![Khammam Corporators are Preparing for a No-Confidence Motion Against the Mayor - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/26/mayor%20copy.jpg.webp?itok=SoyHa0-Q)
ఖమ్మంలో సమావేశమైన టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగర మేయర్ పాపాలాల్‌కు పెద్ద పరీక్షే ఎదురైంది. అధికార పార్టీ కార్పొరేటర్లకు, మేయర్‌కు మధ్య ఏర్పడిన అగాధం రాజకీయ దుమారం రేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించాల్సిందేనని అధికార పార్టీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు నిర్ణయించారు. గురువారం సాయంత్రం నగరంలోని ఒక అతిథి గృహంలో సమావేశమైన టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లు.. కార్పొరేషన్ వ్యవహారాలపై, మేయర్ అనుసరిస్తున్న ధోరణిపై వాడీవేడిగా చర్చించారు. కార్పొరేటర్లను ఏ విషయంలోనూ పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెద్దు పోకడలను అనుసరిస్తున్న మేయర్ పాపాలాల్ వైఖరి నగర ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉందని, కార్పొరేటర్లుగా డివిజన్‌లో ఫలానా సమస్య ఉందన్నా పట్టించుకునే పరిస్థితి లేకపోగా.. తమను కాదని డివిజన్ వ్యవహారాల్లో తలదూరుస్తున్న తీరును పలువురు కార్పొరేటర్లు ఆక్షేపించారు.
మొత్తం 42 మంది కార్పొరేటర్లకు గాను 37 మంది సమావేశానికి హాజరయ్యారు. మేయర్ పాపాలాల్‌తోపాటు మరో కార్పొరేటర్‌కు సమావేశానికి సంబంధించి సమాచారం ఇవ్వలేదు. మరో కార్పొరేటర్ పోతుగంటి వాణి కొంతకాలంగా అందుబాటులో లేకపోవడంతో సమావేశానికి హాజరుకాలేదు. ఇద్దరు కార్పొరేటర్లు వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి హాజరు కానప్పటికీ సమావేశంలో చేసిన తీర్మానాలకు మద్దతు పలుకుతామని చెప్పినట్లు సమాచారం. మేయర్ పాపాలాల్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సమావేశానికి హాజరైన డిప్యూటీ మేయర్ బత్తుల మురళితో సహా కార్పొరేటర్లు సంతకాలు చేశారు. మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తుండడంతో ఈ పత్రాన్ని కలెక్టర్‌కు అందజేసి.. అవిశ్వాస తీర్మాన ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్‌ను కోరాలని సమావేశంలో నిర్ణయించారు.
ఎమ్మెల్యే అజయ్‌కి వివరించాలని నిర్ణయం..
అయితే మేయర్ పాపాలాల్ వ్యవహార శైలి, మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయం, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి దారితీసిన పరిస్థితులపై ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్‌ను కలిసి పరిస్థితిని వివరించాలని సమావేశం నిర్ణయించింది. దాదాపు గంటకుపైగా జరిగిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయా కార్పొరేటర్లు మేయర్ వ్యవహార శైలి.. తమ డివిజన్‌లో అభివృద్ధి అంశాలపై కలిసినప్పుడు స్పందించిన తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండడంతో నగర పాలక సంస్థ రాజకీయం రసకందాయంలో పడినట్లయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఎవరిని మేయర్ చేయాలనే అంశం సైతం ప్రస్తావనకు వచ్చింది.
అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత మరోసారి సమావేశమై మేయర్ అభ్యర్థిపై పార్టీ సూచనల మేరకు నడుచుకోవాలని మెజార్టీ కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే వెసులుబాటు కలిగిందని, అవిశ్వాస తీర్మానం చేయాల్సిన పరిస్థితిని డిప్యూటీ మేయర్ బత్తుల మురళి తదితరులు వివరించారు. సమావేశంలో కొందరు కార్పొరేటర్లు కొత్త చట్టం మేయర్‌కు వర్తించదని జరుగుతున్న ప్రచారాన్ని కార్పొరేటర్ల దృష్టికి తేగా.. దీనిపై ఇప్పటికే అధికారులతో సంప్రదించామని.. కొత్త చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టుకునే అవకాశం ఉందని సమావేశ నిర్వాహకులు స్పష్టం చేశారు.
గత రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తున్న మేయర్ పాపాలాల్ తనపై అవిశ్వాçస తీర్మానానికి జరుగుతున్న ప్రయత్నాలపై ఆచితూచి స్పందిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు చావా నారాయణరావు, శీలంశెట్టి రమా వీరభద్రం, కమర్తపు మురళి, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణతోపాటు పలువురు కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment