చెన్నై: తమిళ రాజకీయాలు మరోసారి వేడుకుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్ష డీఎంకే సిద్దమైంది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్‌ను కలిసిన డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్ భారతి నోటీసులు అందజేశారు. అయితే ఈ నోటీసులు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో తాము అవిశ్వాసం పెట్టినప్పటితో పోల్చితే శాసనసభలో ఇరు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్యలో చాలా మార్పు కన్పిస్తుందని డీఎంకే సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
టీటీవీ దినకరన్‌కు మద్దతు తెలుపుతున్న అధికార అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయడం కారణంగానే డీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి.18 అసెంబ్లీ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ నెల 18న పోలింగ్ ముగియగా.. మిగిలిన నాలుగు స్థానాలకు మే 19న పోలింగ్ జరగనుంది. ఒకవేళ ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాలను డీఎంకే సొంతం చేసుకుంటే తమిళనాడులో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కాగా, 2017 మార్చిలో కూడా డీఎంకే, ధన్‌పాల్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా 122 మంది, అనుకూలంగా 97 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో అది వీగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment