15 శాతం అధిక కేటాయింపులు
రూ.1.75 లక్షల కోట్లకు చేరే అవకాశం
డైయిరీ, ఫిషరీస్‌కూ ప్రాధాన్యం
సహజసిద్ద సాగుకు మద్దతు
రైతుల ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఉన్న నరేంద్ర మోదీ సర్కారు రానున్న బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనుంది. గత బడ్జెట్‌తో పోల్చితే కేటాయింపులు ఏకంగా 15 శాతం మేర పెరగనున్నట్టు విశ్వసనీయ వర్గాలు అందించిన సమాధారం ఆధారంగా తెలుస్తోంది. ఎరువుల సబ్సిడీల్లో ప్రధానంగా పోషకాధారిత సబ్సిడీకి ప్రాధాన్యం ఇవ్వనుంది.
మరిన్ని దిగుబడిని ఇచ్చే వంగడాల అభివృద్ధి, ప్రకృతి అనుకూల వ్యవసాయానికి మరింత మద్దతు అందించనుంది. కేవలం వ్యవసాయమే కాకుండా, అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, ఫిషరీస్ (మత్స్య)కు సైతం ప్రోత్సాహాన్ని కల్పించనుంది. దేశంలో 45 శాతం ఉపాధికి వ్యవసాయం, అనుబంధ రంగాలే ఆధారంగా ఉండడం గమనార్హం. దేశ జీడీపీలో ఈ రంగం 15 శాతం వాటా సమకూరుస్తోంది. కనుక వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం.
నానో, ఆర్గానిక్ ఎరువులకు ప్రోత్సాహం
ఎరువుల సబ్సిడీలో పోషకాధారిత ఎరువులకు కేటాయింపులు పెరుగుతూ వస్తున్నాయి. నేలలోని పోషకాలను కాపాడడం, యూరియా వినియోగాన్ని తగ్గించడం మధ్య సమతుల్యతను తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా సాయిల్ హెల్త్ కార్డ్ (ఎస్‌హెచ్‌సీ/భూసారం వివరాలు)ను రైతులకు అందించనుంది. ప్రతి ప్రాంతంలోనూ నేల సారం ఎలా ఉంది, ఆ నేలకు తగ్గట్టు ఎలాంటి పోషకాలు అవసరం అన్న సమాచారం ఈ కార్డుల్లో ఉంటుంది. నానో, ఆర్గానిక్ ఎరువులకు ప్రోత్సాహం దిశగా మరిన్ని చర్యలు బడ్జెట్‌లో ఉండనున్నాయి. దీని ద్వారా పంటల దిగుబడిని పెంచడంతోపాటు, రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించొచ్చు. ఫలితంగా దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ప్రభుత్వానికి సబ్సిడీ భారం కూడా తగ్గిపోతుంది.
అనుబంధ రంగాలకూ ప్రాధాన్యం
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్య సాధనలో మోదీ సర్కారు సఫలీకృతం కాలేదు. నాబార్డ్ నివేదిక ప్రకారం.. గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 2016–17 నుంచి 2021–22 మధ్య ఏటా 9.5% కాంపౌండెడ్ (సీఏజీఆర్) వృద్ధి చెందింది. అంటే మొత్తం మీద చూస్తే ఈ కాలంలో ఆదాయ వృద్ధి 57 శాతమే పెరిగినట్టు తెలుస్తోంది. ఈ దృష్ట్యా వ్యవసాయేతర రంగాలైన ఫిషరీస్, డైయిరీస్, తేనెటీగల పెంపకం తదితర విభాగాలకు మద్దతు ఇవ్వడం ద్వారా గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచే ప్రణాళికలతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వ్యవసాయ సరఫరా వ్యవస్థను (కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్ తదితర) పట్టిష్టం చేయడం, వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ల బలోపేతంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.
అంచనాలు..
→ 2024–25 బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రభుత్వం 1.52 లక్షల కోట్లు కేటాయించింది. 2025–26 బడ్జెట్‌లో 1.75 లక్షల కోట్లకు కేటాయింపులు పెరగనున్నాయి. ఇందులో ఒక్క వ్యవసాయానికి రూ.1.23 లక్షల కోట్లు దక్కనున్నాయి.
→ సబ్సిడీ సాగు రుణం ఒక్కో రైతుకు రూ.3 లక్షల పరిమితి ఉండగా, దీన్ని రూ.5లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీనికి అదనంగా పంటల బీమాను సైతం పెంచనుంది.
→ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫారి్మంగ్ పథకం కింద కోటి మంది రైతులను సహజ సిద్ధ సాగులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం గతేడాది లక్ష్యాన్ని ప్రకటించింది. వచ్చే బడ్జెట్‌లో ఈ దిశగా మరిన్ని ప్రోత్సాహకాలు ఉంటాయన్న
అంచనా ఉంది.
→ దేశీయంగా దిగుబడిని పెంచడం ద్వారా ధరల పెరుగుదలను కట్టడి చేయడానికి కూడా ప్రాధాన్యం ఇవ్వనుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రస్తుతమున్న 50 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 80 బిలియన్ డాలర్లకు (రూ.6.88 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యంతో కేంద్రం ఉంది.
→ 2030 నాటికి పప్పు ధాన్యాల ఉత్పత్తిని 30 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా చర్యలు ప్రకటించనుంది.
→ వచ్చే ఐదేళ్లలో మత్స్యకార రంగానికి
→ 9 బిలియన్ డాలర్ల నిధుల సాయాన్ని అందించనుంది.
→ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు 2027 నాటికి రూ.10,900 కోట్ల రాయితీలను కూడా అందించనుంది.
→ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించే చర్యలు
5లక్షలు: ఒక్కో రైతుకు రాయితీతో కూడిన పంట రుణం2030నాటికి వ్యవసాయ ఎగుమతుల లక్ష్యం 80 బిలియన్ డాలర్లు
10,900కోట్లు: ఫుడ్ ప్రాసెసింగ్‌కు రాయితీలు రైతులకు భూసారం కార్డులు
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment