దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి మన దేశానికి వచ్చిన 8 ఆఫ్రికన్ చీతాలు ఇక్కడ అంతరించిన వన్యప్రాణి జాతిని పునరుద్ధరించడానికి పనికొస్తాయా? భారత ప్రధాని మోదీ తన జన్మదినం సందర్భంగా శనివారం మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయోద్యానంలోకి వదిలిపెట్టిన ఈ ‘అతిథుల’ గురించి అంతటా ఆసక్తిగా సాగుతున్న చర్చ ఇది. భారత భూభాగంపై ఆసియా ప్రాంత చీతాలు అంతరించిన 70 ఏళ్ళ పైచిలుకు తర్వాత జరుగుతున్న ఈ సాహసోపేత ప్రయోగంపై సహజంగానే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఖండాంతర చీతాల దిగుమతిని పలువురు సానుకూల ప్రయత్నంగా భావిస్తుంటే, కొందరు దీనిలోని ప్రతికూల అంశాలు, ప్రభావాలను ప్రస్తావిస్తున్నారు.
గత శతాబ్దపు మొదట్లో ప్రపంచవ్యాప్తంగా లక్ష చీతాలుంటే, 2016లో చివరిసారిగా లెక్కలు వేసినప్పుడు 7100 వన్యప్రాణులే మిగిలాయి. వాటిలోనూ అధిక భాగం ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో, అతి కొద్దిగా వందలోపు చీతాలు ఇరాన్‌లో ఉన్నాయి. ఒకప్పుడు మన దేశంలో తమిళనాడులోని తిరునల్వేలి నుంచి సువిశాల ఉత్తరాది పచ్చిక మైదానాల దాకా చీతాలు వేలల్లో ఉండేవట. మహా రాజుల మృగయా వినోదం, జనాభా విస్ఫోటనంతో తగ్గిన పచ్చిక బయళ్ళ లాంటి కారణాలతో అవి కనుమరుగయ్యాయి. అంతరించిన వన్యప్రాణి జాతిగా 1952లో భారత అధికారిక ప్రకటన నుంచి మన దేశంలో వీటి కథ ఓ గత చరిత్ర. ఒకానొక కాలంలో 6 నుంచి 18 రూపాయలకు వేటాడిన చీతాలను మళ్ళీ పెంచి పోషించి, శతాబ్దాల విధ్వంసాన్ని చక్కదిద్దే యత్నమే ‘ప్రాజెక్ట్ చీతా’.
ఈ ప్రయోగానికి తగ్గ అటవీ ప్రాంతం కోసం ఏళ్ళ తరబడి అన్వేషించి, చివరకు కూనోను ఎంపిక చేశారు. వాయవ్య మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయోద్యానం ఒకప్పుడు సమీప గ్వాలియర్ సింధియా మహారాజులకు ఇష్టమైన వేటస్థలం. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా చీతాలున్న నమీబియా నుంచి తెచ్చినవాటిని సెప్టెంబర్ 17న ప్రాథమికంగా ప్రధాని కూనోలోనే విడుదల చేశారు. నెల రోజుల ఏకాంతం తర్వాత 750 చదరపు కి.మీ.ల కూనో సవన్నా అటవీ భూముల్లోకి స్వేచ్ఛగా వదిలేస్తారు. అయితే, ఒకప్పుడు మన దేశంలో సంచరించిన ఏషియాటిక్ రకం చీతాలకు భిన్నమైనవి ఈ ఆఫ్రికన్ చీతాలు. వీటిని ఇలా తమ సహజ ఆవాసాల నుంచి భారత్‌కు తరలించడం సరైనది కాదని కొందరు నిపుణుల భావన. అయిదేళ్ళకు రూ. 39 కోట్ల ఖర్చుతో కూడిన ఈ చీతాల తరలింపు, నూతన ఆవాస ప్రక్రియ ఆకర్షణీయమే తప్ప, ఆశించిన ఫలితాలివ్వదన్నది వారి వాదన.
గంటకు 120 కి.మీ.ల వేగంతో, భూతలంపై అత్యంత వేగవంతమైన ప్రాణి అయిన చీతా స్వేచ్ఛగా సంచరించాలంటే సువిశాల ప్రాంతం కావాలి. అలా ఆఫ్రికన్ చీతాలకు తగిన ఆవాసం కానీ, అవి ఆహారంగా తినే రకం ప్రాణులు కానీ భారత్‌లో లేవు. గడ్డిభూములు పెంచాలనే లక్ష్యమూ దీనితో సాధ్యం కాదనేది విమర్శకుల అభిప్రాయం. మరికొందరు మాత్రం ఎక్కడ ఉంటే అక్కడ అలవాటు పడే స్వభావం చీతాలది గనక అతి నిరాశ అవసరం లేదంటున్నారు. నిజానికి, ఇండియన్ టైగర్లు, సింహాల పరిరక్షణ కోసం స్వాతంత్య్రానంతరం భారత్‌లో చేసిన రెండు ప్రధాన వన్యప్రాణి సంరక్షణ పథకాలూ విజయవంతమయ్యాయి. అయితే, అప్పటికే మన దగ్గరున్న పులులు, సింహాల సంతతిని పెంచడంతో అది సాధ్యమైంది. కానీ, ఈసారి ప్రపంచంలో మునుపెన్నడూ లేని విధంగా ఖండాంతర వన్యప్రాణి దిగుమతి చేపట్టాం. అందుకే, ప్రపంచవ్యాప్త జీవ్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.
వన్యప్రాణి పరిరక్షణ సాగాలంటే, వాటి సంఖ్య కన్నా ముందు పెరగాల్సింది అటవీ ప్రాంతం. దేశంలో ప్రస్తుత జాతీయోద్యానాలు, వన్యప్రాణి కేంద్రాలు ఏ మేరకు జీవకోటి పరిరక్షణకు సరిపోతు న్నాయో తెలుసుకొనే అధ్యయనాలు ఈమధ్యే మొదలయ్యాయి. హైవేల నిర్మాణం సహా అనేకం వన్యప్రాణి ఆవాసాల పరిధిని కుదించేస్తున్నాయి. తగినంత ఆహారం దొరకక దగ్గరలో ఉన్న జనావాసాలపై అటవీ మృగాల దాడులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. వన్యప్రాణుల కోసమంటూ ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయిస్తున్న ప్రభువులు, వారి పరివారం తీరా తమ హెలిప్యాడ్, గుడారాల కోసం కూనో ఉద్యానంలో పెద్ద సంఖ్యలో చెట్లు కొట్టేశారు. ప్రకృతిపై ప్రేమతోనే చీతాలు తెచ్చామన్న పాలకుల మాటలకూ, ఈ చేతలకూ పొంతన లేదు. మనుషులకూ, వన్యప్రాణులకూ మధ్య ఘర్షణకు దారి తీస్తున్న ఈ జీవ్యావరణ అసమతౌల్యంపై తక్షణం దృష్టి పెట్టాలి.
దేశంలోని గడ్డిభూముల్లో 2005 –15 మధ్య దశాబ్దిలోనే 31 శాతాన్నీ, ఇప్పటికి మొత్తం 95 శాతాన్నీ నాశనం చేసుకున్న భారత్‌లో చీతాలు ఎక్కడ స్వేచ్ఛగా తిరుగుతాయి? విదేశీ చీతాలను తెచ్చుకొని సాకే కన్నా ఇక్కడ అంతరిస్తున్న అడవి పిల్లి జాతులనూ, బట్టమేక పక్షులనూ పరిరక్షించడం మేలు. అసలైతే గుజరాత్ గిర్ అడవి సింహాల తరలింపునకు కూనో జాతీయోద్యానం సరైనది. లెక్కకు మించి సింహాలున్నా వాటిని తరలించడానికీ, సదరు ఆసియా సింహాలున్న ఏకైక ప్రాంతమనే కీర్తి కిరీటాన్ని పోగొట్టుకోవడానికీ గుజరాత్ నిరాకరిస్తోంది. ఆ సింహాల తరలింపునకు అడ్డుకట్టగానే ఇక్కడ చీతాలు పెట్టారనే ఆరోపణలూ లేకపోలేదు. ఇలాంటి అశాస్త్రీయ ధోరణులే వన్యప్రాణి సంరక్షణకు కీడు. ప్రాణులన్నిటినీ ఒకే ప్రాంతానికి పరిమితం చేస్తే, ఏదైనా మహమ్మారి తలెత్తితే మొదటికే మోసం వస్తుందని నిపుణుల హెచ్చరిక. నిపుణుల సూచనలు ప్రభుత్వం పట్టించుకోకుంటే ఏ ‘ప్రాజెక్ట్ చీతా’ వల్ల ఏం ప్రయోజనం?
Comments
Please login to add a commentAdd a comment