ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజనతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
రూ.1.45 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేంద్రం పెద్దపీట
వ్యవసాయ ఉత్పాదకత పెంపు, గ్రామీణ ప్రగతి లక్ష్యంగా 6 కొత్త పథకాలు
పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధికి ఆరేళ్ల కార్యక్రమం
సమగ్ర ఉద్యాన కార్యక్రమం..ఐదేళ్ల మిషన్‌తో పత్తి సాగుకు ఊతం
పలు పథకాలకు పెరిగిన కేటాయింపులు ..
బిహార్‌లో మఖానా బోర్డు.. అసోంలో యూరియా ప్లాంటు
సుస్థిర ఫిషింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిన నిర్మలా సీతారామన్
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడిరైతులకు ప్రయోజనం
న్యూఢిల్లీ : వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, గ్రామీణ ప్రగతి లక్ష్యంగా పథకాలు, కేటాయింపులు ప్రకటించింది. రైతాంగానికి లబ్ధి చేకూర్చేలా కొత్తగా ఆరు పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు సబ్సిడీతో కూడిన కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఆర్థికాభివృద్ధికి కీలకమైన రంగాల్లో వ్యవసాయం మొదటిదని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..2025–26 బడ్జెట్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆహార శుద్ధి కార్యక్రమాలకు కలిపి రూ.1.45 లక్షల కోట్లు కేటాయించారు.
అయితే కొత్త పథకాలకు కేటా యింపులపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలు రూ.1.47 లక్షల కోట్లను తాజా బడ్జెట్ అధిగమించ వచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖకు 2.75 శాతం తక్కువ బడ్జెట్‌ను ప్రకటించినప్పటికీ, కేంద్రం కీలక పథకాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం.
అయితే అను బంధ రంగాలకు, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమకు 37 శాతం అధికంగా రూ.7,544 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్‌కు 56 శాతం అధికంగా రూ.4,364 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) మొత్తంగా రూ.1.57 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేంద్రం ప్రతిపాదించింది.
ఆహార భద్రతపై దృష్టి ..
తాజా బడ్జెట్‌లో ఆహార భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టిన కేంద్రం.. తక్కువ సాగు, ఉత్పాదకతతో వ్యవసాయంలో వెనుకబడిన దేశంలోని 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేసే ఈ పథకంతో..ధాన్యం ఉత్పాదకత పెంపు, పంటల్లో వైవిధ్యం, పంటల కోత అనంతర సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.
పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి ..
పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి (ఆత్మ నిర్భర్) లక్ష్యంగా ఆరేళ్ల పప్పు ధాన్యాల కార్యక్రమాన్ని (పల్సెస్ మిషన్) కేంద్రం ప్రకటించింది. కంది, మినప, ఎర్రపప్పు (మసూర్) ఉత్పత్తిని ప్రోత్సహించే ఈ కార్యక్రమానికి రూ.1,000 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లు రైతులతో లాంఛనంగా ఒప్పందాలు కుదుర్చుకుని నాలుగేళ్ల పాటు ఈ పప్పు ధాన్యాలను సేకరిస్తాయి.
పండ్లు, కూరగాయలు.. పత్తికి ప్రత్యేక కార్యక్రమాలు
కూరగాయలు, పండ్ల ఉత్పాదకతను పెంచే సమగ్ర ఉద్యాన కార్యక్రమానికి, అలాగే మంచి (పొడవైన పింజ) పత్తి రకాలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన కాటన్ (పత్తి) మిషన్‌కు రూ.500 కోట్ల చొప్పున కేటాయించా రు. ఇటీవల తెలంగాణలోని నిజామాబాద్‌లో పసుపు బోర్డును ప్రకటించిన కేంద్రం.. తాజా బడ్జెట్‌లో బిహార్‌కు రూ.100 కోట్లతో మఖానా (తామర గింజ (ఫాక్స్ నట్) బోర్డును మంజూరు చేసింది.
అదేవిధంగా మరో రూ.100 కోట్లతో వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే విత్తనాల అభివృద్ధి లక్ష్యంగా ఓ పరిశోధనా వ్యవస్థను ప్రకటించింది. అసోంలోని నామ్‌రూప్‌లో 12.7లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో ఓ యూరియా కర్మాగారాన్ని కూడా ప్రతిపాదించారు.
గ్రామీణ ప్రగతి కార్యక్రమం..
గ్రామీణ నిరుద్యోగితకు పరిష్కారంగా సమగ్ర ‘గ్రామీణ ప్రగతి..స్థితి స్థాపకత’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పా రు. వలసలు అనేవి తప్పనిసరి కాకుండా ఓ ప్రత్యా మ్నాయంగానే ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యమని ఆర్థికమంత్రి వివరించారు. గ్రామీణ మహిళలు, యువత, యువ రైతులు, సన్న చిన్నకారు రైతులు, భూముల్లేని కుటుంబాలపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని చెప్పారు.
సుస్థిర ఫిషింగ్ ఫ్రేమ్‌వర్క్ ..
రూ.60 వేల కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తూ. చేపలు, ఆక్వాకల్చర్ ఉత్తత్తిలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఓ సుస్థిర ఫిషింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. ప్రపంచ సీఫుడ్ మార్కెట్‌లో భారత్ పోటీ తత్వాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా..ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి)పై కనీస దిగు మతి సుంకాన్ని (బీసీడీ) 30% నుంచి 5 శాతానికి తగ్గించింది.
కృషి వికాస్ యోజనకు రూ.8,500 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి 41.66 శాతం పెంపుతో రూ.8,500 కోట్లు కేటాయించారు. కృషియోన్నతి (రూ.8వేల కోట్లు), నమో డ్రోన్ దీదీ, నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫారి్మంగ్, ప్రధానమంత్రి, మత్స్య సంపద యోజన తదితర పథకాలకు నిధులు గణనీయంగా పెంచారు.
కిసాన్ క్రెడిట్ కార్డులతో మరింత రుణం
రైతులకు రుణ భద్రతను మరింత పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందులో భాగంగానే కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ కలిసి ప్రారంభించాయి.
ఈ కార్డుపై ఇప్పటిదాకా రూ.3 లక్షల రుణ పరిమితి ఉండగా..దీన్ని తాజాగా రూ.5 లక్షలకు పెంచడంతో దేశవ్యాప్తంగా 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులు లబ్ధి పొందనున్నారు. పెంచిన పరిమితి మేరకు వీరు స్వల్పకాలిక రుణాలు పొందేందుకు అవకాశం ఉంది.
పరిశ్రమ వర్గాల హర్షం
బడ్జెట్‌లో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్ అసోసి యేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) అధ్యక్షుడు సంజీవ్ అస్థానా, ఫెడ రేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ)చైర్మన్ అజయ్ రాణా, అదాని విల్మార్ సీఈఓ అంగ్షు మాలిక్, బేయర్ క్రాప్ సైన్సెస్ ఎండీ సైమన్ వీ బుష్‌లు హర్షం వ్యక్తం చేశారు.
దూరదృష్టి బడ్జెట్..
‘ఇది దూరదృష్టితో కూడిన బడ్జెట్. విశ్వాసం అనే పరిమ ళం ఇందులో ఉంది. అభివృద్ధి కోసం, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం తపన ఇందులో ఉంది. స్వయం సమృద్ధి భారత్ దిశగా ప్రభుత్వ దార్శనికతలో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత లభించింది..’ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
రైతు సంఘాల అసంతృప్తి.. 5న ధర్నా
అన్ని పంటలకు చట్టబద్ధమైన గ్యారంటీతో కూడిన కనీస మద్దతు ధర కల్పించాలనే తమ దీర్ఘకాల డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోక పోవడంపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పంట రుణాలు మాఫీ చేయకపోవడం, రైతు, కారి్మక, పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌కు నిరసనగా ఈ నెల 5న ధర్నా నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) తదితర సంఘాలు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment