Yalamanchili Shivaji
-
సామాన్యుల ముఖ్యమంత్రి!
1988 మార్చిలో రాజ్య సభకు ఎన్నికయ్యాను. అప్పటికి ఒక మాసం ముందు త్రిపుర శాసన సభకు జరిగిన ఎన్నిక లలో, అప్పటికి పదే ళ్ళుగా అధికారంలో ఉన్న నృపేన్ చక్రవర్తిని ఓడించి, కాంగ్రెస్‌కు చెందిన సుధీర్ రంజన్ మజుందార్ ప్రభుత్వం కొలువు తీరింది. ప్రతిపక్షాలకు చెందిన కార్య కర్తలపై దాడులు, వారి ఆస్థులను ధ్వంసం చేయడం, ఇళ్ళను తగులబెట్టడం వంటి దుర్మా ర్గాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ నుండి ఒక అఖిలపక్షం ఆ రాష్ట్రంలో పర్యటించి, వారికి ధైర్యం చెప్పి, సాంత్వన కల్పించాలని మా సభలో మా సహచరులు దిపేన్ ఘోష్, సుకుమార్ సేన్, సురేన్ భట్టా చారి, గురుదాస్ దాస్ గుప్తా కోరారు. తెలుగు దేశం నుండి శివాజీ రావాలని కోరారు. సరేనన్నాను.శుక్రవారం సాయంత్రం రాజ్యసభ సమా వేశాలు ముగిసినాక, సాయంత్రం బయలుదేరి కలకత్తా చేరుకొన్నాం. విమానాశ్రయంలో బెంగాల్‌కు చెందిన మార్క్సిస్టు పార్టీ నాయకులు మాకు స్వాగతం పలికి, విమానాశ్రయంలోని విశ్రాంతి గదులలో ఏర్పాటు చేసిన బసలో మమ్మల్ని దించారు. అదే సమయంలో ఢిల్లీ వెళ్ళడానికి విమానాశ్రయానికి వచ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు మమ్ములను పరి చయం చేసి, కాసేపు ముచ్చటించే ఏర్పాటు చేశారు. మరురోజు ఉదయం అగర్తలాకు విమా నంలో వెళ్లాము. మాతోపాటు బెంగాల్ మంత్రులు కూడా మూడు రోజులు పర్యటించారు. ఒక నివేదిక తయారు చేశాం. అదంతా రాజ్యసభలో ప్రస్తావించాం. ఆ కథ అంతటితో ముగిసింది.తరువాత పుష్కర కాలం గడిచినాక 2000 నవంబరులో జ్యోతిబసు తరువాత బుద్ధదేవ్ ముఖ్యమంత్రిగా – పదకొండు సంవత్సరాలు ఆదర్శవంతమైన, విశుద్ధ పరిపాలన అందించారు. మాతో సామాన్య కార్యకర్త మాదిరి సిగరెట్లు కాలుస్తూ, చేతిలో ఆంగ్ల నవల పట్టుకొని సంచరించిన బుద్ధదేవ్, ముఖ్యమంత్రిగా అధికార నివాసానికి మారకుండా, తానుండే సాదా–సీదా రెండు పడక గదుల ఆపార్టుమెంటులోనే కొనసాగారు. సాయంత్రం 5 గంటల కల్లా రైటర్స్ భవన్ నుండి బయటకొచ్చి, తోవలో పార్టీ కార్యాలయంలో కాసేపుండేవారు. ఇంటికొచ్చి పచ్చి వక్కను కత్తిరించుకొని నములుతూ, ఇంగ్లిష్ నవలను ఆస్వాదిస్తూ, టుంగుటుయ్యాలలో కూర్చుని సేదదీరేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా వారి శ్రీమతి ఒక పాఠ శాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ట్రాం మీద ప్రయాణం చేసేవారు. ప్రతిరోజూ ఇంటివద్ద ఎవరినీ, సందర్శకులకు అనుమతించేది లేదు. ఎవరైనా ఆఫీసులో కలుసుకోవాల్సిందే.ఆగస్టు 8న మరణించిన బుద్ధదేవ్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ, కొత్తగా రాజకీయాలలోకి అడుగు పెడుతున్న యువతరం వారిని ఆదర్శంగా తీసు కోవాలని ఆకాంక్షి స్తున్నాను. – డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త, రాజ్యసభ మాజీ సభ్యులు -
అనామకంగా ఆరంభమై అభివృద్ధిపథంలో!
అది 1992 అక్టోబర్ 9. కోట్ల విజయ భాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు. హైదరాబాద్‌కు ఫోన్ చేస్తే, ఢిల్లీలోనే ఉన్నారని వర్తమానం. పీవీ క్యాబినెట్లో న్యాయశాఖ, కంపెనీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారప్పుడు. ఢిల్లీ నివాసానికి ఫోన్ చేస్తే, విజయ భాస్కరరెడ్డి ఫోన్ ఎత్తారు. ‘ఏమిటి సార్ ఈరోజే ప్రమాణ స్వీకారం అన్నారు. మీరింకా ఇక్కడే ఉన్నారేమిటంటే – ‘ఉదయం విమానం అందుకోలేక పోయాను. ప్రత్యేక విమానంలో వెళ్లబోతున్నాన’న్నారు. సరే వారిని అభినందించి, విజయవాడలో దంత వైద్య కళాశాల నెలకొల్పమని సలహా ఇచ్చాను. ‘ఊరుకో శివాజీ! నా ముందున్న ముఖ్యమంత్రి వైద్య కళాశాలల జోలికిపోయి ఉద్యోగం పోగొట్టుకొన్నాడు. నాకు ఈ సలహా ఇస్తున్నావు’ అన్నారు. ‘అది కాదులెండి, నేను హైదరాబాద్ వచ్చి వివరిస్తాను’ అని అప్పటికా సంభాషణ ముగించాను.మూడు నాలుగు రోజుల్లో హైదరాబాదు ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసి సవివరంగా వివరించాను. అప్పటికి అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఉస్మానియా వైద్య కళాశాలలో మాత్రమే దంత వైద్య విద్య ఉంది. దానిలో మొత్తం సీట్లు 32. అందులో 7 సీట్లు జమ్మూ–కశ్మీరుకు కేంద్ర ప్రభుత్వ కోటాలో పోతే... మిగిలిన 25 సీట్లలో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు వరుసగా 11, 6, 8 సీట్లు పంచుతారు. కనుక ‘విజయవాడలో హెల్త్ యూనివర్సిటీలో ఒక కళాశాల నెలకొల్పితే, మరొక 40 సీట్లు వస్తాయి. దానికి పెద్దగా నిధులు కూడా అవసరం ఉండదు కదా! మొదటి, రెండు సంవత్సరాల చదువుకు – అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బాక్టీరియాలజీ, ఫార్మకాలజీలకూ; వాటి నాన్క్లినికల్ సబ్జెక్టులకు వైద్య కళాశాలలోనున్న వసతులు సరిపోతాయి కదా.మూడో సంవత్సరం వచ్చేసరికి కాస్త అవుట్ పేషెంట్ పార్టులో ఓ 10, 15 డెంటల్ థియరీలు, కాస్త ఆపరేషన్ థియేటర్, ఇన్‌పేషెంట్లకు వసతి వంటివి ఏర్పాటు చేసుకోవడానికి నామమాత్రపు కేటాయింపులు సరిపోతాయ’ని చెప్పాను. వైద్య విశ్వవిద్యాలయం కులపతిగా ఉన్న డాక్టర్ లింగం సూర్యనారాయణను పిలిపించి, దానికి అవసరమైన నివేదిక తయారు చేయమని పురమాయించమని కోరాను. ఇది ప్రభుత్వ రంగంలో నెలకొంటుంది గనక అవినీతి ఆరోపణలకు తావుండదనీ చెప్పాను.ఈ సంగతి డాక్టర్ లింగం గారికి ముందుగానే తెలియజేస్తే – ‘అమ్మో! వారిని కలవడం మాటలా? నావల్ల కాదని’ కంగారుపడ్డారు. తరువాత రెండు, మూడు రోజులకు వారికి ఫోన్ చేసి చెప్పాను... ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కబురు వస్తుందనీ, కంగారు పడకుండా సవివరంగా నివేదిక తయారు చేసుకొని వెళ్లమనీ. ‘ఫోను వచ్చింది – శివాజీ ఈరోజే వెడుతున్నాను’ అని సెలవిచ్చారు. ముఖ్యమంత్రి ఆ నివేదిక పరిశీలించి వెంటనే ఐదు లక్షల రూపాయలు కేటాయించి, విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండు భవనాన్ని బదలాయించి, కాలేజీ మొదలు పెట్టమన్నారు.ఇకపై, ప్రభుత్వం నుండి నిధుల కోసం ఎదురు చూడకుండా, మీ కాళ్ల మీద మీరు నిలబడి కాలేజీ నడుపుకోవాలని కూడా హెచ్చరించారు. అలా 1992–93లో 40 వార్షిక ప్రవేశాలతో, విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ యాజమాన్యంలో ఈ కాలేజీ పురుడు పోసుకుంది. ఇది అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో, ద్వితీయ దంత వైద్య కళాశాల. హెల్త్ యూనివర్సిటీ మొత్తం అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు చెందింది కనుక, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దానిలో ప్రవేశాలకు అవిభక్త రాష్ట్రమంతటికీ అన్ని జిల్లాలకూ పది సంవత్సరాల పాటు అర్హత ఉంది. ఇప్పుడు ఆ గడువు ముగిసింది కనుక విభజిత ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యింది.ఇదిలా ఉండగా, డాక్టర్ లింగం పదవీ విరమణ తర్వాత వారి స్థానంలో డాక్టర్ సీఎస్ భాస్కరన్ వైస్ ఛాన్స్లర్ అయ్యారు. వారు బ్యాక్టీరియాలజీ ప్రొఫెసర్. వారికి హాస్పిటల్ పని, ఆపరేషన్లు, రోగులు, వైద్యం వంటి బాధ్యతలు ఉండవు. దానితో వారు అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి కేంద్రీకరించారు. గతంలో కూడా డాక్టర్ డి. జగన్నాథరెడ్డి, డాక్టర్ డి. భాస్కర్ రెడ్డి, డాక్టర్ హరినాథ్ వంటి వారు వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్గాను, వైద్య విద్యాశాఖ సంచాలకులుగాను బాగా రాణించారు. డాక్టర్ భాస్కరన్ విజయవాడలో ప్రైవేట్ ప్రాక్టీసులో ఉన్న సీనియర్ దంత వైద్యులను పిలిచి ‘ఈ కళాశాల అమ్మా, అబ్బా లేని అనాథ. మీరు ఈ ప్రాంతం వారు. ఇవి బతికి, బట్టగట్టేటట్లు కాపాడవలసిన గురుతర బాధ్యత మీ మీద ఉంది. జీతం–భత్యం ఆశించకుండా పని చేయండి’ అని విన్నవించారు. అలాగే పనిచేసి, వారు దాన్ని నిలబెట్టారు. అదే నేడు బీడీఎస్‌తో పాటుగా ఎమ్‌డీఎస్ కోర్సుల్లో కూడా తర్ఫీదునిస్తూ రాష్ట్రంలో అత్యుత్తమ కళాశాలగా నిలదొక్కుకుంది.– డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త, రాజ్యసభ మాజీ సభ్యులు -
విధానపర అంశాలపై విలువైన సంపుటి
డాక్టర్ యలమంచిలి శివాజీ రాసిన ఈ గ్రంథం గత ఐదు దశాబ్దాలలో వ్యవ సాయ రంగంలో ఆశించిన విధానపర అంశాలపై పేర్కొనదగిన వ్యాసాల సంపుటి. రైతుల పట్ల అమితమైన ఆవేద నను వ్యక్తపరుస్తూ రచయిత సాగునీరు, విద్యుత్, ఎరువులు, రుణసదుపాయం, పెరుగుతున్న అనుత్పాదక భూమి వంటి అనేక అంశాలను ప్రస్తావించారు. రైతులు అందిస్తున్న సేవలు, వారికి లభిస్తున్న ఫలితాల మధ్య గల అసంబద్ధతను పుస్తకం ప్రస్తావిస్తుంది. గత 71 ఏళ్ళల్లో తమ జీవనాధారం కోసం వ్యవసాయంపై ఆధారపడుతున్న వారి సంఖ్య కేవలం 71 నుండి 63 శాతానికి మాత్రమే తగ్గింది. గ్రామీణ ప్రాంతాల నుండి ఆదాయం పట్టణ ప్రాంతాలకు తరలిపోతున్నది. వ్యయం తగ్గించుకోవడం, సాంకేతికతను ఉపయోగించుకోవడం, ప్రాసె సింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై రైతులకు మార్గదర్శకం లేకపోవడం, వ్యవసాయ ఉత్ప త్తులకు గిట్టుబాటు ధరలు అందకపోవడంతో గ్రామీణ ఆదాయం తగ్గిపోయి, వ్యవసాయ రంగానికి అందవలసిన ప్రయోజనాలను చాలా వరకు పట్టణ ప్రజలే ఎగరేసుకుపోతున్నారు. అదే సమయంలో మెరుగైన జీవనం కోసం పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్న వారిని వాణిజ్య, పారిశ్రామిక రంగం అక్కున చేర్చుకోలేక పోవడంతో పట్టణ ప్రాంతాలలో పుట్టగొడుగుల వలే మురికి వాడలు పెరిగి పోతున్నాయి. ఈ ప్రక్రియను నిరోధించడం కోసం గ్రామీణ ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలని రచయిత సూచించారు. ఒక అధ్యాయంలో, రైతులు చాలావరకు ప్రగతిశీలురై, మెరుగైన సాంకేతికతను ఉపయోగిస్తున్న గుంటూరు జిల్లాల్లోని వ్యవసాయ పరిస్థితుల గురించి రచయిత వివరించారు. అధిక పెట్టుబడులతో వారు అనేక రకాల పంటలు పండిస్తున్నారు. కానీ చివరకు వారి ఉత్పత్తులను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వస్తున్నది. రచయిత భారత్, చైనాల మధ్య ఆసక్తికరమైన సారూప్య తను చూపారు. మన దేశంలో సాగులో ఉన్న భూమిలో 60 శాతమే ఉన్న చైనా పెద్దగా దిగుమతులు లేకుండానే తన ఆహార అవసరాలను తీర్చుకోగలుగుతున్నది. భారతదేశంలో వలె చైనాలో భూమి సారవంతమైనది కాదు. కానీ, ప్రభుత్వం రైతు లకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సాంకేతిక మద్దతు కారణంగా ఇది సాధ్యమైంది. దేశంలో వివిధ సమయాలలో, వివిధ ప్రాంతాలలో జరిగిన రైతు ఉద్యమాల చరిత్ర గురించిన తన అనుభవాలను శివాజీ పంచుకున్నారు. రైతుల సమస్యలను ప్రస్తావించడంలో ఈ రచయితకు గల అంకితభావం ప్రశంసనీయమైనది. నేటి తరాలకేగాక, భవిష్యత్ తరాల వారికి కూడా ఈ గ్రంథం విలువైన వనరుగా, మార్గదర్శిగా ఉండగలదు. నాకు ప్రవేశం లేని తెలుగులో రాసిన ఈ గ్రంథంలోని కొన్ని భాగాలను శివాజీ ఆంగ్ల అనువాదం అందించారు, భాషాపరమైన అవరోధం లేకుండా. ఈ గ్రంథానికి ముందు మాట రాయమని కోరడం నేను గౌరవంగా భావిస్తున్నాను. రైతుల పరిస్థితుల పట్ల హృదయాన్ని కదిలించివేసే రచయిత తీవ్రమైన ఆవేదన దాదాపు ప్రతి వ్యాసంలో ప్రతిధ్వనిస్తుంది. తన ప్రయత్నాలలో రచయితకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. (ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నేడు హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్న డాక్టర్ యలమంచిలి శివాజీ రచన ‘పల్లెకు పట్టాభిషేకం’కు విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి రాసిన ముందుమాట) ఎస్ఏ.బాడ్డే -
‘పంట విరామం’తోనే నాణ్యతకు భరోసా
పొగాకు పంటను స్థిరీకరించడంలో, రైతుకు మంచి లాభాలను అందించడంలో విశేషంగా తోడ్పడిన క్రాప్ హాలిడేను ఇతర వాణిజ్య పంటలకు కూడా వర్తింపచేయాల్సిన అవసరముంది. పొలం నుంచి ఓడరేవుకు చేరుకునేంతవరకు పంటల ఎగుమతి ప్రక్రియలో తప్పనిసరిగా అవసరమైన పంటల నాణ్యతను క్రాప్ హాలిడే ఎంతగానో మెరుగుపరుస్తుంది. పండ్లు, కూరగాయల పెంపకంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వీటిలో 40 శాతం ఇప్పటికీ వినియోగం లేక వృథాగా మిగిలి పోతున్నాయి. ఈ వృథాను అరికట్టడానికి గ్రామీణ ప్రాంతంలో శీతల గిడ్డంగులను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాల కల్పనను సమర్థంగా అమలు చేస్తే పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు జనం తిరిగి వలస పోవడానికి వీలు కల్పించినట్లవుతుంది. ఇరవై ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో పొగాకు పంటకు క్రాప్ హాలిడే (పంట విరామం) భావనను నేనే పరిచయం చేశాను. పంట దిగుబడిని క్రమబద్ధీకరించడం, పురుగులు తెగుళ్లను నియంత్రించడం దీని లక్ష్యం. ఏదైనా నిర్దిష్టమైన పంటను ఒక సంవత్సరం పాటు పండించకుండా ఉండటమే క్రాప్ హాలిడే అంటే. పంటను స్థిరీకరించడంలో, రైతులకు మంచి లాభాలను అందించడంలో క్రాప్ హాలిడే విశేషంగా తోడ్పడింది. క్రాప్ హాలిడే విధించిన తదనంతర సంవత్సరాల్లో పంట నాణ్యత కూడా మెరుగైంది. దేశంలో పెరుగుతున్న ఇతర వాణిజ్య పంటలకు కూడా క్రాప్ హాలిడే భావనను వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేసి అధికపంటను పొందవచ్చు లేక పురుగులు, తెగుళ్ల కారణంగా పంట దెబ్బతినిపోవడాన్ని నిరోధించవచ్చు. దేశానికి అవసరమైన పంటల గురించి సమగ్ర సర్వేని ప్రారంభించడం ద్వారా క్రాప్ హాలిడే భావనను వర్తింపచేయవచ్చు. పలురకాల పంటల ఉత్పత్తిలో భారత్ ప్రాధాన్య స్థానంలో ఉన్నప్పటికీ, ఆ పంటల ఎగుమతులు మాత్రం నిరుత్సాహకరంగా ఉన్నాయి. అధిక విలువ గల పంటలను పెంచడంలో భారత్ సామ ర్థ్యాన్ని పెంపొందించడానికి వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఒక సమగ్ర పథకం తీసుకునివస్తే అది రైతులకు ప్రయోజనకరంగా ఉండటమే కాదు.. విదేశీ ద్రవ్యమారకం ఆర్జించడంలో దేశానికి కూడా ఉపయోగపడుతుంది. పంటలను గుర్తించి వాటిపై విశేషంగా శ్రద్ధ పెట్టే క్రమంలో ఉత్తమ వ్యవసాయ విధానాల ద్వారా పంటల పరిమాణాన్ని, నాణ్యతను కూడా మెరుగుపర్చవచ్చు. పంట ఎగుమతికి నాణ్యతే కొలమానం ఎగుమతి కోసం ఓడరేవుకు చేరుకునేంత వరకు పంటల పరిమాణం లేక నాణ్యత ఏమాత్రం దెబ్బతినకుండా పంటను నిర్వహించుకోవడానికి అవసరమైనంత శిక్షణను ఈ పంటల ఉత్పత్తిదారులకు అందించాల్సి ఉంది. విధానాలను సరళీకరించి, సబ్సిడీ ధరలకే నాణ్యతా పరీక్షలను కల్పిస్తే ఎగుమతుల పెరుగుదలకు అది తోడ్పడుతుంది. పొలం నుంచి ఓడ రేవు వరకు పంటను తీసుకుపోవడానికి రైతు భరించిన ఖర్చులన్నింటినీ ఓడ రేవుకు పంట చేరుకున్న వెంటనే రైతుకు తిరిగి చెల్లిస్తే మరింత ముందడుగు వేసినట్లవుతుంది. దిగుమతిదారు చెల్లించే సేల్ ప్రోసీడింగ్స్ నుంచి తీసివేసి వాటిని రైతులకు చెల్లించవచ్చు. దిగుమతిదారు నుంచి క్రెడిట్ పొందడానికి వేచి చూస్తున్న రైతుకు దీంతో ఉపశమనం లభిస్తుంది కూడా. అంతేకాకుండా తమ ఉత్పత్తిని ఎగుమతి చేయడానికి పలువురు రైతులకు ఇది ఊతం కల్పిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులందరికీ సింగిల్ విండో సదుపాయాన్ని కల్పిస్తే అవసరమైన డాక్యుమెంటేషన్, లాంఛనాలను రికార్డు సమయంలో పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. రైతు తమ పంటను నిల్వచేయగానే రాష్ట్ర ప్రభుత్వ ఎగుమతుల శాఖ ద్వారా ఆ పంటల ఎగుమతి క్రమాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడైతే తమ పంటల ఎగుమతికి సంబంధించి రైతులు ఒక చోటి నుంచి మరొక చోటికి పరుగుతీయాల్సి వస్తోంది. దీంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయి. కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి కొత్త వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో, కాంట్రాక్టర్, రైతు కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండేందుకు ఒక యంత్రాంగం అవసరం. రైతు లేక స్పాన్సర్ ఎవరో ఒకరు కుదిరిన ఒప్పందాలను అతిక్రమిస్తున్నట్లు అనేక ఉదంతాలు బయటపడ్డాయి. మార్కెట్లో ధరలు చుక్కలంటినప్పుడు, రైతు తమ ఉత్పత్తిని కాంట్రాక్టుకు భిన్నంగా తన ఉత్పత్తిని బయట అమ్ముకుం టాడు. అలాగే తాము కుదుర్చుకున్న ధరకంటే తక్కువ ధరకు లభించే చోటనే వ్యవసాయ ఉత్పత్తులను కొనడానికి కాంట్రాక్టర్ కూడా పూనుకుంటాడు. ఈ క్రమరాహిత్యాన్ని అడ్డుకోవడానికి, కాంట్రాక్టు కంపెనీ/ వ్యక్తి ముందుగానే రైతుకు చెల్లిస్తామని చెప్పిన మొత్తంలో 50 శాతం మొత్తాన్ని రైతుకు చెల్లించివేయాల్సి ఉంది. కాంట్రాక్టు ప్రకారం తన పంటలో సగం భాగాన్ని రైతు సరఫరా చేసిన వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలి. దీంతో తమ మధ్య కుదిరిన ఒప్పందానికి ఇరుపక్షాలూ కట్టుబడటం సాధ్యపడుతుంది. అక్రమ నిల్వలను అరికట్టడం ఎలా? అత్యవసర సరుకుల చట్టాన్ని రద్దు చేసిన కొత్త బిల్లుకు సంబంధించి చూస్తే పంటల కొనుగోలుదారు తన వద్ద ఉన్న నిల్వ సామర్థ్యం పరిమితులను దాటి తాను కొన్న పంటను నిల్వ చేసుకునే అవకాశం అన్ని వేళలా ఉంటుంది. మరిన్ని గోడౌన్లను లీజుకు తీసుకుని పంటను అధికంగా నిల్వ చేయవచ్చు. దీనిద్వారా అతడు సరుకుల కొరతను సృష్టించి తద్వారా ఆ పంటకు అధిక ధర పొందగలడు. ఇలాంటి పరిస్థితిని నిరోధించడానికి, తమ వద్ద ఉన్న నిల్వ సామర్థ్యం గురించి కొనుగోలుదారులు తప్పనిసరిగా ప్రకటించాలని ఆదేశించాలి. ఇలా అయితే అక్రమ నిల్వలను అరికట్టవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కొనుగోలుదారు అదనపు నిల్వ సామర్థ్యానికి దరఖాస్తు చేసుకుని పంట ఉత్పత్తులను సేకరించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సేకరణ కార్యకలాపాలన్నీ ఏపీఎమ్‌సీ ప్రాంగణంలో మాత్రమే జరగాలి. అప్పుడు మాత్రమే పంటల రాక, ధరలు, విక్రేతల గుర్తింపును నజావుగా నిర్వహించవచ్చు. దీనివల్ల ప్రస్తుత మార్కెటింగ్ మౌలిక వ్యవస్థను, మానవ శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సరఫరా స్థాయిలను ప్రభావితం చేసేటటువంటి వాణిజ్యపరంగా ప్రాధాన్యత గల పంటలు, అవి పండే అవకాశమున్న ప్రాంతాలకు సంబంధించి సరుకు పరిస్థితిపై నివేదికలను సిద్ధం చేయాలి. ఈ నివేదికలను నిజ సమయ డేటాతో నవీకరించాలి. ఇది ఒక సరుకు కొరతను, లేక అధిక సరఫరాను గుర్తించడంలో ముందుగానే అవగాహనను కల్పించడమే కాకుండా అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలోనూ తోడ్పడుతుంది. సరుకు సరఫరా తక్కువగా ఉన్నప్పుడు లేక అధిక సరఫరా జరిగినప్పుడు దిగుమతి చేసుకోవడం లేక సేకరించడంపై ప్రభుత్వం తగు చర్య తీసుకోవచ్చు. ఇప్పుడయితే ఈ రెండు చర్యలను ప్రభుత్వం చాలా ఆలస్యంగా చేపడుతుండటంతో రైతుల్లో నిస్పృహ ఏర్పడుతోంది. అపరిమిత స్థాయిలో పంటల వృథా! పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశానికి ఉన్న సామర్థ్యాన్ని పరిశీలిస్తే, వీటి ఎగుమతుల నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు. తగిన పరిమాణంలో నాణ్యమైన ఉత్పత్తి సాధ్యపడే ప్రాంతాల్లో ఉత్పత్తి సంస్థలకు తగిన పెట్టుబడి, శిక్షణ, సబ్సిడీ మద్దతును కల్పించి మెరుగైన చెల్లింపులు చేసే దేశాలకు ఆ ఎగుమతులను పంపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయల పెంపకంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వీటిలో 40 శాతం ఇప్పటికీ విని యోగం లేక వృధా అవుతున్నాయి. భారత్‌లో ఇలాంటి వృథా ఏ స్థాయిలో ఉంటోందంటే అది ఆస్ట్లేలియా మొత్తం ఉత్పత్తికి సమానంగా ఉంటోంది. ఇలాంటి పంటల వృథాను అరికట్టడానికి గ్రామీణ ప్రాంతం మొత్తంగా శీతల గిడ్డంగులు, కోల్ట్ చైన్స్‌ని విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. రైతుల సంక్షేమానికి, గ్రామీణాభివృద్ధి కోసం ప్రతి ఏటా కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నాయి. దీన్నుంచి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి అని మదించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికోసం నీతి ఆయోగ్, జాతీయ గణాంకాల సంస్థ, ప్రధాన ఆర్థిక సలహాదారు వంటి వారిని పురమాయించాలి. ఆ విధంగానే ప్రభుత్వం సరైన రీతిలో సంక్షేమ నిధుల ఖర్చు వ్యవహారాలను మదించి ఉత్తమ ఫిలితాలను సాధించవచ్చు. రివర్స్ వలసకు అదే కీలకం గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నత వృత్తివిద్యా కోర్సులను చదివే అవకాశాలను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పొందలేకపోతున్నారు. కాబట్టి దేశంలోని అన్ని వృత్తి విద్యా కళాశాలల్లో కనీసం 15 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించాలని నేను సూచిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో అయిదేళ్లు చదివిన వారు ఈ సీట్లను పొందడానికి పరీక్షలో అర్హత సాధించాలి. పీయూఆర్‌ఏ (గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కల్పన) భావనను ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో అమలు చేయాలి. దీనివల్ల పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తిరిగి వలస పోవడానికి వీలు కల్పించినట్లవుతుంది. (2021–22 బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖామంత్రికి పంపిన సూచనల సారాంశం) వ్యాసకర్త: డాక్టర్ యలమంచిలి శివాజీ, రాజ్యసభ మాజీ ఎంపీ, కిసాన్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు మొబైల్: 98663 76735 -
కౌన్సిల్ అవసరమా?
మన రాష్ట్రంలో విధాన పరిషత్తు (లెజిస్లేటివ్ కౌన్సిల్) భవితవ్యంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్నది. విధాన పరి షత్తు స్వభావ స్వరూపాలను ఈ సందర్భంలో చర్చించుకొనడం అవసరం. విధాన పరిషత్తుల చట్టం ద్వారా 1958 జూలై మొదటి తేదీ నుండి మన రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు చేయబడింది. మనకు జూలై 1958లో కౌన్సిల్ ఏర్పడింది. అంతకు ముందు లేదు. కర్నూలు రాజధానిగా అవతరించిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో కూడా లేదు. శాసనమండలికి వాస్తవంలో ఏవిధమైన అధికారాలు లేవు. శాసనసభ అంగీకరించిన బిల్లుకు శాసనమండలి సవరణలు చేసినా, తిరస్కరించినా, లేక పరిషత్తుకు సమర్పిం చబడిన తేదీ నుండి ఆ బిల్లు ఆమోదింపబడకనే మూడు మాసాలు దాటిపోయినా తిరిగి శాసనసభ దానిని పరిశీలించి మార్పులు చేర్పులతో లేదా యధాతధంగా తిరిగి ఆ బిల్లును రెండవసారి పాస్ చేసి మళ్ళీ పరిషత్తుకు పంపడం జరుగుతుంది. అప్పుడు ఆ బిల్లును పరిషత్తు త్రోసిపుచ్చినా, లేక ఆ బిల్లు పాస్ చేయకుండా ఒక మాసం పాటు అలాగే మిగిలిపోయినా శాసనసభ అంగీకరించని సవరణలతో పరిషత్తు దానిని పాస్ చేసినా శాసనసభ రెండవమారు బిల్లును ఏ రూపంలో పాస్ చేసిందో అదే రూపంలో శాసనమండలిలో కూడా పాస్ చేయబడినట్లు భావించబడుతుందని రాజ్యాంగంలోని 197వ అనుచ్ఛేదము చెబుతున్నది. అయితే ద్రవ్య సంబంధమైన బిల్లుల విషయంలో ఇంతమాత్రం ప్రాముఖ్యత కూడా శాసనమండలికి లేదు. విధాన పరిషత్తు సభ్యుల జీతభత్యాలకు అమితమైన వ్యయం తప్పదు. నెల జీతం రూ. 600, నియోజకవర్గం అలవెన్సు 300, ఫోనుకు వంద రూపాయలు. సభ్యుల దంపతులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మొదటి తరగతికి ఒకటిన్నర రెట్లు ప్రయాణ భత్యం. రోజుకు రూ.45 దినభత్యం. సంవత్సరానికి మూడువేల రూపాయలు కిమ్మత్తు చేసే రైల్వే కూపనులు, వైద్య సౌకర్యం, ప్రభుత్వ అతిథి గృహాలలో వసతుల వంటి సౌకర్యాలనేకం. ఎం.ఎల్.ఎ. హాస్టళ్ళలో వీరికి జాగా చూపవలసిందే. రైల్వే కూపనులకు మారుగా నెలకు రూ.300 రొక్కంగా ఇవ్వమంటున్నారీ మధ్య. ఇవికాక, శాసనమండలి సమావేశాల ఏర్పాటుకు, ప్రసంగాలను అచ్చు వేయడానికి, సిబ్బందికి, ఇతరత్రా మరింత వ్యయం. ఇంకా శాసనమండలికొక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉంటారు. వారికి కారు, ఫోను, సిబ్బంది వంటి సదుపాయాల కోసం మరొక మోపెడు ఖర్చులు. రాష్ట్ర ప్రజానీకం అసలు ఆశయాలు, అభీ ష్టాలు నెరవేర్చాలనే మహదాశయంతో నందమూరి నాయకత్వాన ‘తెలుగుదేశం’ విశేష జనాదరణతో అధికారంలోనికొచ్చింది. అయితే ప్రస్తుతం శాసనమండలిలో ప్రభుత్వ పక్షానికి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టే సభ్యుడు కూడా లేడు. ఉమా వెంకట్రామిరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి జి. జగన్నాథరావు ఖాళీ చేసే స్ధానాలు త్వరలో అధికార పక్షానికి రాగలవు. పెద్దఎత్తున పార్టీ మార్పిడులు జరగకపోతే ప్రస్తుత ప్రభుత్వం చేపట్టనున్న అభ్యుదయ పథకాలన్నిం టికి శాసనమండలి పెద్ద ప్రతిబంధకంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు. పార్టీ మార్పిడులను ఎంతమాత్రం ప్రోత్సహించని వజ్రసంకల్పుడు ముఖ్యమంత్రి నందమూరి. అటువంటప్పుడు ఈ యిబ్బందిని అధిగమించడానికి శాసనమండలిని రద్దు గావించడం వినా మార్గాంతరం లేదు. కొత్త మంత్రివర్గంలో అధిక శాతం యువకులు, కొత్తవారు, అనుభవం లేనివారు, కల్మశం అంతకన్నా లేనివారు. ఇక శాసనమండలిలో మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డితో సహా పెక్కుమంది మాజీలు ఉన్నారు. వారికి పాలనా రంగంలోని లొసుగులన్నీ కరతలామలకం. తమ వాగ్ధాటితో, కొంటె ప్రశ్నలతో యువకులైన మంత్రులను వీరు ఇబ్బంది పెట్టే అవకాశం లేక పోలేదు.అందువల్ల ఏ కోణం నుండి చూసినా శాసనమండలి రద్దు అనేది అత్యంత అభిలషణీయం. కొత్త ప్రభుత్వానికి దీనివల్ల వెసులుబాటు ఎక్కువవడమే కాక ప్రజాధనం పన్ను చెల్లించే పేదవాని ధనం దుబారా కాకుండా కొంతవరకైనా నివారణకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ చర్యకు జనాదరణ మిక్కుటంగా లభిస్తుందనడంలో సందేహం లేదు. (నాటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయ డంపై అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేసిన విస్పష్ట ప్రకటనపై స్పందిస్తూ వ్యాసకర్త 19–01–1983న ఒక పత్రికలో రాసిన వ్యాసానికి సంక్షిప్త రూపం) డా. యలమంచిలి శివాజి వ్యాసకర్త రాజ్యసభ మాజీ ఎంపీ మొబైల్ : 98663 76735 -
సాగు అంచనాపై అలసత్వమే అసలు ప్రమాదం..!
వ్యవసాయరంగ సమస్యలపై బడ్జెట్ ముందస్తు చర్చలకు గాను నన్ను ఆహ్వానించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక విషయానికొస్తే చుక్కలంటుతున్న ఉల్లి ధరలను ప్రస్తావించకుండా ఈరోజుల్లో ఏ చర్చా సంపూర్తి కాదు. కొన్ని నెలల క్రితం కిలోకి 10 నుంచి 20 రూపాయలుగా ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రూ. 200లకు చేరడంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఉన్న ప్రభుత్వాలు ఎప్పటిలాగే, ఉల్లి దిగుమతులు, సబ్సిడీ ధరలకు ఉల్లిపాయలను సరఫరా చేయడంపై యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ తమ ఆధార్ కార్డును సమర్పించి కిలో ఉల్లిపాయలు కొనడానికి పొడవాటి క్యూలలో నిలబడి వేసారిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినిపోవడం, అదే సమయంలో డిమాండ్ మాత్రం యధాతథంగా ఉండటంతో ఉల్లిధరలు భారీగా పెరగడం వాస్తవం. దీనికితోడుగా వ్యాపారులు కృత్రిమంగా నిల్వ చేయడంతో ఉల్లిధరలు చుక్కలంటి దేశమంతా గగ్గోలు బయలుదేరింది. దేశంలో ఉల్లి పంటల ఉత్పత్తి పరిమాణంపై నిర్దిష్టమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటే ముందస్తు చర్య తీసుకోవడానికి వీలవుతుందని ఉల్లి సంక్షోభం మంచి గుణపాఠాలను అందించింది. భారీగా పంట పండటంతో ధరలు పూర్తిగా పడిపోయిన కారణంగా తక్కువ ధరలకు పంటలు అమ్ముకోవడం, పండిన పంటను నేలపాలు చేయడం వంటి ఘటనలు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఉల్లిపాయల ఉత్పత్తి తగ్గుముఖం పడుతోందని తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా ఉల్లి దిగుమతులకు పూనుకుంటే ధరలు ఈ స్థాయిలో పెరిగేవి కావు. ఉల్లిధరలు పెరగ్గానే దేశవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నప్పటికీ ఉల్లిధరలు పడిపోయినప్పుడు రైతుకోసం ఏ ఒక్కరూ చుక్క కన్నీరు కార్చకపోవడాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అనేక వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తోంది కానీ వరి, గోధుమ, పత్తి వంటి కొన్ని పంటలకు మినహాయిస్తే మిగిలిన పంటల విషయంలో దాన్ని అమలు చేయడానికి తగిన యంత్రాంగం కానీ, వనరులు కానీ లేవు. వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు: రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ శిస్తుపేరిట వేల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయి కానీ మార్కెట్ యార్డుల్లో సౌకర్యాలకు కేటాయించడానికి బదులుగా దాన్ని జనరల్ పూల్‌కి దారిమళ్లిస్తున్నాయి. వసతుల లేమితో రైతులు తమ పంట లను ఆరుబయట స్థలాల్లో నిల్వచేసి వర్షం, వరదల సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ వృత్తులకు భీమా: ప్రతి ఏటా ఏదో ఒక పంట చేతికి రాక తల్లడిల్లిపోతున్న రైతుల క్షేమం కోసం వ్యవసాయ బీమాలో కీలక సంస్కరణలు తీసుకురావాలి. సన్నకారు, చిన్నకారు రైతులకు పంట బీమాను కల్పించడమే కాకుండా ప్రభుత్వమే దాని ప్రీమియం చెల్లించాలి. బీమా కంపెనీ లకు మాత్రమే లాభాలు అందిస్తున్న ప్రస్తుత వ్యవసాయ బీమా విధానాన్ని పూర్తిగా సంస్కరించాలి. సాధారణ వ్యవసాయ సమస్యలు: వాస్తవ సాగుదారులకు వివిధ పథకాలను అనువర్తించి అమలు చేయగల సాంకేతిక జ్ఞానాలను తీసుకురావాలి. వ్యవసాయంలోకి యువతను ఆకర్షించడానికి ప్రత్యేక పథకాలను చేపట్టాలి. భారత్‌లో వ్యవసాయ పరిశోధనను పునరుజ్జీవింప జేయాలి. రైతు ప్రధాన పరిశోధనకు నిధులు అధికంగా కేటాయించాలి. ఇది మాత్రమే ఈ దేశ రైతులకు ప్రయోజనం కలిగిస్తుంది. వ్యాసకర్త : డా. యలమంచిలి శివాజి, రాజ్యసభ మాజీ ఎంపీ మొబైల్ : 98663 76735 -
‘క్రాప్ హాలిడే’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్
సాక్షి, విజయవాడ : వ్యవసాయం సరిగా లేకపోతే మనిషి మనుగడ సరైన దారిలో ఉండదని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ‘క్రాప్ హాలిడే’ పుస్తకాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, రైతు దేశానికే వెన్నుముక అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా పథకం ప్రవేశ పెట్టిందని, రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. క్రాప్ హాలిడే పుస్తకం భగవద్గీత వంటిది క్రాప్ హాలిడే అనేది రైతుల్లో ఒక మేలు కొలుపులా పని చేసిందని అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. శివాజీ లాంటి మనిషి మనకు దొరకడం అదృష్టమన్నారు. రైతు సమస్యలపై పార్లమెంటులో అనేక పోరాటాలు చేశారని, రైతు సమస్యలపై అన్ని పార్టీల వారిని ఏకం చేసేవారని ప్రస్తవించారు. వ్యాపారవేత్తల చేతిలో పొగాకు రైతులు ఎలా మోసపోయారనే విషయాన్ని పుస్తకంలో స్పష్టం చేశారన్నారు. పొగాకు రైతులు తమ సమస్యలు నుంచి ఎలా బయట పడలనే విషయాన్ని కూడా వివరించారని, రైతు సమస్యలపై ప్రభుత్వాలకు అనేక సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. రైతులకు సంబంధించినంత వరకు క్రాప్ హాలిడే పుస్తకం అనేది భగవద్గీత వంటిదన్నారు. రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి: యలమంచిలి పది కోట్ల మందికి పైగా రైతులు వ్యవసాయ చేస్తుంటే అందులో పొగాకు పండించేవారు లక్షల్లోనే ఉన్నారని యలమంచిలి శివాజీ తెలిపారు. పొగాకు కోసం పార్లమెంటులో పోరాటం చేస్తే అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపేవని, గతంలో ఎన్నడూ పొగాకు రైతు క్రాప్ హాలిడే చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. పొగాకు రైతులు సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నాదని, పారిశ్రామిక వేత్తలకు ఇబ్బందులు తలెత్తితే దేశంలో అందరూ స్పందిస్తున్నారని, అదే రైతులకు నష్టం వస్తే మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వాలు మరింతగా ఆదుకోవాలని సూచించారు. -
హీరో తన కొడుకును హీరోనే చేయాలనుకుంటున్నాడు
సాక్షి, కృష్ణా : యలమంచిలి శివాజీ రచించిన ‘ఆరుగాలం’ , బ్రహ్మ శ్రీ పోలూరి హనుమజ్జానకీరామ శర్మ రాసిన ‘జీవితము-సాహిత్యము’ అనే పుస్తకాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. తనకు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండటం ఇష్టమని ఆయన అన్నారు. యలమంచిలి ఓ అలుపెరగని యోధుడని చెప్పారు. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యవసాయానికి కావాల్సినంత ప్రాధాన్యత లభించలేదని అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీని విమర్శించనని చెప్పారు. అది తన పని కూడా కాదని అన్నారు. రైతుని రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భారత రైతులు పంటలు పండిస్తున్నారని, అందుకు భారత రైతులకు సెల్యూట్ చేయాలన్నారు. ‘ఓ రాజకీయ నాయకుడు తన తనయుడికి మాట్లాడటం రాకపోయినా, అతన్ని రాజకీయ నాయకుడిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. సినిమా నటుడు అతని తనయుడికి ముఖం బాగా లేకపోయినా హీరోని చేయాలనుకుంటున్నాడు. కానీ ఒక రైతు తన కొడుకును రైతుగా చేయాలనుకోవట్లేదు. అలాంటి పరిస్థితులు వ్యవసాయంలో నెలకొన్నాయి. నేను ఉపరాష్ట్రపతి అయ్యాక నియమ నిబంధల ప్రకారం ప్రజల్లో ఉండలేకపోతున్నాను. అందుకని ఆ నియమ నిబంధనలను కొంత సవరించాను. మూడు కార్యక్రమాలను నిర్ణయించుకున్నాను. ఒకటి దేశ యూనివర్శిటీలన్నీ తిరిగి యువతకి మార్గదర్శకం చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనా కార్యాలయాలకు వెళ్లి పరిశీలించి ప్రోత్సహించాలి. వ్యవసాయదారులని కలవటం, లాభసాటి విధానంపై దృష్టి సారించాలి.’ -
రాష్ట్రాల చేతికి ‘గిట్టుబాటు ధర’
సందర్భం బడ్జెట్ గురించి చర్చించడానికి ఏర్పా టైన ఈ సమావేశానికి నన్ను ఆహ్వా నించినందుకు కేంద్ర ఆర్థికమంత్రికి ధన్యవాదాలు చెబుతూ, ఈ సమా వేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను, వెలువడిన సూచనలను పరిగణన లోనికి తీసుకుని విలువనిస్తారని ఆశిస్తున్నాను. వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, ప్రధానంగా రాజ్యసభలో వ్యావసాయిక అంశాలు మాట్లాడిన సభ్యునిగా దేశంలో సేద్యం స్థితిగతులను ఈ సమావేశం దృష్టికి తీసుకువస్తున్నాను. భారత్ వెలిగిపోతున్నదని, ప్రపంచంలోనే అత్యున్నత పెరు గుదల రేటును సాధించిందని మనం గట్టిగా చెప్పవచ్చు. అయినప్పుటికి దేశంలోని చాలా ప్రాంతాలలో రైతులు నిరాశా నిస్పృహలకు లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత విషాదకరం. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) ఇచ్చిన వివరాల ప్రకారం 2014లో 5,650 మంది రైతన్నలు బల వన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు సరైన వివరాలు ఇవ్వకుండా వాస్తవాలు దాచి పెడుతున్నాయి. రాష్ర్ట ప్రభుత్వాలు చెబుతున్న సంఖ్య కంటే రైతు మరణాలు వాస్తవంగా ఎక్కువే ఉంటాయని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. ఇలా రైతులు ఎందుకు అర్ధంతరంగా జీవితాలను అంతం చేసుకుంటున్నారు? సేద్యం ఏమాత్రం లాభసాటిగా లేకపోవ డమే ఇందుకు ప్రధాన కారణం. స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడిచిపోతున్నప్పటికీ, సేద్యం అంటే నేటికీ రుతు పవనాలతో ఆడే జూదంగానే మిగిలిపోయింది. దేశంలోని చాలా ప్రాంతాలు అటు దుర్భిక్షంతో లేదా వరదలతో ఏటేటా విధ్వం సకర స్థితిని ఎదుర్కొంటున్నాయి. పొలాలలో వేసే ఎరువులు, క్రిమిసంహారకాలు, నీటి పారుదల, విద్యుత్ సౌకర్యానికి అయ్యే వ్యయం అపారంగా పెరిగాయి. కానీ అందుకు తగ్గట్టుగా వ్యవ సాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు మాత్రం పెరగడం లేదు. దీని ఫలితంగానే పెద్ద సంఖ్యలో రైతాంగం అప్పుల పాలవు తున్నారు. ఈ రుణ బాధ నుంచి బయటపడే మార్గం కనిపించ కపోవడంతోనే వారు బలవన్మరణాలను ఆశ్రయిస్తున్నారు. ఈ మొత్తం దుష్పరిణామాలలో మరో విషాదకోణం ఏమి టంటే, రాష్ట్రాల ప్రభుత్వాలు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నామమాత్రంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు జరిగితే హుటాహుటిన పరామర్శకు పరుగెత్తే మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రైతులు ఆత్మహత్య చేసు కుంటే మాత్రం ఏమీ పట్టనట్టు ఉండిపోతున్నారు. రైతాంగానికి భవిష్యత్తు పట్ల ఆశావహమైన మాటలు చెప్పేవారే కరువ వుతున్నారు. ఇలాంటి వాతావరణాన్ని నివారించడానికి తక్షణమే తీసు కోగలిగిన కొన్ని చర్యల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను. ఉదాహరణకి వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటన విషయం తీసుకుందాం. 27 రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఈ మద్దతు ధర ప్రకటన వ్యవహారం చాలా అసహజంగా కనిపిస్తుంది. ఉత్పత్తి వ్యయాలు ఒక రాష్ట్రానికీ వేరొక రాష్ట్రానికీ మారడమే కాదు, నిజానికి ఒకే రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాలలో వేర్వేరుగా ఉంటాయి. దీనికితోడు వరి, గోధుమ, పత్తి పంటలకు ప్రకటించిన మద్దతు ధరలను అమలు చేసే బాధ్యత భారత ఆహార సంస్థ, సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) చేతులలో ఉంచారు. పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇవ్వవలసిందని నేను సూచిస్తు న్నాను. ఎందుకంటే కేంద్రం కంటే రాష్ట్రాల ప్రభుత్వాలకే వ్యవసాయోత్పత్తులు జరిగే క్షేత్రాల వివరాలు ఎక్కువగా తెలు స్తాయి. అలాగే ఆ ఉత్పత్తుల ధరలను నిర్ధారించడంలో కేంద్రం కంటే రాష్ట్రాలే మరింత వాస్తవికంగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర ఎక్కువగా ఉంటే, తమ తమ వనరుల నుంచే రాష్ర్ట ప్రభుత్వాలు చెల్లించే ఏర్పాటు చేయాలి. నిజానికి వ్యవసా యోత్పత్తులలో తీవ్రమైన పతనం ఉంటే కనీస మద్దతు ధర మేరకు ఉత్పత్తుల సేకరణ జరిగినప్పటికీ రైతులు రుణ విముక్తులు కాలేరు. దుర్భిక్షం, వరదలు, తెగుళ్లు, చీడపీడల కారణంగా ఉత్పత్తి తగ్గడానికి ఎప్పుడూ అవకాశాలు పొంచి ఉంటాయి. నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులు వారికి వారే బయటపడాలి. అదే ఒక పరిశ్రమ ఖాయిలా పడితే ఆ పారి శ్రామికవేత్తను, అతడి మీద ఆధారపడిన కార్మికులను ఆదు కోవడానికి ప్రభుత్వమే ముందుకు వస్తుంది. పన్నులు, సుంకాలు మాఫీ చేయడం, ఎంతో కొంత ఒకేసారి బ్యాంకు రుణం చెల్లించే ఏర్పాటు వంటి సౌకర్యాలు ఉంటాయి. రైతుల విషయంలో ఎంతో ఆడంబరంగా ప్రకటించిన పంటల బీమా పథకం కూడా వారికి అక్కరకు రావడం లేదు. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి పంట ధ్వంసమైన తీరు మీద ఆధా రపడి అది చెల్లిస్తారు. పంటల బీమాను కొంచెం సర్దుబాటు చేయ లేమా? ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకు, పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదా? అలాగే, వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం రాని రీతిలో, ఆ రంగానికి కార్మికుల కొరత లేని పద్ధతిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి. ప్రతి పంచాయతీ కార్మికుల వివరాలను నమోదు చేసుకుంటూ పొలం పనుల సమయంలో రైతులకు ఆ కార్మికులను పంపే ఏర్పాటు చేయవచ్చు. పొలం పనుల సీజన్ ముగిశాక ఇతర పనులకు నియోగించవచ్చు. కార్మికులు ఎవరైనా పొలం పనులకు వెళ్ల డానికి నిరాకరిస్తే వారిని ఈ జాబితా నుంచి తొలగించి, వేరే జీవనోపాధి చూపాలి. అటు భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కళ్లం దగ్గర పలికిన ధరకూ, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని బాగా తగ్గించాలి. మధ్య దళారుల ప్రమేయాన్ని అదుపు చేయాలి. ఇటీవల ఏం జరిగిందో అంతా గుర్తు చేసుకోవాలి. తృణధాన్యాల ధరలు ఆకాశాన్నంటినప్పటికీ, మార్కెట్లో పలికిన ధరలో 20 శాతం కూడా రైతుకు దక్కలేదు. వస్తువుల తయారీ రంగంలో 1991 నుంచి భారత ప్రభుత్వం లెసైన్స్ రాజ్‌ను పటాపంచలు చేసింది. అయితే సరళీకరణ గాలులు ఇప్పటికీ వ్యవసాయరంగాన్ని తాకలేదు. వ్యవసాయోత్పత్తులకు గిరాకీ ఉన్న మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్ఛకు రైతులు ఇప్పటికీ నోచు కోలేదు. అయితే పారిశ్రామికవేత్తలకు ఈ విషయంలో ఎంతో స్వేచ్ఛ ఉంది. మొత్తం భారత మార్కెట్‌ను రైతుల మార్కెట్‌గా గుర్తించాలని కోరుతున్నాను. వినియోగదారుల పేరుతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు రైతుకు చేటు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు, ఆస్పత్రులు అందు బాటులోకి తేవడంతో పాటు, పరిశుభ్రమైన తాగునీరు, మంచి పారిశుధ్యం ఏర్పాటు చేసి అక్కడ నుంచి వలసలను అరికట్ట వలసిందిగా రాష్ట్రాలకు కేంద్రం సూచించాలి. వలసలు ఎక్కువ కావడం వల్ల చాలా పట్టణాలు, నగరాలలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. పల్లెలు కేవలం వృద్ధుల ఆవాసాలుగా మిగిలిపోతున్నాయి. గ్రామాలను నివాసయోగ్యాలుగా మలుచు కుంటే తప్ప వలసలను ఆపలేమన్న సంగతిని అంతా గమనించాలి. (జనవరి 4, 2016న జరిగిన బడ్జెట్ అంచనాల ముందస్తు సమావేశంలో సమర్పించిన పత్రంలోని అంశాలు. రైతుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ పత్రం సమర్పించారు.) (వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నేత) డా॥యలమంచిలి శివాజి -
పోరాటాలతోనే ప్రత్యేక హోదా
రాష్ట్ర సదస్సులో పలువురు వక్తలు మంగళగిరి : పోరాటాలతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాలని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కల్యాణమండపంలో ఆదివారం ప్రత్యేక హోదాపై నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించలేకపోతే అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతామని చెప్పారు. రాజకీయాలకతీతంగా పోరాడి హోదా సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హోదా కోసం రాజకీయపార్టీలన్నీ ఏకమై పోరాడాల్సిన అవసరముందని తెలిపారు. భావితరాలకు అన్యాయం చేసిన వారిగా చరిత్రలో మిగిలిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాపై హామీ ఇస్తే చట్టంతో సమానమని గుర్తించాలన్నారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్యాకేజీ చాలని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటివరకు విభజన చట్టంలోని ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సమంజసం కాదని తెలిపారు. అఖిపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హోదాసాధనకు కృషి చేయాలని కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటి మాజీ వీసీ కె.వియన్నారావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి రెండేళ్ళు కావస్తున్నా విభజన చట్టంలోని ఒక్క హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వాలపై పౌరసమాజం పోరాడాలని పిలుపునిచ్చారు. నాన్‌పొలిటికల్ జేఏసి కన్యీనర్ అప్పికట్ల శ్రీహరినాయుడును రాష్ట్రనాన్పొలిటికల్ జేఏసీ కన్యీనర్గా ఎన్నుకున్నారు.కార్యక్రమంలో జేఏసీ నాయకులు వీవీ ప్రసాద్, వీవీ వెంకటేశ్వరావు, రాజశేఖర్, ఏటుకూరి గంగాధరరావు, పద్మావతి, ఉమాశ్రీ, అయ్యస్వామి, కోటేశ్వరావు, చెన్నా అజయ్‌కుమార్, సింహాద్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సర్కారు
* ‘రాజధాని - రైతు’ చర్చావేదికలో ధ్వజమెత్తిన అన్నదాతలు * ప్రజాభిప్రాయం తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి * చట్టాలు చేసిన తరువాత మాత్రమే భూ సమీకరణ జరపాలి * విజయవాడ, గుంటూరు నగరాల్లో ఖాళీగా ఉన్న భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి * భూములిచ్చేందుకు తుళ్లూరు మండల రైతులు సిద్ధంగా ఉన్నారన్న నేతలు సాక్షి, గుంటూరు: ప్రభుత్వం రాజధాని నిర్మాణం విషయంలో ఏకపక్షంగా కాకుండా ప్రజాభిప్రాయం సేకరించిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని పలువురు వక్తలు, రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని అరండల్పేటలోగల ఒక కల్యాణమండపంలో గురువారం ‘రాజధాని-రైతు’ అంశంపై ఫ్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జంప కృష్ణకిషోర్ నేతృత్వంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు, రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో రైతులను గందరగోళంలోకినెట్టి భూసమీకరణ జరపాలని చూడడం సమంజసం కాదని, రాజధానిగా మారిన తరువాత వచ్చే ఇబ్బందులు ముందుగానే గ్రహించి చర్యలు చేపట్టాలని, అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో కాకుండా అన్ని జిల్లాలకు ప్రాధాన్యం కల్పించేలా ముఖ్య కార్యాలయాలు, అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చూడాలని ఈ సందర్భంగా తీర్మానించారు. రాజధాని ఎన్ని ఎకరాల్లో నిర్మాణం అవుతుందో, రైతులకు ఎలాంటి ప్యాకేజీలు ఇస్తారో వెల్లడించాలనీ, చట్టాలు చేసిన తరువాత మాత్రమే భూ సమీకరణ జరపాలని తీర్మానించారు. ఒకవైపు విద్యుత్ కాలుష్యం, మరోవైపు రాజధాని కాలుష్యం కృష్ణా నదిలో కలిస్తే పర్యావరణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఖాళీగా ఉన్న భవనాల్లో ప్రభుత్వం నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాజధాని నిర్మించేలా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. ఎక్కువ మంది రైతులు భూసమీకరణకు వ్యతిరేకంగా ఉండటంతో అనుకూలంగా రైతులు అభిప్రాయం వెల్లడించినప్పుడల్లా కొంతసేపు గందరగోళం నెలకొంది. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి కలుగజేసుకొని చర్చావేదికలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చని, వ్యక్తిగత దూషణలకు, ఆరోపణలకు దిగవద్దంటూ సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం, భూ సమీకరణపై రైతుల్లో అనేక అపోహలు, అనుమానాలు, సందేహాలు ఉన్నాయని చెప్పారు. భూమిని సమీకరించాల్సి వస్తే వాటిని కోల్పోయేవారితోపాటు, రైతు కూలీలు, చేతివృత్తుల వారికి కూడా నష్టం జరగకుండా ఉండేందుకు 2012లో భూసేకరణచట్టం తయారు చేసి 2014 జనవరి 1 నుంచి అమలులోకి తెచ్చారని చెప్పారు. రాజధాని అవసరం ఎంత ఉందో, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం అంతే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భూములిచ్చేందుకు రైతులు సిద్ధం రైతులకు, భూములకు గతంలో ఉన్న అనుబంధం ఇప్పుడు కనిపించడం లేదని, చాలామంది వ్యవసాయాన్ని వదిలిపెట్టేందుకు, రాజధాని నిర్మాణానికి సుముఖంగా ఉన్నారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. తుళ్ళూరు మండలంలో పంటలు పండక అనేకమంది రైతులు అప్పుల పాలయ్యారని, ఈ నేపథ్యంలో రాజధానికి భూములు ఇచ్చేందుకు అనేక గ్రామాల ప్రజలు అంగీకారం తెలిపారని తుళ్ళూరు మండల రైతు సంఘ నాయకుడు పువ్వాడ సుధాకర్ చెప్పారు. మరో రైతు నాయకుడు జొన్నలగడ్డ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ తాము రాజధానికి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ప్రభుత్వం ఏ మేరకు ప్రతిఫలం అందిస్తుందో తెలుసుకునేందుకు ఇలాంటి చర్చావేదికలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పలువురు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, పలు చేతి వృత్తుల వారు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజధాని తరలిస్తే గ్రామం తరఫున రూ.25 కోట్లు ఇస్తాం ఇక్కడ సింగపూర్ వంటి నగరాన్ని నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అటువంటిది ఏమీ వద్దు. రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తే మా గ్రామం తరఫున రూ. 25 కోట్లు చంద్రబాబుకు ఇస్తాం. మేము ఇక్కడ పది రకాల పంటలు పండిస్తున్నాం. హాయిగా జీవిస్తున్నాం. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. రాజధానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ బలవంతంగా భూములు లాక్కొని రాజధాని నిర్మించాలంటే మా శవాలమీద కట్టుకోమనండి. - బత్తుల జయలక్ష్మి, మహిళా రైతు, నిడమర్రు భూసమీకరణపై మంత్రులు తలోమాట: శివాజీ మంత్రులు భూసమీకరణపై తలా ఒక మాట మాట్లాడుతున్నారని, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావట్లేదని ముఖ్య అతిథి, రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ విమర్శించారు. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని వదిలేసి రైతుల భూమిని సమీకరించేందుకు చూస్తున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో 10 లక్షల అడుగుల భవనాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి నడపవచ్చని సూచించారు. విజయవాడ నగరాన్ని రాజధాని చేస్తామంటూ చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదని, కానీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని రైతు సంఘం నాయకుడు ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైన భూమిగా పేరొందిన భూములను రాజధానికి తీసుకోవడం సరికాదన్నారు. అభిప్రాయం చెప్పేందుకు సీఎం వద్దకు వెళుతున్న రైతులను బస్సుల్లో నుంచి దింపడం, ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టడం మంచిది కాదని డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ మండిపడ్డారు. కొందరు మంత్రులు కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరన్నట్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి మండిపడ్డారు. -
'అక్కడే ఏపీ రాజధాని నిర్మించాలి'
హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాల్సిందేనని మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ అన్నారు. ప్రజలకు దూరంగా పాలన అంటే అది వలస ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ శాఖలన్నీ గుంటూరు - విజయవాడ మధ్యే ఉన్నాయి కాబట్టి అక్కడే ఏపీ రాజధాని నిర్మించాలని సూచించారు. రాజధాని ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులన్నీ అక్కడ ఉన్నాయని చెప్పారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ప్రోత్సహించేందుకే రాజధాని నిర్మాణం ఇక్కడా..అక్కడా అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.