా శివకుమార్‌ ఫోన్‌ చేశారు.

కాగా కన్నడ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జేడీఎస్‌–కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని, సమయం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ను కోరిన విషయం తెలిసిందే. 16 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో కుమారస్వామి విశ్వాస పరీక్షకు కోరడం ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో మళ్లీ రిసార్టు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. మూడు పార్టీల ఎమ్మెల్యేలను వేర్వేరు రిసార్టులకు తరలించారు. అయితే రాజీనామా చేసిన వారెవ్వరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నిర్దేశించిన రిసార్టులకు కూడా వెళ్లలేదు. కొందరు ముంబయిలో ఉండగా.. మరికొందరు బెంగళూరులోనే ఉన్నారు. 

బల నిరూపణకు సిద్ధమని చెప్పడంతోనే.. 
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్‌ – జేడీఎస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళం నెలకొందన్నారు. ఈసందర్భంగా వచ్చే మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం బుధవారం అవిశ్వాస తీర్మానానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టుకు తరలించారు. ఈమేరకు రాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు బీజేపీ సభ్యులను తరలించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు తమ పార్టీ సభ్యులంతా ఒక్క చోట ఉండాలని రిసార్టులో ఉన్నట్లు మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్ప తెలిపారు. 

అసెంబ్లీ సమావేశం ముగియగానే ఎమ్మెల్యేలందరినీ రాజానుకుంటెకు ఒకే బస్సులో తరలించారు. రిసార్టు నుంచి నేరుగా సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. మొత్తం 30 గదులు బుక్‌ చేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎమ్మెల్యేను కూడా చేజార్చుకోకూడదని బీఎస్‌ యడ్యూరప్ప గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాగా జేడీఎస్‌ ఎమ్మెల్యేలు గత నాలుగు రోజులుగా దేవనహళ్లి సమీపంలోని ఓ రిసార్టులో మకాం వేసిన సంగతి తెలిసిందే. సభ ముగియగానే వారందరినీ అదే రిసార్టుకు తీసుకెళ్లారు. అయితే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ రిసార్టు బదులు యశవంతపురలోని తాజ్‌వివాంటా హోటల్‌కు తీసుకెళ్లారు. అయితే ముంబయిలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరూ అందుబాటులోకి రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని విప్‌ జారీ చేసినప్పటికీ డుమ్మా కొట్టారు.  

మేమేం ఆపరేషన్‌ చేయలేదు: సిద్ధరామయ్య 
అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం కుమారస్వామి ప్రకటించారు. ఈనేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకుండా బీజేపీ రిసార్టులకు తరలిస్తోంది. సీఎంకు విశ్వాసం ఉన్నప్పటికీ ప్రతిపక్షం భయపడ్డం విడ్డూరంగా ఉంది. తాము ఎలాంటి ‘ఆపరేషన్‌’ చేయలేదు. రాజీనామా చేసిన వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్‌ వేశాను. అయితే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే. రాజీనామా చేసిన కె.సుధాకర్, రామలింగారెడ్డి ముంబయి వెళ్లలేదు. రోషన్‌బేగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని సిద్ధు అన్నారు.  

గోవాకు ఆనంద్‌సింగ్‌ 
రాజీనామా చేసిన ఎమ్మెల్యేల జాబితాలో ముందు వరుసలో ఉన్న ఆనందసింగ్‌ శుక్రవారం గోవా తరలివెళ్లారు. ఈమేరకు ఆయన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లారు. ఈనెల 1వ తేదీన రాజీనామా చేశారు. అయితే ఆ రోజు నుంచి రాష్ట్రం వదిలి వెళ్లలేదు. కానీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్లడం చర్చనీయంగా మారింది. అయితే ఆనందసింగ్‌ ముంబయి వెళ్లి అక్కడ అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత గోవా వెళ్తారనే ప్రచారం సాగుతోంది.   

ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలు గైర్హాజరు
సమర్పించిన రాజీనామాల విషయంపై వివరణ ఇచ్చేందుకు తన ఎదుట హాజరు కావాలని స్పీకర్‌ ఆదేశించినప్పటికీ  ఎమ్మెల్యేలు  అనంద్‌సింగ్, నారాయణగౌడ, ప్రతాప్‌గౌడ పాటిల్‌ గైర్హాజరయ్యారు. ఒత్తిడికి గురై రాజీనామా చేశారా? లేక ఇష్టంతోనే రా జీనామాలు చేశారా అనే విషయాలపై ఆరా తీసేందుకు నిన్న సాయం త్రం 3 నుంచి 4 గంటల సమయంలో తన ముందు హాజరు కావాలని స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement