తీవ్ర ఒడిదుడుకులు | Stock market takes Brexit defeat in stride, ends flat | Sakshi
Sakshi News home page

తీవ్ర ఒడిదుడుకులు

Published Thu, Jan 17 2019 5:24 AM | Last Updated on Thu, Jul 11 2019 8:00 PM

Stock market takes Brexit defeat in stride, ends flat - Sakshi

తీవ్ర హెచ్చుతగ్గుల్లో సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ అక్కడక్కడే ముగిసింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితిల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి.  ట్రేడింగ్‌ మొత్తంలో 184 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 3 పాయింట్ల లాభంతో 36,321 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 3 పాయింట్లు పెరిగి 10,890 పాయింట్ల వద్దకు చేరింది.  

ఆరంభ లాభాలు ఆవిరి...
చైనా కేంద్ర బ్యాంక్‌ బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా 8,300 కోట్ల డాలర్ల నిధులను గుమ్మరించనున్నదన్న వార్తల కారణంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. దీంతో సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. బ్రెగ్జిట్‌ బిల్లు వీగిపోవడంతో యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి. దీంతో మన మార్కెట్లో ఆటు పోట్లు నెలకొన్నాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 144 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 40 పాయింట్ల వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 184 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  

బ్రిటన్‌లో అనిశ్చితి...
యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి వైదొలిగే బ్రెగ్జిట్‌ బిల్లు బ్రిటన్‌ పార్లమెంట్‌లో భారీ మెజారిటీతో వీగిపోయింది. దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టిన బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేపై అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశముందని, ఎన్నికలు కూడా రావచ్చనే రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. దీంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. లండన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 0.6 శాతం పతనం కాగా, ఇతర యూరప్‌ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.  

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్ల లిస్టింగ్‌
ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో క్యాపిటల్‌ ఫస్ట్‌ కంపెనీ విలీనం కారణంగా ఏర్పడిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు బుధవారం స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాయి. బీఎస్‌ఈలో ఈ షేర్‌ రూ.47 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 2.7 శాతం లాభంతో రూ.48 వద్ద ముగిసింది. ఈ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.23,071 కోట్లుగా ఉంది. ఈ బ్యాంక్‌ రుణాలు రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో రిటైల్‌ రుణాలు 32 శాతంగా ఉన్నాయి.  

► జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ పునరుజ్జీవన ప్రణాళికపై అనిశ్చితి నెలకొనడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు నష్టపోయాయి. ఈ కంపెనీ భాగస్వామి ఎతిహాద్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌లో మరింత వాటాను కొనుగోలు చేయనున్నదని, అయితే ఒక్కో షేర్‌ను రూ.150కు మాత్రమే ఆఫర్‌ ఇచ్చిందన్న వార్తల కారణంగా ఈ షేర్‌ భారీగా పతనమైంది. బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 8 శాతం తగ్గి రూ.271 వద్ద ముగిసింది.   

► క్యూ3లో ఆర్థిక ఫలితాలు అదిరిపోవడంతో స్పెషాల్టీ రెస్టారెంట్‌ షేర్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.98 వద్ద ముగిసింది. 




No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement