కన్నడ నాట పొత్తు రాజకీయం | Karnataka Politics: BJP-JDS Alliance In Karnataka | Sakshi
Sakshi News home page

కన్నడ నాట పొత్తు రాజకీయం

Published Mon, Jul 17 2023 5:35 AM | Last Updated on Mon, Jul 17 2023 5:35 AM

Karnataka Politics: BJP-JDS Alliance In Karnataka - Sakshi

శివాజీనగర: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్‌ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్‌కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్‌ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయమై బీజేపీ హైకమాండ్‌తో జేడీఎస్‌ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న ఢిల్లీలో ఎన్‌డీఏ సమావేశం జరగనుంది. దీనికి జేడీఎస్‌ను ఆహ్వానించాలని బీజేపీ హైకమాండ్‌ యోచిస్తోంది. పిలుపు వస్తే వెళ్లాలని కుమారస్వామి సిద్ధమయ్యారు. అక్కడ చర్చలు ఫలిస్తే లోక్‌సభ ఎన్నికలకు పొత్తు కుదిరే అవకాశముంది. కానీ కుమారస్వామితో పొత్తు పెట్టుకొంటే పాత మైసూరు భాగంలో పార్టీ ప్రభావం తగ్గుతోంది, అంతేకాకుండా ఒక్కలిగుల ఓట్‌ బ్యాంకును కోల్పోతాము. పొత్తు వద్దని బీజేపీ రాష్ట్ర నాయకులు, అందులోనూ ఒక్కలిగ నేతలు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం.

ఇది గ్రహించిన కుమారస్వామి రాష్ట్ర నాయకులను కాదని బీజేపీ కేంద్ర నాయకులతో పొత్తు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. జేడీఎస్‌తో చేతులు కలిపి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుపొందాలని బీజేపీ కూడా ఆశిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రికార్డుస్థాయిలో 20కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈసారి అదే జాదూను పునరావృతం చేయాలనుకుంటోంది. కాగా, బీజేపీ–జేడీఎస్‌ పొత్తు వార్తలపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. అవకాశవాద జేడీఎస్‌ పార్టీ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించింది.

జేడీఎస్‌ను చీల్చేందుకు కాంగ్రెస్‌ ఎత్తుగడ
ఇదిలా ఉండగా, అధికార కాంగ్రెస్‌ పార్టీ మరో ఎత్తుగడలో ఉంది. బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న జేడీఎస్‌ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. సుమారు 12 జేడీఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకు రావటం ద్వారా పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించకుండా చూడాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జేడీఎస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలా వచ్చే వారికి మంత్రి పదవులు, నామినేటెడ్‌ పోస్టులను ఇవ్వాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. అదనుచూసి జేడీఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని పథకం వేస్తోంది. 

చర్చలు జరిగాయి: బొమ్మై   పొత్తు గురించి బీజేపీ మాజీ సీఎం బస్వరాజ బొమ్మై ఆదివారం స్పందిస్తూ తమ హైకమాండ్, జేడీఎస్‌ అధినేత దేవేగౌడ మధ్య పొత్తులపై చర్చలు జరిగాయన్నారు. చర్చలు సఫలమైతే రాజకీయ మార్పులు తథ్యమన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement