‘వాస్తవాలు మొండిఘటాలు. అవి ఓ పట్టాన లొంగవు. గణాంకాలు అలా కాదు... అవి ఎటువంచితే అటు వంగుతాయి’ అంటాడు విఖ్యాత రచయిత మార్క్ ట్వైన్. పాలకులు గణాంకాలను ఇష్టానుసారం మార్చితే... నిజాలకు మసిపూస్తే ప్రమాదం. అయితే ఏ దేశంలోనైనా జరిగేది అదే అంటారు నిరాశా వాదులు. ఆ మాటెలా వున్నా కేంద్ర ప్రభుత్వం ప్రణబ్ సేన్ ఆధ్వర్యంలోని గణాంకాల స్థాయీ సంఘాన్ని ఇటీవల రద్దు చేసిన తీరు వాంఛనీయం కాదు. ఎన్ని విమర్శలున్నా, లోపాలున్నా గణాంకాలు పాలనా నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వాలు ప్రకటించే ఏ పథకానికైనా, రూపొందించే ఏ విధానానికైనా గణాంకాలే ప్రాతిపదిక.
వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించే సర్వేల ప్రక్రియ ఎలావుండాలో, పరిశోధనకు వేటిని పరిణనలోకి తీసుకోవాలో, దాని నమూనా ఏ విధంగా ఉండాలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేయటం గణాంకాల కమిటీ ప్రాథమిక విధి. దీంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలు గణాంకాల మంత్రిత్వ శాఖకు సమర్పించే సర్వే నివేదికల తీరుతెన్నులెలా వున్నాయో నిశితంగా పరిశీలించి, సందేహాలు నివృత్తి చేసుకుని ఆ ఫలితాలను ప్రకటించటం కూడా కమిటీ పనే. దేశంలోనే తొలిసారి 2019లో కేంద్రం 14 మందితో ఈ కమిటీని నియమించినప్పుడు అందరూసంతోషించారు.
నిరుడు ఆ కమిటీ పరిధిని విస్తరించారు కూడా. కానీ దాన్ని కాస్తా మొన్నీమధ్య రద్దు చేశారు. జాతీయ నమూనా సర్వేలకు సంబంధించి ఇటీవల స్టీరింగ్ కమిటీ ఏర్పాటైనందున గణాంకాల కమిటీని రద్దు చేస్తున్నామని కమిటీ సభ్యులకు చెప్పారు. అసలు అప్పటికే ఆ పనిలో ఓ కమిటీ నిమగ్నమై ఉండగా కొత్త కమిటీ ఎందుకు ఏర్పాటైనట్టు? దాన్ని చూపించి పాతది రద్దు చేస్తున్నామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి? వీటికి జవాబిచ్చేవారు లేరు.
ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయానికీ, వేసే ప్రతి అడుగుకూ గణాంకాలు ప్రాణం. ఏటా బడ్జెట్ ముందు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేనే తీసుకుంటే... దేశంలో ఆహారానికి జనం ఖర్చు చేస్తున్నదెంతో, అది పట్టణాల్లో ఎలావుందో గ్రామీణ ప్రాంతాల్లో ఎలా వుందో తెలుస్తుంది. నిరుద్యోగిత ఏ విధంగా వున్నదో, వ్యవసాయ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నవారి సంఖ్య ఎంతో వెల్లడవుతుంది. జనం విద్యకు ఖర్చు చేస్తున్నదెంత... ఆరోగ్యానికి ఖర్చవుతున్నదెంత అనే వివరాలు కూడా తెలు స్తాయి. ఇక పేదరిక నిర్మూలన పథకాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపాయో, వాటిని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఎటువంటి చర్యలు అవసరమో నిర్ణయించుకోవటా నికి గణాంకాలు తోడ్పడతాయి.
అయితే ఈ గణాంకాల విశ్వసనీయత తేలాలంటే ఒక గీటురాయి అవసరం. జనాభా గణాంకాలే ఆ గీటురాయి. విషాదమేమంటే మూడేళ్ల క్రితం ప్రారంభం కావా ల్సిన జన గణన ఇంతవరకూ మన దేశంలో మొదలుకాలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పదేళ్లకోసారి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ గణన కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో సాగలేదు. వాస్తవానికి జనగణన నోటిఫికేషన్ పద్ధతిగా 2019 మార్చిలో విడుదలైంది. దాని ప్రకారం 2020 ఏప్రిల్–సెప్టెంబర్‌లమధ్య తొలి దశలో ఇళ్లు, కట్టడాలు, కుటుంబాలు వగైరాలకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి. 2021 ఫిబ్రవరిలో జనాభా గణన ఉండాలి.
కానీ 2020 మార్చితో మొదలై ఆ ఏడాది నవంబర్ వరకూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో జనాభా గణన సాధ్యపడలేదు. ఆ తర్వాతైనా వెనువెంటనే ప్రారంభించాలని కేంద్రం అనుకోలేదు. అమెరికా, చైనాలతో సహా ప్రపంచంలో ఎన్నో దేశాలు కరోనా తీవ్రత తగ్గగానే చకచకా రంగంలోకి దిగి జనాభా గణనను జయప్రదంగా పూర్తిచేశాయి. కేవలం ఘర్షణ వాతావరణం నెలకొన్న లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే జన గణన జరగలేదు. మన దగ్గర ఎందుకు కాలేదో సంజా యిషీ ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్ధపడలేదు.
భిన్న మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉండే సంస్థలూ, ఇతరత్రా స్వచ్ఛంద సంస్థలూ క్రమం తప్పకుండా సర్వేలు చేస్తున్నాయి. కానీ వాటిని దేంతో సరిపోల్చుకోవాలి? ఏ ప్రాతిపదికన వాటిని విశ్వసించాలి? తాజా జన గణన లేదు కాబట్టి 2011 నాటి జనాభా లెక్కలే వీటన్నిటికీ గీటురాయిగా వినియోగిస్తున్నారు. కానీ ఇందువల్ల వాస్తవ చిత్రం ఆవిష్కరణ కాదు. ఉదాహరణకు 2011 జనగణన ప్రాతిపదికగా మన జనాభా 120 కోట్లని తేలింది. తాజాగా అది 140 కోట్లకు చేరుకుందని చెబుతున్నారు. కానీ పాత లెక్కన పేదరికాన్నీ, ఇతర స్థితిగతులనూ గణిస్తున్నందువల్ల 12 కోట్లమంది నిరుపేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సదుపాయం వర్తించటం లేదని అంటున్నారు.
తమ రాష్ట్ర జనాభా పెరిగినందువల్ల అదనపు కోటా కావాలని ఏ ప్రభుత్వమైనా ఏ ప్రాతి పదికన అడగాలి? అందుకు కేంద్రం ఎలా అంగీకరించాలి? అప్పుడప్పుడు వెలువడే ప్రపంచసంస్థల సర్వేలు పేదరికాన్నీ, నిరుద్యోగితనూ, ఇతరత్రా అంశాలనూ చూపుతూ మన దేశం వెనక బడి వుందని చెబుతుంటే కేంద్రం నిష్టూరమాడుతోంది. అక్కడివరకూ ఎందుకు... మన సర్వేల రూపకల్పన, అవి వెల్లడించే ఫలితాలు దేశంలో పేదరికం పెరిగినట్టు, అభివృద్ధి జరగనట్టు అభి ప్రాయం కలగజేస్తున్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు శామికా రవి ఆ మధ్య విమ ర్శించారు.
ఈ విషయంలో ఆమెతో ప్రణబ్ సేన్‌కు వాగ్వాదం కూడా జరిగింది. బహుశా గణాంకాల కమిటీ రద్దు వెనకున్న అసలు కారణం అదేనా? ఇద్దరి వైఖరుల్లోనూ వ్యత్యాసానికి మూలం జన గణన జరపక పోవటంలో ఉంది. ఆ పనిచేయకుండా గణాంకాల కమిటీనే రద్దు పర్చటం ఉన్నదు న్నట్టు చూపుతున్నదని అలిగి అద్దాన్ని బద్దలుకొట్టడమే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment